వైద్య వ్యాపారం
మీరు రోగికి సేవ చేస్తున్నారా? ప్రజల ఆరోగ్య సంరక్షణతో మీకు సంబంధం వుందా? ఆరోగ్యం విషయంలో ప్రజల హక్కుల పట్ల మీకు ఆసక్తి వుందా? నాసిరకం వైద్య సౌకర్యాలవల్ల నష్టపోతున్న ప్రజల గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? నిర్లక్ష్య వైద్యంవల్ల మీ సన్నిహితులెవరైనా ప్రాణాలు కోల్పోయారా? అయితే ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే. రోగులకూ వైద్యులకూ మధ్య పెరుగుతున్న అగాధాన్ని సరికొత్త కోణంలో కథలు కథలుగా విప్పిచెప్పే ఈ పుస్తకం తెలుగులో అపూర్వమైనది. తమ సన్నిహితులను కోల్పోయి న్యాయం కోసం పోరాడుతున్న వ్యక్తుల యదార్థ గాథలు, వారికి అండగా నిలిచిన న్యాయవాదుల వాదనలు, వ్యాపారంగా మారిన వైద్యం వల్ల ప్రజలకు కలుగుతున్న కష్ట నష్టాలు ఎన్నో ఇందులో వున్నాయి. నిర్లక్ష్య వైద్యం వల్ల అగచాట్ల పాలవుతున్న రోగులకు, వారి బంధువులకు ఒక ఆయుధంగా ఉపయోగపడగల విపుల సమాచార వేదిక ఈ పుస్తకం.
....
వైద్యానికి నైతిక చికిత్స
డాక్టర్ దేశాయ్‌కి,
నేను గత సంవత్సరం నుంచీ నానా యాతన పడుతున్నాను. ఏడ్వని క్షణమూ, పెడబొబ్బలు పెట్టని రోజు అంటూ లేదు. నా దుస్థితికి నీ అనైతిక, అమానవీయ ప్రవర్తనే కారణం. రెండు మూడు రోజులలో నేను భగవంతుని సన్నిధికి చేరుకుంటాను. ఈ సంవత్సర కాలంలో నిన్నూ నీ భార్యనీ శపించని రోజంటూ లేదు. నేనూ నా భర్తా ఎంత నరక యాతన వెళ్లదీశామో అవే పరిస్థితులు నీకు రావాలని ఆ భగవంతుడిని మరీ మరీ వేడుకుంటున్నాను. నీ భార్యకు సైతం నాకు పట్టిన గతే పట్టాలని కోరుకుంటున్నాను. నీ అహంభావంతో నన్ను కొద్దికొద్దిగా హత్య చేశావు. నువ్వు చేసిన ఈ పనిని దేవుడు ఎన్నడూ క్షమించడు.
ఇట్లు
లీలా సంఘి
ఈ ఉత్తరం రాసిన లీల డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ఎంతో నరకయాతన అనుభవించింది. ఆమె భర్త రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ పి.సి. సంఘీ. ఆయన ఈ విషయమై ముంబాయి హైకోర్టులో కేసు దాఖలు చేశారు. కాన్సర్ నిపుణుడు డాక్టర్ ప్రఫుల్ల దేశాయ్ నిర్లక్ష్యమే లీలను నరకయాతనకు గురిచేసింది. ఆమె ఎంతటి భయానక స్థితిని చవిచూసిందో చెప్పడానికి డాక్టర్‌కు ఆమె రాసిన ఈ చివరి ఉత్తరమే ప్రత్యక్ష్య సాక్ష్యం.
నర్సింగ్ హోమ్‌లు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ప్రభుత్వాసుపత్రులు ఒక్కటేమిటి అంతటా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ప్రదర్శిస్తున్న అశ్రద్ధ, అ లక్ష్యం రోగుల బతుకుల్లో నిప్పులు పోస్తోంది. అందుకు మనందరి అనుభవాలలో కూడా ఎన్నో సంఘటనలున్నాయి. అందరం ఏదో ఒక సమయంలో ఇటువంటి దారుణాలను చవిచూసిన వాళ్లమే. కానీ మనలో చాలామందిమి ఆ సంఘటనలను అక్కడే మరిచిపోయి మామూలు జీవితానికి అ లవాటుపడిపోతుంటారు. కానీ డాక్టర్ల మోసాలపై, వారి నిర్లక్ష్యంపై ముంబయికి చెందిన వైద్య మిత్రమండలి ... మెడికో ఫ్రెండ్స్ సర్కిల్ ... గత ఇరవైయేళ్ల నుంచి పోరాటం చేస్తోంది. వాళ్ల కృషి ఫలితమే ఈ పుస్తకం. ఇందులో వున్న నిజాల సంకలనంలోని చిన్న ఉదాహరణే పైన పేర్కొన్న ఉత్తరం.
ఈ పుస్తకంలో నేడు వైద్యరంగంలోని అవినీతిని, అక్రమాలను బయటకు తీసుకువచ్చేందుకు జరిగిన అపూర్వ కృషి వుంది. ఇంతకు ముందు పేర్కొన్న డా.ప్రఫుల్ల దేశాయ్ ఈ పుస్తకం వల్ల తనకు పరువు నష్టం జరుగుతోందని, దీనిని వెంటనే నిషేధించాలని ముంబాయి కోర్టులో కేసువేశారు. దాంతో ఈ పుస్తకం మహారాష్ట్ర లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
లీలా సంఘి కేసులో న్యాయమూర్తిగా వుండి రిటైరైన జస్టిస్ సురేష్ స్వయంగా ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. అందులో ఆయన - ప్రతి భారతీయునికి ఆరోగ్య సంరక్షణ లభించినప్పుడే జీవించే హక్కు (రాజ్యాంగం ఆర్టికిల్ 21) సార్థకం అవుతుందన్నారు. రాజ్యం దీనిని అమలుపరచకపోతే కోర్టుల ద్వారా, రిట్‌లద్వారా పోరాటం చేసి సాధించుకోవచ్చన్నారు. వైద్యవృత్తి నిర్లక్ష్యం వహిస్తే రోగి ఎవరైనా చుక్కలు లెక్కపెట్టుకోవలసిందే. ఈ పరిస్థితుల్లో రెండు వేల సంవత్సరాల నాటికి (!) అందరికీ ఆరోగ్యం అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ యిచ్చింది. ఇప్పటికీ మనం దాని దరిదాపుల్లోకి కూడా చేరుకోలేదు. చాలా ఏళ్లుగా న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సురేష్ వ్యక్తం చేసిన ఆవేదన వైద్య పరిస్థితి ఎంతగా చేజారిపోయిందో తెలియజేస్తుంది.
ఈ పుస్తకం మూడు విభాగాలుగా వుంది. వైద్య వ్యవస్థలో నెలకొన్న వాస్తవ పరిస్థితిని గుర్తించడానికి రేఖామాత్రంగానైనా విస్తరించడానికి మొదటి భాగం ప్రయత్నిస్తే ... రెండవ భాగంలో బాధితులకు సంబంధించిన నాలుగు కథనాలు పోరాట చిత్రణతో కూడుకుని వున్నాయి. మూడవ విభాగంలో ఆయా కేసులు రేకెత్తించిన అంశాలు, వివాదాలు, వాటి తీరుతెన్నులపై వ్యాసాలున్నాయి. వైద్య వృత్తి నైతిక బాధ్యతను ఈ విభాగం చిత్రిస్తుంది. మెడికల్ కౌన్సెళ్ల పనితీరును విశ్లేషిస్తుంది.
వైద్య వృత్తి ఆచరణలో నైతిక సూత్రాలు విడదీయలేనివి. నైతిక సూత్రాలు మంటగలిసిపోవడం వల్లే వైద్యుల దొంగలెక్కలు నడుస్తున్నాయన్న అభిప్రాయం బలంగా వుంది. ఈ దుస్థితివల్ల నిర్లక్ష్య వైద్యం, నైతికత, వినియోగదారుని సంరక్షణ వంటి అంశాలు చర్చనీయమైపోయాయి. డాక్టర్ల నిర్లక్ష్యం, నిర్లిప్తతలపై మూడవ భాగంలో విపులంగా చర్చ జరిగింది. ఇంగ్లీషు అనువాదానికి అనుబంధంగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు రాష్ట్రంలోని కొన్ని మెడికల్ కేసులను వాటి నిర్లక్ష్యాన్ని సోదాహరణంగా వివరించారు. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ పనితీరును దాని ఆశయాలను పేర్కొన్నారు. ఎస్. జగన్‌రెడ్డి, ప్రభాకర్ మందార అనువాదం కూడా ఎమోషనల్‌గా వుంది. ఈ పుస్తకం రోగులను, డాక్టర్లను, ప్రజలను అందరినీ ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు.
- సుంకరి పోషన్న (వార్త దినపత్రిక)
వైద్య వ్యాపారం
- అమర్ జెసాని, పి.సి. సింఘి, పద్మ ప్రకాశ్
ఆంగ్లమూలం : మార్కెట్, మెడిసిన్ అండ్ మాల్‌ప్రాక్టిస్
తెలుగు అనువాదం : యస్. జగన్ రెడ్డి, ప్రభాకర్ మందార
No comments:
Post a Comment