Friday, August 1, 2008

ఏడు తరాలు .... రూట్స్‌ ... ఎలెక్స్‌ హేలీ


ఏడు తరాలు
రూట్స్‌
సేచ్ఛ నుంచి సంకెళ్లకు ... సంకెళ్ల నుంచి విముక్తికి ... సాగిన ప్రస్థానం.

ఆఫ్రికా నుంచి అమెరికాకు బానిసల్ని కొనితేవటం 1619లో ప్రారంభమైంది.
కేవలం ఇరవై మందితో మొదలైన బానిసల సంఖ్య 1810 నాటికి పది లక్షలు దాటింది.
వాళ్లలో బలాత్కారంగా చెరబట్టి తెచ్చిన వాళ్ల సంఖ్యే ఎక్కువ.
నల్ల బానిసలు లేనిదే తెల్లవాళ్లకు తెల్లవారని పరిస్థితి యేర్పడింది.
నల్ల తల్లుల స్తన్యం తాగి తెల్ల శిశువులు పెరిగారు.
నల్లవాళ్ల నెత్తురు, చెమటల్లో తడిచి తెల్లవాళ్ల పొలాలు విరగపండాయి.
తెల్లవాళ్లు తమ లాభాల కక్కుర్తి, లైంగిక కుతి నీగ్రో మగ, ఆడ బానిసలతో తీర్చుకున్నారు.
ఎవరి శ్రమ తామనుభవించే వైభవోపేతమైన జీవితాన్ని ప్రసాదించిందో, వాళ్లని మానవ మాత్రులుగా కూడా పరిగణించలేదు తెల్లవాళ్లు.
పైగా మేం నాగరికులం, సంస్కృతీపరులం అని తమకు తాము ఓ క్రూరమైన అబద్ధం చెప్పుకున్నారు.
ఈ భయంకరమైన బానిస వ్యవస్థని బద్దలు కొట్టడానికి అనేక తిరుగుబాట్లు లేచాయి. వేలాది నల్ల బానిసల్ని విమోచన లక్ష్యం వైపు కదిలించిన, విప్లవాదర్శం వేపు నడిపించిన గేబ్రియల్‌, డెన్మార్క్‌ వెసీ, నాట్‌ టర్నర్‌ మొదలైన వాళ్లు తెల్లవాళ్లకి పట్టుబడి ఉరికంబాలెక్కారు. 1852లో హారియట్‌ బీచర్‌ స్టోవే నవల ...అంకుల్‌ టామ్స్‌ క్యాబిన్‌... అమెరికాలో అపూర్వ సంచలనం రేపింది. అదే సంవత్సరం ఫ్రెడరిక్‌ డగ్లస్‌ అనే నీగ్రో నాయకుని ప్రసంగాలు నల్లజాతి ప్రజల్ని కదిలించివేసాయి; మునుముందుకు నడిపించాయి....
1865 ఏప్రిల్‌ 9న అమెరికా అంతర్యుద్ధం ముగిసింది. అబ్రహాం లింకన్‌ బానిసత్వ నిర్మూలనను ప్రకటించాడు. అది నల్లవాళ్ల గుండెల్లో దీపాలను వెలిగించింది. అయితే అంతర్యుద్ధం ముగిసిన ఆరు రోజులకే అబ్రహాం లింకన్‌ని ఓ తెల్ల జాత్యహంకారి దారుణంగా కాల్చి చంపాడు. తెల్లవాళ్ల దాస్యం నుంచి విముక్తులయిన నల్లజాతి ప్రజలకు అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో భయంకరమైన వర్ణ వివక్ష ఎదురైంది.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక అమెరికాలో వర్ణ సంఘర్షణలు విజృంభించాయి. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో నల్ల తెల్ల రెండు జాతుల మధ్య స్పర్థలు, వైషమ్యాలు మరింత పెరిగాయి. తెల్ల ప్రభుత్వ చెరసాలలు, ఉరికొయ్యలు నల్లజాతి ప్రజల సమతా కామనని తుడిచిపెట్టలేకపోయాయి. మౌంట్‌ గోమరీ ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం వారిని జాగృతం చేసి అనేక విజయాలను అందించాయి. జాత్యహంకారాన్ని ప్రతిఘటించందే, సమాన హక్కుల కోసం పోరాడందే అమెరికాలో నల్లజాతికి విముక్తి లేదని చరిత్ర స్పష్టం చేసింది.
తెల్లవాళ్లు దాతలుగా, నల్లవాళ్లు గ్రహీతలుగా వుండే వ్యవస్థ పోయి సమాన భాగస్వాములుగా వుండే సామాజిక వ్యవస్థ కోసం అమెరికాలో నల్లజాతి పోరాడుతోంది. ఆ పోరాట ప్రతిధ్వనులను ఎలెక్స్‌ హేలీ ఏడుతరాల లో వినవచ్చు.
ఆరు తరాల వెనక అట్లాంటిక్‌ మహా సముద్రాని కావల ఆఫ్రికా చీకటి ఖండంలో తన వంశమూల పురుషుని (బానిస వ్యాపారులైన మానవ మృగాలకు చిక్కి బానిసగా మారి అమెరికాకు తీసుకు రాబడ్డ ...కుంటా కింటే) పుట్టు పూర్వోత్తరాలని వెతికి వెలుగులోకి తేవాలనే సంకల్పం ఆయనకి 1962లో కలిగింది.
పన్నెండు సుదీర్ఘ సంవత్సరాల ఎడతెగని అన్వేషణ, అధ్యయనం, పరిశోధనల ఫలితం ... రూట్స్‌ ... నవలగా రూపుదిద్దుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది. ఒక్క అమెరికాలోనే 25 లక్షల మేలి ప్రతులు అమ్ముడయ్యాయి. ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ దేశాలలో పది లక్షల ప్రతుల చొప్పున ఖర్చయ్యాయి. 30 దేశాలు ఈ పుస్తక ప్రచురణ హక్కులు కొనుక్కున్నాయి.
అమెరికాలో చదవటం వచ్చిన ప్రతి నల్ల వ్యక్తీ యీ పుస్తకం కొన్నాడు. చదువు రాని ప్రతి నల్ల మనిషీ దీన్ని కొని బైబిల్లా భద్రంగా దాచుకున్నాడు. తమ పూర్వులు చేసిన పాపాలకు కృంగిపోయి తలవాల్చుకున్న ప్రతి తెల్లవాని కళ్లూ ఈ పుస్తకంలో కూరుకుపోయాయి.
ఆఫ్రికాలో కుంటా కుంటే పుట్టిన జపూరును గాంబియా ప్రభుత్వం జాతీయ స్మారక చిహ్నంగా గౌరవించింది.
ఇంతటి గొప్ప పుస్తకాన్ని తెలుగులో వెలువరించడానికి అడిగిన వెంటనే ఆదరంతో అనుమతించిన ఎలెక్స్‌ హేలీకి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఎంతో ఋణపడి వుంది. ఐ వుడ్‌ లైక్‌ టు హావ్‌ రూట్స్‌ పబ్లిష్డ్‌ ఇన్‌ తెలుగు అని ఆయన ప్రేమగా భుజం తట్టారు.
మూలంలో ఈ పుస్తకం (రూట్స్‌) 688 పేజీలుంది. యధాతథంగా తెలుగులోకి తెస్తే పాఠకులపైన భరించలేని భారం (వెల దృష్ట్యా) పడుతుందనే భయంతో సంక్షిప్తీకరించి ప్రచురించవలసి వచ్చింది. అయితే మూలంలోని పొంకాన్ని కుంటుపడనీయకుండా, సారాన్ని పలచబర్చకుండా సంక్షిప్తంగా, శక్తివంతంగా తెలుగులోకి తేవటానికి ప్రయత్నించాం. ఈ పుస్తకం రూపు దిద్దుకోవటానికి ఎంతో శ్రద్ధతో, బాధ్యతతో శ్రమించిన స్వర్గీయ సహవాసికి మా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాం.
-హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ఏడు తరాలు
ఆంగ్ల మూలం : రూట్స్‌
రచన : ఎలెక్స్‌ హేలీ
తెలుగు అనువాదం : సహవాసి
ప్రథమ ముద్రణ : 1980
పునర్ముద్రణ : 1983, 1990, 1994, 1997, 1999, 2001, 2005, 2006, 2007
194 పేజీలు, వెల: రూ.60/-

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌