సేద్యగాని చర్నాకోల
జ్యోతీ బా ఫూలే
జ్యోతీరావు గోవిందరావు ఫూలే సాగించిన ఉద్యమం, రచనలు అన్నీ అందరికీ తెలియవు. ఆయన సామాజిక సమత్వం కేవలం సాంస్కృతికమైన అంశాలకు పరిమితమైనది కాదు. శూద్ర అంటరాని కులంలో చదువు ఆలోచనకు అంకురార్పణ చేసినవాడాయన. అందుకోసం స్వయంగా పాఠశాలలను నడిపారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ స్వయంగా ఫూలేను తన గురువుగా చెప్పుకున్నారు.
ఫూలే పుస్తకాలలో గులాం గిరీ ఒక సంచలనం. బ్రాహ్మణ ఆధిపత్యంలోని హిందూమతం సాగించిన కుట్రపూరితమైన దాడులను మహా విష్ణువు దశావతారాలుగా నిరూపించి కొత్త చరిత్రకు పునాదులు వేశారు. అయితే విషాదం ఏమిటంటే చారిత్రక వాస్తవాలను తవ్వి ప్రజలకు పంచే పనిని మన పరిశోధకులు ఇంకా ప్రారంభించలేదు.
అటువంటి మరో పుస్తకం షేఠ్ కార్యాంచ అసూద్. దీనిని ఫూలే మరాఠీలో రాశారు. దీన్నే కల్టివేటర్ విప్‌కార్డ్ పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. ఇప్పుడు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ సేద్యాగాని చర్నాకోల పేరిట తెనిగించారు (హారతీ వాగేశన్). 1881లో అచ్చయిన ఈ పుస్తకం నాటి రైతుల దయనీయ స్థితికి అద్దంపడుతుంది. ఈ పరిస్థితులకు బ్రిటిష్ ప్రభుత్వాధికారులు, బ్రాహ్మణ పూజారి వర్గం ప్రత్యక్ష కారణాలని ఫూలే ఉదాహరణలతో వివరించారు. దీనితోపాటు నాటి రైతుల సంక్షేమం కోసం ఎన్నో సూచనలు చేశారు. పందొమ్మిదో శతాబ్దంలో మహారాష్ట్ర ప్రాంతంలోని సామాజిక పరిస్థితులు, వలస పాలన ప్రభావం ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఇది ఈనాటి పరిస్థితులకు కూడా ఎంతో దగ్గరగా వున్నట్టు అనిపిస్తుంది. ఫూలే అంచనాలను, ఆయన వెలికి తీసిన సత్యాలను ఇంకా ఎవరూ అందుకోలేదని అనిపిస్తుంది. ఈ 72 పేజీల పుస్తకంలో ఐదు అధ్యాయాలు, రెండు అనుబంధాలు వున్నాయి.
మొదటి అధ్యాయం ఫూలే మేధోపాటవానికి, ఆలోచనలలోని చిక్కదనానికి నిదర్శనం. రైతాంగాన్ని బ్రాహ్మణవర్గం ఎన్ని రకాల ఆర్థిక దోపిడీకి గురి చేసిందో ఈ అధ్యాయం వివరిస్తుంది. మహిళ సమర్తాడినప్పటి నుంచి ఈ తంతు మొదలవుతుంది. ఆమె బహిష్టు కావడం వల్ల మైల ఏర్పడిందని దాని నివారణకు పూజలు, ప్రార్థనలు చేసి, భట్ బ్రాహ్మణులు వారి బంధువులు రైతుల దగ్గర నుంచి నెయ్యి, బియ్యం, గోధుమలు ఇతర ధాన్యాలు పొందుతారు. ప్రతిగా వారు ఆ మహిళలకు శనివారం ఉపవాసం వుండమని, చతుర్థిరోజు పూజలు నిర్వహించమని ఇది శుభమని చెపుతారు అంటూ మొదలుపెట్టి వారానికి ఏడురోజులు, రోజుకు ఇరవై నాలుగు గంటలు ప్రజల జీవితాలలో సంభవించే అన్ని సంఘటనలలో జోక్యం చేసుకొని, చావు, పుట్టుక మధ్య ఆయా సందర్భాలను తమ ఆర్థిక పరిపుష్టికి ఉపయోగించుకుంటారని ఫూలే వివరించారు.
తెల్లజాతి ఉద్యోగుల భోగలాలసత రైతును దుర్భర స్థితికి తీసుకెళ్లిన క్రమాన్ని రెండవ అధ్యాయంలో వివరించారు. మూడవ అధ్యయంలో బ్రాహ్మణుల పుట్టుపూర్వోత్తరాలు, రైతుల మీద ప్రభుత్వం విధించే పన్నులు, వాటి భారం గురించి, నాలుగో అధ్యాయంలో రైతుల కడగండ్ల గురించి వివరించారు. ఐదవ అధ్యాయంలో రైతు శ్రేస్సుకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను సూచించారు.
ఇవాళ రైతుల పరిస్థితి గురించి, సాగు గురించి ఎంతో చర్చ జరుగుతున్నది. అయితే గతకాలపు రైతు స్థితిపై ఇప్పటి వారికి అవగాహన లేదు. కొంత సమాచారం వున్నా ఫూలేకు వున్న దృష్టికోణం లేదు. కాబట్టి నాటి స్థితిగతుల ఆధారంగా నేటి దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఫూలేలోని ఆర్థికవేత్తను అర్థం చేసుకోవడానికి కూడా ఈ పుస్తకం ఉపకరిస్తుంది.
- మల్లేపల్లి లక్ష్మయ్య, ఆదివారం ఆంధ్రజ్యోతి, 19 ఫిబ్రవరి 2006
సేద్యగాని చర్నాకోల
జ్యోతి బా ఫూలే
మరాఠీ మూలం: షేఠ్ కార్యాంచ అసూద్
ఇంగ్లీషు : కల్టివేటర్స్ విప్‌కార్డ్
తెలుగు అనువాదం : హారతీ వాగీశన్
72 పేజీలు వెల రూ.20
No comments:
Post a Comment