Tuesday, August 5, 2008

మా కొద్దీ చండాలం - గీతా రామస్వామి, విమల


మా కొద్దీ చండాలం

గీతా రామస్వామి, విమల


అన్ని భాషల్లోకి రావలసిన మాకొద్దీ చండాలం:

మలాన్ని ఎత్తే పాకీ పనివారి దుర్భర జీవితచిత్రం ఈ అపురూపమైన పుస్తకం. వృత్తులు అగ్రకులాలలో ఐచ్ఛికంగా ఎంచుకునేవి కాగా, దళితులపై మాత్రం వృత్తి రుద్దబడింది. మలాన్ని చూడటం, తాకడం, దాని గురించి మాట్లాడడం అసహ్యంగా భావించే నాగరిక సమాజంలో దానిని చేతులతో ఎత్తే దురవస్థ నుంచి విముక్తిని కోరుతూ ఒక బెజవాడ విల్సన్‌, ఒక సఫాయీ కర్మచారి ఆందోళన్‌ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. దీని ఫలితంగానే నేనెందుకు ఈ పాకీ పని చేయాలి? మీలాగ బతకాలని నాకుండడం తప్పా? అని ప్రశ్నించే సంజయ్‌లు బయలుదేరారు.

ఒక నేరాన్ని కులం ప్రాతిపదికగా శిక్షించే ఈ వ్యవస్థలో గాంధీ లాంటి వారు బిడ్డ మలాన్ని ఎత్తిపోసే తల్లిలాగా, పాకీ వారుసమాజ మలాన్ని ఎత్తి పోస్తున్నారు అంటూ దానినొక విలువగా కీర్తించారు. అగ్రకులాల వాళ్లు తప్పని పరిస్థితులలో ఈ అమానవీయ వృత్తిలో కొనసాగినా, పుట్టుకతో ఆ వృత్తిలో కొనసాగే దళితులు ఎదుర్కోనే అవమానాలను మాత్రం వారు ఎదుర్కోరు. మతాంతీకరణ మేలు చేస్తుందనే భ్రమలో పాకీవారెవరైనా మతం మారినా పాకీ పని మాత్రం వారికి తప్పడం లేదు. ఆధునీకరణ (ఫ్లష్‌ టాయ్‌లెట్లు, డిటర్జెంట్లు, టాయ్‌లెట్‌ క్లీనర్లు) పాకివారి ఉపాధిని దెబ్బకొట్టిందే గానీ, ఆ వృత్తిని నిర్మూలించలేకపోయింది. ప్రభుత్వం దీనిని నిషేధించినా ప్రభుత్వ యంత్రాంగం వీరినే వెతికి పట్టుకుని ఈ పనిచేయిస్తున్నది. వీరి పట్ల అమలవుతున్న హింసతో తమకు సంబంధం లేదని ఏ రాజకీయ నిర్మాణాలు తప్పించుకోజాలవు అన్న రచయిత్రుల పరిశీలన సరైందే. వామపక్షాలకు కూడా తమ ఎజెండాలలో దీన్నీ చేర్చే పరిణితి, సంస్కారం లేకుండా పోయింది.

ఒక రచన కోసం ఎక్కడెక్కడి రిఫరెన్స్‌లో పోగేయటం ఒక తంతు అయిన స్థితిలో అందుకు భిన్నమైన రిఫరెన్స్‌ లను మనం దీనిలో చదువుతాం. ఒక సమస్య, దాని చుట్టూ అ ల్లుకుపోయిన అనేక అంశాల కూలంకష పరిశోధన ఈ రచనలో ప్రతిబింబిస్తాయి. ఆ వృత్తిలోని వారితో మాట్లాడుతూ, ఆ ప్రదేశాలన్నీ తిరిగి, వారి జీవితాలలో ఒక మార్పును ఆశిస్తూ గీతా రామస్వామి (హెచ్‌బిటి), లాయర్‌ విమల (విరసం) ఈ పుస్తకం రాశారు. ఇది వొట్టి పుస్తకం కాదు. ప్రజలకు మరో మేనిఫెస్టో.

-జెన్నీ (ఆదివారం ఆంధ్రజ్యోతి 19 జూన్‌ 2005)

మనం మారుదాం, వారినీ మారుద్దాం:

సమాజంలో అట్టడుగు వర్గాల వారెవరు? అని ప్రశ్నిస్తే - మరుగుదొడ్లను శుభ్రం చేసే పారిశుధ్య పనివారనే సమాధానం లభిస్తుంది. ఈ అధోజగత్సహోదరుల గురించి పట్టించుకొనేవారు, సానుభూతి చూపేవారు వాస్తవ సమాజంలోనూ లేరు, సాహితీ జగత్తులోనూ లేరు. మేం అభ్యుదయ కవులం, విప్లవ రచయితలం అని ముద్ర వేయించుకునేవారిలో అభ్యదయం, విప్లవం ఎంత వున్నాయో అందరికీి తెలిసిందే. ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ వంటి మేధావి రచయితలు ఎక్కడో...ఎప్పుడో అరుదుగా వస్తూంటారు. ఆయన రాసిన అన్‌టచ్‌బుల్‌ నవలలోని బఖాలు నేటికీ మన కళ్లెదుట కనిపిస్తూనే వుంటారు. కానీ, ఏ అభ్యుదయవాది వారి జీవితాల్ని మార్చగలుగుతున్నాడు? ఏ మానవ హక్కుల సంస్థలు వారికోసం పోరాడుతున్నాయి? ఈ తరహాలో ఆలోచించేవారికి మరింత సామాజిక చైతన్యం కలిగించేదే మా కొద్దీ చండాలం పుస్తకం.

హైటెక్‌ నగరాలు, హైటెక్‌ సంస్కృతి అంటూ మురిసిపోతుంటాం గానీ - మన హైటెక్‌లో టెక్కు ఎంత వుందో రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ ఇంకా అట్లాగే వున్న 75 శాతం గ్రామ ప్రాంతాలను చూస్తే తెలుస్తుంది. నేటికీ ఇంకా ఇళ్లల్లో, బహిరంగ ప్రదేశాల్లో వున్న వేలాది వ్యక్తిగత, సామూహిక డ్రై లెట్రన్‌ లు, వాటి కోసం ఇంకా పారిశుధ్య వృత్తినే కొనసాగిస్తున్న అట్టడుగు వర్గాల ప్రజలను చూస్తే బాబూ, నీ హైటెక్కు ఇదేనా అని ప్రశ్నించవలసి వుంటుంది. ఆధిపత్య కులాలు, సంపన్న వర్గాల వారి దృక్పథాలలో మార్పు లేనందువల్లే కొన్ని బడుగువర్గాలు ఈ దుస్థితిలో వుండిపోతున్నాయి. పాకీ పనిని నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసినా, దాన్ని అమలుపరచలేని వైఫల్యంలో వుంది. అటువంటి దయనీయ స్థితిలో దళితులు ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారో, ఇప్పటికీ ఆ వృత్తిని ఎందుకు కొనసాగించవలసి వస్తున్నదో, ఆ దీన ప్రజల జీవితాలు ఎంత దుర్భర పరిస్థితిలో వున్నాయో - ఈ పుస్తక రచయిత్రులు గీతా రామస్వామి, విమల చక్కగా విశ్లేషించారు.

చీరాల, నందికొట్కూరు, మరికొన్ని ప్రాంతాలలో అనేకమంది సఫాయి కర్మచారులను కలిసి, వారి జీవన స్థితిగతులను అధ్యయనంచేసి, ఎంతో సమాచారాన్ని ఈ రచయిత్రులు అందించారు. పైసీల గురించి, భంగీల గురించి, చుహర్‌ల గురించి (పారిశుధ్య పనివారి నామాంతరాలు) వివరించిన విషయాలు ప్రతి పాఠకుని ఎంతో ఆలోచింపచేసి మన వ్యవస్థ ఎంత దుస్థితిలో వుందో సాక్షాత్కరింపజేస్తుంది.

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా, ఫ్లష్‌ టాయ్‌లెట్లు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ కొన్నిచోట్ల వున్నా - చివరికి ఏదో ఒక దశలో మళ్లీ మాన్యువల్‌ అవసరమవుతూనే వుంటుంది. మళ్లీ అక్కడ ఈ పారిశుధ్యపనివారి కోసమే వెదకడం జరుగుతుంటుంది. మరి ప్రభుత్వ చట్టాలు ఏమైపోతున్నాయి? వైట్‌ కాలర్‌ ప్రభుత్వ సిబ్బంది మళ్లీ ఆ పారిశుధ్య పనులను చేయిస్తున్నది - ఆ ఒక కులం వారితోనే కదా! వారికి సంబంధించిన అనేక వివరాలు, ఆ వృత్తి వారికి వేరే ఉపాధి కల్పించాలంటూ జరిగిన, జరుగుతున్న ఆందోళనలు, వారి జీవన స్థితిగతులు, ప్రభుత్వం, సాటి ప్రజల దృక్కోణం మారవలసిన అవసరాన్ని సూచిస్తూ అందరిని ఆలోచింపజేసేలా ఈ రచయిత్రులు ఈ పుస్తకాన్ని రూపొందించారు.

డ్రైనేజీలలోకి దిగి పనిచేసే కార్మికులు ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా చాలా ప్రమాదకర పరిస్థితుల్లోపనిచేస్తున్నారు. అధికారులే వారిచేత ఆ పనులు చేయిస్తున్నారు. మరి ఈ సమాజాన్ని సంస్కరించేదెవరు? బెజవాడ విల్సన్‌ వంటి వ్యక్తులు ఎంతో మంది ముందుకు వచ్చి ఈ సమాజాన్ని ఓ కుదుపు కుదిపితేగానీ మార్పురాదనే అనిపిస్తుంది. ప్రజల కళ్లు తెరిపించే పుస్తకం ఇది.

ముల్క్‌ రాజ్‌ ఆనంద్‌ అన్‌టచబుల్‌ నవలలోని బఖా ఒకచోట తండ్రితో ఇలా అంటాడు: ... మనం మురికిగా, అపరిశుభ్రంగా వున్నామని వాళ్లు అనుకుంటూ వుంటారు. ఎందుకంటే వాళ్ల మురికినంతటినీ మనం శుభ్రం చేస్తాం గనక ...అని. అటువంటి బఖాలు మనచుట్టూ చాలా మంది వున్నారు. మనం మారదాం, వాళ్లనీ మారుద్దాం.

ఎ. సునీల్‌ చంద్ర (వార్త 8 మే 2005)

మా కొద్దీ చండాలం

రచన : గీతారామస్వామి, విమల

128 పేజీలు, వెల : రూ.15

4 comments:

 1. తెలుగులో సఫాయీ కర్మచారులు అనరు. పారిశుధ్ధ్య కార్మికులంటారు.

  ReplyDelete
 2. పారిశుధ్ధ్య కార్మికులు అనే పదాన్ని ప్రభుత్వం, పత్రికలు వినియోగిస్తున్నాయి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ అంతటా ముఖ్యంగా పారిశుధ్ధ్య కార్మికులలో సఫాయి కర్మచారులు అనే పదమే ఎక్కువగా వాడుకలో వుంది.

  ReplyDelete
 3. ee pusthakam chala viluvainadi. andaru chadavali.. aalochinchali.. bhavani

  ReplyDelete
 4. ధన్యవాదాలు దేవి గారూ.

  ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌