Thursday, August 14, 2008

నల్లపొద్దు దళిత స్త్రీల సాహిత్యం 1921-2002 సంపాదకులు గోగు శ్యామల


నల్లపొద్దు

దళిత స్త్రీల సాహిత్యం 1921 - 2002

సంపాదకులు : గోగు శ్యామలతెలుగు భాష సంస్కృతీకరణకు, ఆంధ్రీకరణకు, హైందవీకరణకు గురవుతున్న నేపథ్యంలో ప్రాంతీయ భాషా పరిమళాలు కలుషితమవుతూ, పరాయీకరణకు గురవుతూ తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. వాటిని కాపాడుకోవాలంటే ఉన్నత విద్యతో ప్రమేయం లేకుండా సాహితీ ప్రపంచంలో అట్టడుగు, వెనుకబడిన కులాల, తెగల స్త్రీ పురుషుల భావాలు నిరంతరం గుబాళించగలిగే వాతావరణాన్ని సృష్టించుకోవాలి.

....

దళిత సాహిత్యం లోని వేగుచుక్కలు ఈ నల్ల పొద్దులు

దళిత స్త్రీలు రచించిన సాహిత్యాన్ని తొలిసారిగా పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన ఘనత గోగు శ్యామలది. నిజానికి ఇది చిన్నపనికాదు. అన్వేషి వారి సహాయ సహకారాలతో చేయగలిగింది. ఈ పుస్తకం చూడగానే చాలా సంతోషమన్పించింది. దీని వెనుక వున్న అకుంఠిత దీక్ష, శ్రమ కన్పించాయి.

1988లో నేను రీసెర్చ్‌ చేస్తున్న రోజుల్ని గుర్తుకు తెచ్చింది. కవయిత్రుల కవిత్వంలో స్త్రీ మనోభావాల్ని పరిశోధన చేయాలన్న నా తపనకు రెండు యూనివర్సిటీలు అనుమతినివ్వలేదు. మూడో యూనివర్సిటీ వాళ్లు కూడా చాలా అభ్యంతరపెట్టారు. అసలు కవిత్వం రాసిన స్త్రీలే లేరు. వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వాళ్లు రాసిన కవిత్వమూ లేదు. దానిపై పరిశోధనలేమిటి? ఫ లానా రచయిత రచనలు పరిశీలన చెయ్యి బాగుంటుంది అన్నారు.

అభ్యంతర పెట్టిన కొద్దీ నాలో పట్టుద ల పెరిగింది. ఎందుకు కవయిత్రులు ఎక్కువగా లేరు? సమాజమా, సాహిత్యమా ఎవరు కారణం? ఏ రాజకీయ, సామాజిక ఆర్థిక పరిస్థితులు కారణం? స్త్రీలు నిజంగానే బ లహీనులా? అణచివేయబడ్డారా? కావాలని స్త్రీలని చరిత్ర మరుగున పడేసిందా? ఇవన్నీ పరిశీలిస్తే అది పరిశోధన కాదా? అని వాదించి మొదలుపెట్టాను.

తవ్విన కొద్దీ శిథి లా ల నుంచి మణులూ, మాణిక్యాలూ అనేకం బయటపడ్డాయి. వందలాది మంది కవయిత్రులను వెలికి తీయగలిగాను.

సరిగ్గా అటువంటి ప్రయత్న ఫలితమే గోగు శ్యామల నల్లపొద్దు సంకలనం. ఇందులో 54 మంది దళిత స్త్రీల రచనలున్నాయి. వాళ్ల జీవిత వివరాలూ, ఇంటర్వ్యూలూ వున్నాయి.

సామాజికపరమైన హింసను స్త్రీలు అనుభవిస్తున్నారు. సామాజిక హింసతో పాటు, కుల హింసను కూడా దళిత స్త్రీలు అదనంగా ఎదుర్కొంటున్నారు. చాలా తక్కువ కులాలవారిగా పరిగణించబడుతూ, తమను బలవంతంగా హీనస్థితిలోకి నెడుతున్న వ్యవస్థను ప్రశ్నించి, ధిక్కరించి, నిలబడి పోరాడుతున్న నేటి దళితోద్యమ చరిత్రలో విస్ఫులింగాలు ఈ రచయిత్రులు.

వారి వారి ప్రాపంచిక దృక్పథాన్నుంచి, రాజకీయ అవగాహననుంచి, స్త్రీవాద నేపథ్యాన్నుంచి, అక్షరాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. ప్రశ్నతోనే జ్ఞానం ఉదయిస్తుందనీ, పోరాటంతోనే స్వేచ్ఛ లభిస్తుందనే వాస్తవాన్ని గ్రహించి నిలబడ్డ ధీర వనితలు.

ఇందులో 1890ల నుంచి రచనలు చేస్తున్న వారున్నారు. గుల్చానమ్మ, జ్ఞానరత్నమ్మలపై కూడా రాజకీయాల ప్రభావం సంస్కరణోద్యమ, స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి కనిపిస్తాయి. హిందూ మతం - క్రైస్తవ మతం మధ్య సంఘర్షణకు గురైన సందర్భాల్ని కూడా వారు తమ రచనల్లో వ్యక్తీకరించారు.

ఈ రచనల్లో అస్తిత్వ ఘర్షణ, నిరంతర పోరాట స్ఫూర్తి కన్పిస్తాయి. పసిపిల్లల అంతరంగిక దృశ్యాలు, దళిత స్త్రీల కలలు, కలల సౌధాలు, వాస్తవ జీవిత చిత్రపటాలు, మానవత్వం గొప్పదన్న అభిప్రాయ ప్రకటనలు, శ్రమ సౌందర్య కీర్తనలు, వారి వ్యక్తిగత జీవితాల్లో సంఘర్షిస్తున్న అనేకానేక సూక్ష్మాంశాలను సైతం ప్రదర్శించారు.

-శిలాలోహిత , భూమిక, జులై, ఆగస్ట్‌ 2003

నల్లపొద్దు

దళిత స్త్రీల సాహిత్యం 1921 - 2002

సంపాదకులు : గోగు శ్యామల

396 పేజీలు, వెల రూ.50


1 comment:

  1. Next time when I come to hyderabad, I am definitely going to buy this book.
    your blog is very informative for book lovers.
    -Thanks

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌