Thursday, August 7, 2008

నీలి నీడ - ఆస్ట్రేలియా ఆదివాసీ అమ్మాయి ఆత్మకథ



నీలి నీడ

ఆస్ట్రేలియా ఆదివాసీ అమ్మాయి ఆత్మకథ

పసితనంలోనే తల్లితండ్రులకు, తెగకు దూరమై, క్రిస్టియన్‌ హోమ్‌లకు చేరి, అన్నీ పోగొట్టుకుని, కేవలం తెల్లవారి ఇళ్లల్లో పనివాళ్లుగా మిగిలిపోయిన ఎంతోమంది ఆస్ట్రేలియా ఆదివాసీల అనుభవాలకు, మనోగతాలకు దర్పణం పడుతుందీ ఆత్మకథ. నల్లజాతి వాళ్లను నాగరికులను చేశామని, ఉద్దరించామని డంబాలు పలికే తెల్లజాతి వారి నాగరికతను బట్టబయలు చేసి, తమ చరిత్రను తామే రాసే ప్రయత్నంలో వున్న ఆస్ట్రేలియా ఆదివాసీల సాహిత్యంలో మరో మైలురాయి ఈ పుస్తకం. 1987లో ప్రచురితమైన గ్లెనైస్‌ వార్డ్‌ ఆత్మకథ ... వాండరింగ్‌ గర్ల్‌ ... ఓ నల్ల బానిస అమ్మాయి అనుభవాలను, స్వేచ్ఛా ప్రపంచంలోకి ఎగిరిపోవడానికి ఆమె జరిపిన పోరాటాలను కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తుంది.

....

1798లో మొదలైన బ్రిటీషు వలసలు ఆస్ట్రేలియా ఆదివాసీల జీవితాల్లో కల్లోలాన్ని సృష్టించాయి. వేలాది సంవత్సరాల వారి సంస్కృతి, సహజీవనం, స్వాతంత్య్రం సర్వనాశనమయ్యాయి. మొదట్లో బ్రిటను నుండి నేరస్థులను పంపే కాన్విక్ట్‌ కాలనీ గా మాత్రమే ఉదయోగపడ్డ ఆస్ట్రేలియా మెల్లగా బ్రిటీషు వలసవాదులకు ఓ స్వర్గంగా మారిపోయింది.

భూమిని అతి పవిత్రంగా భావించే ఆస్ట్రేలియా ఆదివాసీలకు మొట్టమొదట దూరమైంది వాళ్లు వేలాది ఏళ్లుగా నివసిస్తున్న ఆ భూమే. మనుషులు భూమికి చెందుతారు కానీ భూమి మనిషికి చెందదని నమ్మే ఆదివాసీలను క్రూరంగా చంపేశారు. వాళ్లతో హ్యూమన్‌ గోల్ఫ్‌ ఆడుకున్నారు. ఆదివాసీలు ఉపయోగించే నీటి గుంటల్లో విషం కలిపారు. విషం కలిపిన గోధుమ పిండిని, చక్కెరను వారికి పంచారు. బ్రిటన్‌లో ప్లేగు, కలరా వంటి భయంకర వ్యాధి పీడితులు వాడిన రగ్గులను ఆదివాసీకు పంచిపెట్టారు. ఇవన్నీ తట్టుకుని బ్రతికిన కొద్దిమందిని రిజర్వుల్లోకి తరలించారు. అక్కడ ఆదివాసీల మీద సంపూర్ణ ఆధిపత్యం తెల్లవాళ్లదే.

ఆవిధంగా భూమిని, భాషను, మతాన్ని సంస్కృతిని, స్వాతంత్య్రాన్ని, అస్థిత్వాన్ని పోగొట్టుకున్న ఆదివాసీలు తమ భూమి మీద తామే పరాయివాళ్లుగా మిగిలిపోయారు. ఎన్నో పోరాటాల తరువాత 1967లో మాత్రమే ఆదివాసీలకు పౌరసత్వపు హక్కుల్ని ఇచ్చారు తెల్లవాళ్లు.

నాగరికత పేరుతో స్వతంత్రులను బానిసలుగా మార్చే తెల్లవాళ్ల కుటిల ప్రయత్నాల్లో ఎక్కువగా నలిగిపోయిందీ, నష్టపోయిందీ ఆదివాసీ ఆడవాళ్లేనని చెప్పాలి. తెల్లవారి కామదాహానికీ, క్రూరత్వానికీ బలైన ఆదివాసీ స్త్రీలు మాతృత్వాన్ని కూడా ఆస్వాదించలేకపోయారు. తెల్లవారి రక్తం వున్న పిల్లల్ని పెంచడానికి ఆదివాసీ స్త్రీలు అర్హులు కారని, తెల్లవారి రక్తం వున్న పిల్లలను సులభంగా మనుషులుగా మార్చొచ్చని (ఆదివాసీలు తెల్లవారి దృష్టిలో మనుషులేకారు), విద్యపేరుతో పిల్లలను అయినవారికి, సంస్కృతికి దూరం చేశారు. క్రిష్టియన్‌ మిషన్లలో పెరిగిన ఆ పిల్లలకు తెల్లవారి ఇళ్లల్లో పనిమనుషులుగా వుండడానికి శిక్షణ యిచ్చేవాళ్లు. అట్లాంటి ఓ అమ్మాయి కథే వాండరింగ్‌ మిషన్‌లో పెరిగిన ఈ వాండరింగ్‌ గర్ల్‌ (నీలి నీడ). ఇటు తెల్లవారి సమాజంలోనూ, అటు ఆదివాసీ సమాజంలోనూ చోటు, ఆదరణ లేని ఇలాంటి ...హాఫ్‌ కాస్ట్‌ లు ... నరకయాతనను అనుభవించారు. ఇంకా అనుభవిస్తున్నారు.

ఇలాంటి దారుణమైన అనుభవాలనుంచి, ఆ దారుణాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలలోంచి వచ్చిందే ఆదివాసీ సాహిత్యం. ఎక్కువగా రచయిత్రుల ఆత్మకథలు కనిపించే ఈ సాహిత్యం మానసికోల్లాసం కాకుండా ఉద్యమ ప్రయోజనమే ధ్యేయంగా పనిచేస్తుంది.

తమ అనుభవాలను తమవారితో పంచుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు తెల్లజాతివారికి తమ నిరసనను తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తుందీ సాహిత్యం.

ఆత్మకథలోనే జాతికథను కూడా పొదుగుతుందీ సాహిత్యం.

సాహిత్యం చరిత్ర స్థానాన్ని ఎలా ఆక్రమించగలదో నిరూపిస్తుందీ సాహిత్యం.

నీలి నీడ

ఆస్ట్రేలియా అమ్మాయి ఆత్మకథ

ఆంగ్లమూలం : వాండరింగ్‌ గర్ల్‌

రచన : గ్లెనైస్‌ వార్డ్‌

తెలుగు అనువాదం : కె. సునీతా రాణి (లెక్చరర్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ యునివర్సిటీ, ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌)

100 పేజీలు, వెల : రూ.30

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌