Thursday, August 7, 2008

ప్రాంతీయ అసమానతలు ప్రత్యేక తెలంగాణ - సిహెచ్‌. హనుమంతరావు


ప్రాంతీయ అసమానతలు

ప్రత్యేక తెలంగాణ

-సిహెచ్‌. హనుమంతరావు

ప్రాంతీయ అసమానతలు, ప్రత్యేక తెలంగాణ అనువాదం వెనుక ఒక ప్రత్యేకమైన నేపథ్యం వుంది. నేటి తెలుగు సమాజంలో ప్రత్యేక తెలంగాణ నినాదం సంతరించుకొన్న ప్రాముఖ్యత, రాష్ట్ర భవితవ్యాన్ని ప్రభావితం చేయడంలో తెలంగాణ ఉద్యమానికున్న విశిష్టతతోపాటు దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఆవశ్యకత గురించి కొనసాగుతున్న చర్చలే ఈ తెలుగు ప్రచురణకు ప్రేరణ.

అభివృద్ధి అసమానతలుగల అన్ని ప్రాంతాలు వేర్పాటు ఉద్యమాలకు నెలవుకాలేదు. అదేవిధంగా ప్రాంతీయ అసమానతలకు గురైన అన్ని ప్రాంతాలు ఒకే రీతిలో లేవు. చారిత్రక కారణాల వల్ల కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు మొత్తంగా అభివృద్ధికి దూరమైతే (బీహారు), పెద్ద రాష్ట్రాల్లో భాగంగా అభివృద్ధికి దూరమయి ఉప ప్రాంతీయ భావనకు లోనయినవి మరికొన్ని (ఉత్తరాఖండ్‌, విదర్భ, తెలంగాణ). రెండు శతాబ్దాలుగా భిన్న రాజ్య వ్యవస్థల క్రిందనున్న వేరు వేరు రాష్ట్రాలను ఒకే భాష కారణంగా ఏకం చేసిన నేపథ్యం గల ప్రాంతాలూ వున్నాయి (తెలంగాణ). అయితే ఈ ప్రాతాలన్నింటికీ వెనుకబాటుతనం ముఖ్య లక్షణం. వెనుకబాటుతనం వెనుక సహజసిద్ధ లక్షణాలే కాక రాజ్య/ప్రభుత్వ నిర్లక్ష్యం, పక్షపాత వైఖరులు, నిర్ణయాధికారం లేకపోవడం కారణాలుగా కూడా వుంటాయి. ప్రణాళికా రచన లో రాజకీయాలు ఇమిడి వుంటాయన్న రచయిత విశ్లేషణ ఈ అంశాన్ని స్పష్టంగా చెపుతుంది.

చిన్న రాష్ట్రాల ఉనికికి సంబంధించిన చర్చ పాతదే అయినప్పటికీ, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల అనుభవాలు ఒక వైపు ప్రపంచీకరణ సరళీకరణ వాదనల నేపథ్యంలో క్రొత్త దృక్కోణాలను సందరించుకున్నది. పెద్ద రాష్ట్రాల్లో ద్రవ్యవనరుల పంపిణీ కన్నా కేంద్ర - రాష్ట్ర సంబంధాల ద్వారా వుండే పంపిణీ సమత్వాన్ని పెంచేదిగానూ, పాలనా సామర్థ్యం పెంచడానికి అనుకూలంగానూ వుంటుంది. ఈ విషయంల ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఉతబ్రిఖండ్‌లో స్పష్టంగా కనబడుతున్నది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అన్ని రాష్ట్ర ఉద్యమాల్లోకి దీర్ఘకాలంగా కొనసాగుతున్నది. తెలంగాణ ప్రాంత పరిరక్షణకు, సర్వతోముఖాభివృద్ధికి ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా, ఎన్ని వ్యవస్థలను ప్రవేశ పెట్టినా అన్ని ప్రయత్నాలు విఫలమైనాయనేది తెలంగాణ అనుభవం. ఉమ్మడి రాష్ట్ర రాజకీయార్థిక వ్యవస్థ అంతా నిర్ణయాధికారం చుట్టూ పరిభ్రమిస్తున్నది. నిర్ణయాధికారం లేకపోబట్టే తెలంగాణ ప్రాంత మిగులు తెలంగాణలో ఖర్చు కాదు. ప్రాంత వెనుకబాటుతనం కారణంగా వచ్చే వనరులు తెలంగాణ కోసం ఖర్చుకావు. అధికారగణానికి ప్రజలకు వుండాల్సిన సహజ సంబంధం లోపిస్తున్నది. కనుక ప్రాంత అభివృద్ధి పట్ల, ప్రజల పట్ల అవశ్యమైన నిబద్ధత కొరవడుతుంది. అవస్థాపన మీద అభివృద్ధి ప్రాజెక్టుల మీద ఖర్చు చేయడంలో జరిగిన జాప్యం వలన ఎంత నష్టం వాటిల్లుతుందో మూడవ ప్రణాళికలో స్పష్టంగానే ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని తెలంగాణ బడ్జటరీ మిగులు వ్యాసంలో రచ్యరీత మరింత స్పష్టం చేస్తారు - జరగవలసిన పెట్టుబడి జరగనప్పుడు తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో విధాలుగా పొందవలసిన ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను పొందలేకపోవడం తీరని నష్టంగా చూడాలి.

తెలంగాణకై వివిధ రంగాల ప్రణాళిక వ్యాసం యాభై ఏండ్ల ముందున్న పరిస్థితిని వివరిస్తుంది. అయినా ఆనాడు ప్రస్తావించిన అంశాలు ఈనాటికీ ఇంకా ప్రశ్నలుగానే మన ముందున్నాయి. భవిష్యత్‌ తెలంగాణ రాష్ట్రానికి ఇది విజన్‌ డాక్యుమెంట్‌గా కూడా వర్తిస్తుంది. అన్ని ప్రయోగాలు జరిగి, విఫలమైన పరిస్థితిలో తెలంగాణకు స్వయం పాలన ఒక్కటే ప్రత్యామ్నాయం ప్రజలకు లేదు.

.......

ఇందులో ప్రాంతీయ అసమానతలు శీర్షిక కింద నాలుగు వ్యాసాలు, చిన్నరాష్ట్రాల ఆవశ్యకత శీర్షిక కింద రెండు వ్యాసాలు, ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకత శీర్షిక కింద నాలుగు వ్యాసాలు వున్నాయి.

రచయిత ప్రొఫెసర్‌ చెన్నమనేని హనుమంతరావు 1929లో కరీంనగర్‌ జిల్లాలో జన్నించారు. హైదరాబాద్‌ విద్యార్థి సంఘం కార్యకర్తగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ లోని నిజాం కళాశాలలో డిగ్రీ చదివారు. 1957లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో ఎం.ఎ. పట్టాను, 1962లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ పట్టాను పొందారు. చికాగో విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలో గా పనిచేశారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ గ్రోత్‌, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. అదే సంస్థకు కొంతకాలం డైరెక్టర్‌గా కూడా వున్నారు. అనేక పురస్కారాలతో పాటు 2004లో భారత రాష్ట్రపతి నుండి పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌లో ఆనరరీ ప్రొఫెసర్‌గా, ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌ న్యూఢిల్లీ, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌గా, జాతీయ సలహామండలి సభ్యులుగా వున్నారు.


ప్రాంతీయ అసమానతలు

ప్రత్యేక తెలంగాణ

-ప్రొఫెసర్‌ సిహెచ్‌. హనుమంతరావు

తెలుగు అనువాదం : ఇ. రేవతి. మామిడి భరత్‌ భూషణ్‌

108 పేజీలు, వెల రూ. 60

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌