Friday, August 29, 2008

దళిత కథలు


దళిత కథలు

దళితుల సమస్యలు, పోరాటాలు ప్రధానంగా సాంఘికమైనవి. దళితులపట్లా, శూద్రులపట్లా అగ్రవర్ణాలవారు అవలంభించే అమానుష వైఖరి ఈ నాటికీ దేశంలోని మేధావులకు ఒక సవాలుగానే నిలిచింది. జీవితంలోని ప్రతి రంగంలోనూ దళితులు ఉపేక్షితులైనట్లే సాహితీరంగంలో కూడా వారు తిరస్కృతులైనారు. గత వందలాది సంవత్సరాలుగా వస్తున్న సాహిత్యంలో దళిత పురుషులను బానిసలుగా, దళిత స్త్రీలను దాసీలుగా లేదా భోగించబడే వస్తువులుగా హీనంగా చిత్రించడం జరిగింది. వాళ్లని సాటి మనుషులుగా ఎక్కడా చిత్రించనూలేదు, స్వీకరించనూలేదు. అగ్రవర్ణాలకు చెందిన వాళ్లను మాత్రమే శక్తిమంతులుగా, సమర్థులుగా చిత్రించారు. అందువల్ల అట్లాంటి సాహిత్యాన్ని తిరస్కరించి అడుగడుగునా తీవ్ర అన్యాయానికి, అణిచివేతకు, వివక్షకు గురవుతున్న వర్గాల యాతనలను, సంవేదనలను, బాధలను వారిపై జరుగుతున్న అత్యాచారాలను శక్తివంతంగా అభివ్యక్తం చేసే అవసరం ఏర్పడింది.
ఆ అవసరాన్ని పరిపూర్తి చేసే దిశగా సాగిన వివిధ దళిత రచయితల కథా సంపుటే ఈ పుస్తకం.
ఆ రచయితలు యోగేంద్ర మేశ్రామ్‌, కేశవ్‌ మేశ్రామ్‌, అన్నా భావూ సాఠే, లక్ష్మణ్‌ మానే, హోవాల వామన్‌, శ్రీరామ్‌ గుందేకర్‌, యోగీరాజ్‌ వాఘ్‌మారే, దయాపవార్‌, బంధు మాధవ్‌. కాగా దళిత సాహిత్య పూర్వరంగాన్ని డా. సూర్యనారాయణ రణసుభే, డా.కమలాకర్‌ గంగావణే పరిచయం చేశారు.
వీటికి పోలు శేషగిరిరావు, నిర్మలానంద, దండమూడి మహీధర్‌, సాకేత్‌, కౌముది, నిఖిలేశ్వర్‌ తెలుగు అనువదం చేశారు.
ఒక విధంగా ఈ సాహిత్యానికి మూల ప్రేరణ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌. అటు పోరాటం, తిరుగుబాటు, నిరాకరణ అనే మూడు స్థాయిల్లో ఉద్యమాలు పెల్లుబికితే ఆ స్ఫూర్తితో ఇటు దళిత సాహిత్యం ప్రతిస్పందించింది. ఈ దళిత సాహిత్య ఉద్యమం సాంఘిక పోరాటం నుంచి రావటం వల్ల అందులోని అంతర్గత వైరుధ్యాలన్నీ ఈ సాహిత్యోద్యమంలోనూ కనపడతాయి.

దళిత కథలు
75 పేజీలు, వెల రూ. 16

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌