Wednesday, August 13, 2008

వ్యవస్థను కాపాడిన రాముడు - డా. బి. విజయభారతి


వ్యవస్థను కాపాడిన రాముడు

డా. బి. విజయ భారతి

రామాయణం కొందరికి కల్పవృక్షమైతే, మరికొందరికి విషవృక్షం.

ఎవరి దృక్కోణం వారిది.

ఆ తరహాలో వచ్చిన మరో పుస్తకమే వ్యవస్థను కాపాడిన రాముడు.

రామాయణానికి వున్నన్ని అనువాదాలు, రామాయణంపై వచ్చినన్ని విమర్శనా గ్రంథాలు ప్రపంచంలో ఏ ఇతర కావ్యానికీ వచ్చి వుండకపోవచ్చు.

వాల్మీకి రామాయణం చదవకుండానే ఏవేవో రామాయణాల్లోంచి తమకు అనువైన ఉదాహరణలు తీసుకుని రామాయణం రంకు అనే మహానుభావులు వున్నారు, రామాయణాన్ని తమ ఆత్మీయ బంధువుగా భావించేవారు వున్నట్లే. దోపిడీ వ్యవస్థను బలపరచిన బూర్జువా గ్రంథమనే వారూ వున్నారు.

ఎవరి దృక్కోణం వారిది.

డాక్టర్‌ బి. విజయభారతి రచించిన ఈ పుస్తకంలో రామాయణంతో ఎంతోకొంత పరిచయం వున్నవారందరూ ఆలోచించవలసిన అంశాలు వున్నాయి.

సంప్రదాయ, ఆధునిక పరిశోధకులు వెలువరించిన అనేక పరిశోధనా గ్రంథాలను ఆకళింపుచేసుకుని, తద్వారా తనకు కలిగిన అభిప్రాయాలను అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు రచయిత్రి.

రామాయణాన్ని పరామర్శించినా, విమర్శించినా దానికి ముందు పాఠకుడు తాను చదువుతున్నది కావ్యమా, పురాణమా, ఇతిహాసమా అనే విషయంలో స్పష్టమైన అభిప్రాయానికి రావాలి.

నిజానికి రామాయణం కావ్యమైనా దానిని పురాణంగానో, ఇతిహాసంగానో భావించేవారు లేకపోలేదు. అటువంటి భావనలతో చేసే విమర్శలే పాఠకులకు అనేక అపోహలను కలిగిస్తుంటాయి. రామాయణాన్ని విమర్శించడానికి, ఆ విమర్శను సమర్థించుకోవడానికి చాలా ప్రతిభ కావాలి. అది ఈ రచయిత్రికి సమృద్ధిగా వున్నదని ఈ పుస్తకం నిరూపిస్తుంది.

పురోహిత వర్గాలు, పాలక వర్గాలు కలసికట్టుగా వుంటూ సమాజంలోని కిందివర్గాలను, వారి కార్యకలాపాలను నియంత్రించడం రామాయణంలో కనిపిస్తుంది అని ప్రకటిస్తారు రచయిత్రి. అటువంటి వాఖ్యలు చేయడానికి ఎంతో ధైర్యం కావాలి.

రామాయణకాలం ఎప్పటిది, వాల్మీకి బోయవాడా, మునిపుంగవుడా అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికే కాదు ఎప్పటికీ దొరకవు. ఎందుకంటే ఈ విషయంలో ఏ ఇద్దరూ ఒకే అభిప్రాయానికి రాలేరు గనుక. ఆ కాలాన్ని క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాలలోపు కుదించినా, లేక కొన్ని యుగాలకు ముందనుకున్నా, ఒరిగే లాభమూ లేదు, నష్టమూ లేదు.

రామాయణం ఇప్పటికీ జనం నాల్కలపై నిలిచి వుందన్నది ఒక్కటే వాస్తవం. అంతటి అజరామరమైన మహాకావ్యం ప్రపంచంలో మరొకటి లేదన్నదీ వాస్తవమే. హోమరు పేరు తెలియని వారికి సైతం వాల్మీకి పేరు తెలుసు. అది చాలు. ....

రామాయణంలోని అనేక అంశాలను చాలా సులువైన రీతిలో ఈ పుస్తకంలో పరిచయం చేశారు రచయిత్రి.

రామాయణాన్ని కొత్త కోణంలోంచి ఆవిష్కరించిన పుస్తకం ఇది.

ఎ. సునీల్ చంద్ర, వార్త దిన పత్రిక


వ్యవస్థను కాపాడిన రాముడు

రచన: డాక్టర్‌ బి. విజయ భారతి

వెల : రూ.75

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌