Friday, December 5, 2008

పథేర్‌ పాంచాలీ సత్యజిత్‌ రే అపూర్వ చిత్రానికి నవలా మాత్రృక బిభూతి బూషణ్‌ బందోపాధ్యాయ...అనువాదం: మద్దిపట్ల సూరి




పథేర్ పాంచాలీ అనగానే సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చిన సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాకు ప్రేరణ ఇదే పేరుతో వెలువడిన ఒక బెంగాలీ నవల.దీన్ని బిభూతి భూషన్ బందోపాధ్యాయ రచించారు. మనలో చాలా మందికి ఆ సినిమా చూసే అవకాశం కలిగివుండొచ్చు కానీ ఆ నవల చదివే అదృష్టం వుండివుండకపోవచ్చు. కానీ ఈ బెంగాలీ నవలను దాదాపు నలభై ఏండ్ల క్రితమే మద్దిపట్ల సూరి గారు తెలుగులోకి అనువదించారన్న విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. చాలా ఏళ్ళుగా ’out of print’ లో ఉన్న ఈ నవల ఈ మధ్యనే మరో ప్రచురణకు నోచుకుంది. పథేర్ పాంచాలీ సినిమాలాగే ఈ నవల కూడా మానవ సంబంధాలను ఎంతో సున్నితంగా ఆవిష్కరిస్తుంది. ప్రస్తుతం హైదరాబాదులోని అన్ని పుస్తకాల షాపుల్లోనూ ఈ పుస్తకం లభ్యమవుతోంది.

మద్దిపట్ల సూరి గురించి:1920 జులై 7 న తెనాలి దగ్గరి అమృతలూరులో జన్మించారు.తెలుగు సంస్కృతం, బెంగాలీ, హిందీ భాషలపై గట్టిపట్టున్న ఆయన విశిష్ట బెంగాలీ సాహిత్యాన్ని సొగసైన నుడికారంతో, సహజ సుందర అనువాదంతో తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. బిభూతి భూషన్ తో పాటు ప్రఖ్యాత బెంగాలీ రచయితలైన తారశంకర్ బెనర్జీ,శైలాజానంద ముఖర్జీ ,నిరంజన గుప్తా వంటి వారిని కూడా తెలుగు పాఠకులకు చేరువ చేసిన ఘనత సూరిదే.ఈయన అనువదించిన శాంబుడు(సమరేశ్ బసు), సమయం కాని సమయం(బిమల్ కర్), కలకత్తాకు దగ్గర్లో (గజేంద్రకుమార్ మిత్ర) వంటి నవలలను సాహిత్య అకాడెమీ ప్రచురించింది. భలే తమ్ముడు (1969), పండంటి కాపురం(1972) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా కూడా సుప్రసిద్ధులైన సూరి 1995 నవంబరు 19న మరణించారు.

ఈ పుస్తకం లోని ముందుమాట మీకోసం.

అజరామర పథగీతం

పథేర్ పాంచాలీ అనగానే మనకు చప్పున గుర్తుకొచ్చేది సత్యజిత్ రే, ఆయన రూపొందించిన ’అపూ’ చిత్రత్రయం! మొట్టమొదటిసారిగా ప్రపంచం దృష్టిని భారతీయ సినిమావైపు ఆకర్షించిందీ, సత్యజిత్ రేకు అంతర్జాతీయ గుర్తింపునూ, అపార ఖ్యాతినీ అర్జించి పెట్టిందీ ఈ చిత్ర త్రయమే.వీటిలో మొదటిది పథేర్ పాంచాలీ(1955) మిగిలిన రెండూ అపరాజిత (1956), అపూర్ సంసార్ (1959).ఈ చిత్రాలు మూడింటికీ కూడా ప్రఖ్యాత బెంగాలీ రచయిత బిభూతిభూషన్ బందోపాథ్యాయ్ రాసిన రెండు విశిష్ట నవలలే ఆధారం.

40 వ దశకంలో శాంతినికేతనంలో లలిత కళలు, గ్రాఫిక్ డిజైనింగ్ అభ్యసించి బయటకొచ్చిన సత్యజిత్ రేను సినిమాలు ఎంతగానో ఆకర్షించాయి. కానీ భారతీయ సినిమాల్లో ఎంతకీ తీపి వలపుల ప్రేమపాటలు, మార్మిక పురాణగాథలే రాజ్యమేలుతుండడం ఆయన్ను చాలా చికాకు పెట్టింది.”సినిమాకు జీవితమే ముడి సరుకు కావాలి.సినిమా వంటి జనమాధ్యమానికి స్ఫూర్తి మన జీవితంలో, మన మూలల్లో ఉండాలి. సంగీతం, కవిత్వం, చిత్రలేఖనం వంటి రంగాల్లో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఈ దేశం చిత్రదర్శకులను కదిలించలేకపోవడం విడ్డూరం.వాళ్ళు తమ కళ్లూ, చెవులూ తెరుచుకుని వుంటే చాలు!”. ఈ వేదనే సత్యజిత్ రే ను సినిమాల వైపు ధృఢ సంకల్పంతో నడిపించింది. ఒక వైపు అప్పుడే సాధించుకున్న దేశ స్వాతంత్ర్యం తాలూకు ఉత్సాహం అన్ని రంగాల్లోనూ కొత్త ఊపిరులోడుతోంది. గాఢమైన జీవితానుభూతితో సినిమా రూపొందించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనకు మొట్టమొదటిసారిగా అధిగమించి ఆయన రూపొందించిన ఆ సినిమా ఆ తర్వాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అత్యుత్తమ మానవ చిత్రణా పురస్కారం (1955) తో సహా దేశ విదేశాల్లో ఎంతగా ప్రాచుర్యం పొందిందో, భారతీయ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్ళిందో, నవ్య ధోరణులకు ఎలాంటి పునాది వేసిందో ఆ చరిత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

’పథేర్ పాంచాలీ’ - సినిమాగా ఎంతటి ప్రఖ్యాతి అర్జించిందో ….ఒక నవలగా అది అంతకుముందే గొప్ప ప్రశంసలను అందుకుంది. ఒక రకంగా పథేర్ పాంచాలీ బిభూతి భూషనుడి స్వీయ కథాత్మక నవల. దీన్ని ఆయన 1928-29 మధ్య ’విచిత్ర’ పత్రికలో సీరియల్ గా రాశారు. 1929 నవంబరులో మొట్టమొదటిసారిగా పుస్తకం రూపంలో వెలువడీంది. బెంగాలీ/భారతీయ సాహిత్యంలో అప్పటికే సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఈ నవలను చలనచిత్రంగా మలచటం ద్వారా సత్యజిత్ రే దీనికి అంతర్జాతీయ గుర్తింపునూ, శాశ్వతత్వాన్నీ తెచ్చిపెట్టారు.

చక్కటి బెంగాలీ గ్రామీణ జీవితపు అనుభవాలతో అలరారే బిభూతి భూషనుడి రచనలను చదవడమంటే ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని అతి సన్నిహితంగా దర్శించటమే.వీటిలో మనకు తారసపడే పిల్లలూ, పెద్దలూ, వాళ్ల జీవితాలూ తత్వాలూ సజీవమైనవి.పైకి అతి వాస్తవికంగా కనబడుతుండే ఈ జీవితాల్లోనే ఊహాతీతమైనవేవో…విస్మయాలు, విభ్రమాలు మనల్ని ఎక్కడికక్కడ కట్టిపడేస్తుంటాయి.పథేర్ పాంచాలిలో కథ చాలా స్వల్పం.నిశ్చిందిపురంలో ఉంటున్న ఒక పేద బ్రాహ్మణుడి కుటుంబం, ఇల్లు, పిల్లలు, జీవిక కోసం వాళ్ళు చేసే పనులు, వారి దైనందిన అనుభవాలు….అంతే! ఈ చిన్న కథాంశాన్నే బిభూతి భూషనుడు ఇద్దరు పిల్లల కళ్ళతో, వారి పసి మనసుల్లో నుంచి పొరలు పొరలుగా దర్శింపజేస్తూ మనల్ని ఓ జీవితకాలపు అనుభూతికి లోను చేస్తాడు. నిశ్చిందిపురంలోని తోటలూ, చెట్టుచేమలూ, కాయలూ పళ్ళూ ఎంత వాస్తవమైనవో ’దుర్గ’,’అపు’ కూడా మన కళ్ళముందు అంతే వాస్తవంగా తిరుగుతుంటారు.తమ చిన్న ప్రపంచాన్ని క్షణం తీరికలేకుండా బాల్య సహజమైన కుతూహలంతో సాహోసోపేతంగా కూడా శోధిస్తుంటారు. వాళ్ళ అపురూపమైన ఆశలు, చిన్న చిన్న కోర్కెలు, ఏవేవో గుసగుసల రహస్యాలు, కవ్వింపులు, కుళ్ళుమోత్తనాలు….మనం ముచ్చట పడకుండా ఉండలేం! నిస్సహాయంగా వాళ్ళ స్నేహితులమైపోతాం.వాళ్లే లోకంగా, వాళ్ళలోనే ఉంటాం, వాళ్లతోనే తిరుగుతాం.అందుకే దుర్గ మరణాన్ని మనం తట్టుకోలేం. కానీ ఆ విషాదాన్ని వాళ్ళ కుటుంబం తట్టుకుంటుంది. ఆ ఒక్క విషేదాన్నే కాదు, ఎన్నో వరుస విషాదాల్ని, పేదరికాన్ని, ఈసడింపుల్ని, ఈర్ష్యాసూయల్ని ఎన్నో బెంగల్ని, జీవన్మరణాల్ని….ఎన్నింటినో నిభాయించుకుంటుంది.జీవిత పథం ఆశావహంగా, మరింత ముందుకే సాగుతుంటుంది.

’పథేర్’ అంటే పథం, రహదారి మార్గం. ’పాంచాలీ’ అనేది తరతరాలుగా సంప్రదాయ కథాగానానికి ఉపయోగిస్తుండే బెంగాలీ గీతాలు.అందుకే సత్యజిత్ రే తన చిత్రానికి ’సాంగ్ ఆఫ్ ది లిటిల్ రోడ్’ అని ఉపశీర్షిక జోడించారు.చింత-నిశ్చింతల మధ్య ఊగిసలాడుతుండే జీవనమార్గంలో ఎన్నో మలుపులు. అయినా ఆ పథం ముందుకు సాగుతూనే వుంటుంది. స్థలకాలాదులకు అతీతంగా జీవితాన్ని, మానవానుభూతులను సార్వత్రీకరించటంలో బిభూతి భూషన్ చూపించే అసమాన సామర్థ్యం అది. దుర్గ మరణంతో ….పథేర్ పాంచాలీ నవల చివర్లో అపు సొంత జీవితం ఆరంభమవుతుంది. (అది తర్వాత నవల ’అపరాజిత’ లో కొనసాగుతుంది.) పైకి జీవనమార్గం సూటిగా, సున్నితంగా సాగిపోతున్నట్టే ఉంటుందిగానీ….సామజికంగా దీనికి ఉన్న విస్తృతి చాలా ఎక్కువ.మారుతున్న కాలంతో పాటే వ్యక్తులు తమతమ జీవితాలకు అర్థాలను వెతుక్కుంటూ పల్లెల నుంచి పట్నాలకు వలసపోతున్న జీవితాలు అంతర్లీనంగా తరచూ మనల్ని కలవరపెడుతుంటాయి.ఊపందుకున్న పారిశ్రామీకరణలో అప్పుడప్పుడే గ్రామాల గుండెల్లోకి దూసుకొస్తున్న నాగరికతారైళ్ళు, అబ్బురంతో చూసే పసి మనసుల్లో అవి రేపే గుబుళ్ళు, కుటుంబాలను అతలాకుతలం చేసే అనూహ్య విలయాలు, తలవంచకుండా ఆత్మగౌరవంతో సాగించే పేదరికపు పోరాటాలు….ఇలా ఎన్నో బలీయమైన మానవ సామాజిక సందర్భాలు నవల పొడుగునా మనల్ని పలకరిస్తుంటాయి.మనసు ఆర్థ్రంగా మానవీయమవుతుంటుంది.అందుకే పథేర్ పాంచాలీ కరిగిపోయే కాలంతో ప్రమేయం లేని ’క్లాసిక్’ గా ఎన్నటికీ వన్నె తగ్గకుండా నిలిచివుంటుంది.
Curtesy:
శిద్దారెడ్డి వెంకట్
http://telugu.yuyam.com/out.php?id=24678

పథేర్‌ పాంచాలీ
సత్యజిత్‌ రే అపూర్వ చిత్రానికి నవలా మాత్రృక
- బిభూతి బూషణ్‌ బందోపాధ్యాయ
అనువాదం: మద్దిపట్ల సూరి
258 పేజీలు, వెల రూ.100/-

.................

1 comment:

  1. ఈ నవలలో బాల్యం, ఊహలు మొదలైన విషయాలు నిండైన అనుభూతినిస్తాయి. కానీ పేదరికాన్ని, శ్రమ పడని సంస్కృతిని మనం గొప్పగా చర్చించడం బాగోలేదు. సర్వజయ (తల్లి) పాత్ర ఏ కోశానా తమ జీవితపు మూలాలు శ్రమలో ఉన్నట్లుగా ఆలోచించదు. శ్రమపడని, శ్రమని నిరాకరించే సంస్కృతే ఈ నవలలోని పెద్దలలో ద్యోతకమౌతుంది. ఈ నవలని, చెంఘీజ్ ఖాన్ నవలని వరుసగా చదివాను. చెంఘీజ్ ఖాన్ నవలలో జీవితం కోసం దాని అంచులదాకా పోరాటం కనిపిస్తుంది. మనం ఏ సంస్కృతిని అందమైనదిగా గొప్పదిగా తలకెత్తుకుంటున్నామో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దానిలో శ్రమకి స్థానం లేనిదని గమనించాలి. పిల్లలని రక్షించుకోవడానికి సర్వజయ పాత్ర ఎప్పుడూ భర్తకొరకే ఎదురుచూస్తుంది. ప్రక్కవాళ్ళ సహాయం అడగడానికి కూడా మొహమాట పడుతుంది. ఊళ్ళో పొలాల్లో పంటలు పండడానికి మూలాన్ని తెలుసుకొనే ఆలోచన, స్పృహ సర్వజయ పాత్రలో చూపించకపోవడం దారుణం. ఇది ఏమి సంస్కృతి? పురుషాధిక్య, భూస్వామ్య సంస్కృతి. సత్యజిత్ రే గొప్ప సినిమాతీసాడనే గానీ చాలా బలహీనమైన జీవన చైతన్యం మాత్రమే దీనిలో ఉంది. భర్త చనిపోయిన త్ర్వాత మాత్రమే పాపం ఆ స్త్రీ జీవిక కోసం వంటమనిషిగా శ్రమ పడడానికి సిద్దపడుతుంది. ఆ పాత్ర పట్ల మనకు సానుభూతి ఉంటుంది. అది ఆమె పుట్టిపెరిగిన పరిస్థితులు కారణం కావచ్చు. ఆ సంస్కృతే మనల్ని ప్రగతిశీలకంగా కాకుండా వెనక్కు లాగుతుంది.బలహీనతనే అందం, కళాత్మకత అనుకొనే దౌర్భాగ్య స్థితిలోకి మనమందరమూ చేరుకొన్నామా?

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌