Monday, December 1, 2008

ఒక మంచి పుస్తకం ... డాక్టర్ కేశవరెడ్డి నవల మునెమ్మ

డాక్టర్ కేశవ రెడ్డి గారు చాలాకాలం తర్వాత 'మునెమ్మ ' నవల రాశారు. ఈ నవల 2007 అక్టోబర్ నెల చతురగా వచ్చింది. కేశవరెడ్డి గారు అద్భుతమైన రచనలు చేసారు. సిటీ బ్యూటిఫుల్, అతడు అడవిని జయించాడు,రాముడుండాడు.రాజ్జివుండాది, మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ మునెమ్మ.(ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు ) రాసి కంటే, వాసి ముఖ్యమని ఇలాంటి వాళ్ళ రచనల గురించే అంటారు కాబోలు.

రాయలసీమ మాండలికాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసింది స్వర్గీయ పులికంటి క్రిష్ణారెడ్డి గారైతే, దాన్ని తెలుగు సాహితీ ప్రియుల ఇళ్ళలోకి సరఫరా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది నామిని, కేశవ రెడ్డి గార్లు.

ఇక మునెమ్మ నవల విషయానికొస్తే, కథాకాలం మొదటి ప్రపంచ యుద్ధం నాటిది. కథని ఒక పదేళ్ళ కుర్రా డు (మునెమ్మకు మరిది వరస) చెపుతూ ఉంటాడు. భర్త చావుకి కారణమైన కొంతమంది వ్యక్తుల ఆచూకీ కనుక్కుని, వారిని అంతమొందించడానికి బయలు దేరిన ఒక భార్య కధ. వినగానే, ఇదేదో ఫాక్షన్ సినిమాలా ఉంది గానీ...కాదు!

మునెమ్మ ఒక పాతికేళ్ళ పడుచు. రైతు భార్య. ఆమె భర్త జయరామిరెడ్డి తన బండికి కట్టే బొల్లి గిత్తను రక్తం కారేలా కొట్టడంతో కథ ప్రారంభమవుతుంది. అతడలా కొట్టడానికి కారణం ఏమిటంటే, గడ్డి కోస్తున్న మునెమ్మ వీపుమీద బొల్లి గిత్త రెండు కాళ్ళతో గీరడంతో, ఆమె రవిక చిరిగి పోతుంది. దానితో జయరాముడు అగ్గిరాముడై పోతాడు.

తల్లి, మునెమ్మ, ఎంత చెప్పినా వినక జయరాముడు దాన్ని మద్దిపాలెం పశువుల సంతలో తెగనమ్మి పారేసేందుకు మర్నాడే బయలు దేరతాడు. దారిలో పోటు మిట్ట గ్రామంలో, 'తరుగులోడు 'గా పేరుపడ్డ పశువుల దళారీతో కలిసి మద్దిపాలెం వెళ్ళాలని జయరాముడు నిర్ణయిస్తాడు. అప్పట్లో బస్సులూ, అవీ అరుదు గనక, కాలి నడకన బయలు దేరతాడు.

రెండు రోజులయ్యక, జయరాముడు లేకుండా, బొల్లి గిత్త ఒక్కటే రొప్పుకుంటూ ఇల్లు చేరుతుంది. దానితో, మునెమ్మ, ఆమె అత్త నిర్ఘాంతపోతారు. ఒక రోజంతా చూసినా జయరాముడు తిరిగి రాడు. పైగా ఆ రాత్రి మునెమ్మకి ఒక పీడ కల వస్తుంది. ఆ కలలో మునెమ్మ గిలక బావి నుండి నీళ్ళు తోడుతుండగా, బకెట్ కి బదులుగా జయరాముడి శవం పైకొస్తుంది. అతడి మెడకి బొల్లిగిత్త మెడలో ఉండాల్సిన వెంట్రుకల తాడు బిగించి ఉంటుంది.(ఆ తాడు మునెమ్మ వెంట్రుకలతో పేనిందే) దానితో జయరాముడు ఇక లేడని మునెమ్మ నిర్థారణకొస్తుంది. బారెడు పొద్దెక్కేదాక ఏకధాటిగా ఏడుస్తుంది. తర్వాత లేచి కర్తవ్య నిర్వహణకు సన్నాహమవుతుంది. జయరాముడి ఆచూకీ కోసం వూళ్ళోని మగవాళ్ళు ఎవరు వెళతామన్నా, ఒప్పుకోదు. 'కనబడకుండా పోయింది నా వాడేగదా, నేనే వెదకాల ' అని మరిదితో ( ఈ కథ చెప్పే కుర్రాడు) కలిసి బయలు దేరుతుంది.

బొల్లి గిత్త కొమ్ములకున్న మద్దిపాలెం సంత చీటీ ఆధారంగా వారి అన్వేషణ ప్రారంభమవుతుంది.
మొదట వాళ్ళు తరుగులోడిని కలుస్తారు. వాడు ఎటూ చిక్కకుండా సమాధానాలు చెపుతాడు. పైగా ' ఏవమ్మా, జయరాముడు పైకంతో మంచి గొడ్డుని పట్టుకున్నాడా...జల్సా చేస్తా వున్నాడా ' అని అడుగుతాడు కూడా! జయరాముడు బొల్లిగిత్తను సంత దాకా తీసుకెళ్లకుండానే, దార్లోనే అమ్ముడైపోయిందని చెప్తాడు. సంత చీటీ తమ దగ్గరున్న సంగతి చెప్పకుండా , వాడిచ్చిన సమాచారం ఆధారంగా ముందుకు సాగుతారు. ఒక పూట కూళ్ళ ఇంట్లో వారికి మరింత విలువైన సమాచారం లభిస్తుంది.

సంతలో మరికొంత మంది చెప్పిన విషయాల ఆధారంగా పశువైద్యుడి ఇంటికి వెళతారు. కాని అప్పటికే అతడు మరణ శయ్య మీద ఉంటాడు. వైద్యం చేస్తుంటే ఆవు కుమ్మిందని ఇంట్లో వాళ్ళు చెపుతారు. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో అన్నట్లున్న అతడు, మునెమ్మ చేతిమీద బొల్లి గిత్త పచ్చ బొట్టు చూడగానే, వెర్రికేక పెట్టి ప్రాణం వదిలేస్తాడు.

జయరాముడి హత్యలో తరుగులోడికి, పశువద్యుడుకి భాగం ఉందని గ్రహిస్తుంది మునెమ్మ! అప్పుడు వెళుతుంది పోలీస్ స్టషన్ కి...ఏదైనా అనాధ శవం దొరికిందా అని తెల్సుకోవడానికి. ఒక రోజు ముందే జయరాముడి శవ దహనం జరిగిందని తెల్సుకుంటుంది.ఒక వెంట్రుకల తాడుతో జయరాముడి గొంతు బిగించి చంపారని తెలిసి వణికి పోతుంది. ఆ తాడుని జయరాముడే స్వయంగా మునెమ్మ తల దువ్వుకునేటపుడు రాలిన వెంట్రుకలతో పేనాడు.

మునెమ్మ బొల్లి గిత్తను తోలుకు రమ్మని మరిదిని పంపుతుంది. బొల్లిగిత్తతో పాటు తరుగులోడి ఇంటికి వెళుతుంది. తరుగులోడిని నిలదీసి, వాడు తనకేమీ తెలీయదని బుకాయిస్తుండగా , బొల్లి గిత్తను వదులుతుంది. అది ఉగ్రరూపం దాల్చి తరుగులోడి పేగులు తీసి కొమ్ములకు చుట్టుకోవడంతో కథ ముగుస్తుంది.

ఇక్కడ మీకు ఆసక్తికరంగా అనిపించిందో లేదో కాని, చదవడం మొదలెట్టాక ఆపకుండా చదివించే నవల ఇది. కేశవ రెడ్డి గారి శైలి అదే! అద్భుతమైన కథనం ఊపిరి తిప్పుకోనివ్వదు.

మునెమ్మ మనోభావాల చిత్రణ చదువుతుంటే, అతడు అడవిని జయించాడు లోని ముసలివాడి పాత్ర గుర్తొసుంది.ఆమె కర్తవ్య నిర్వహణ, అలుపెరుగని ప్రయాణం, పంది పిల్లల్ని కాపాడె ప్రయత్నంలో ముసలివాడు పడే తాపత్రయాన్ని గుర్తు చేస్తుంది.

'వదినా, జయరామన్న అంత్యక్రియలు ఎక్కడ చెయ్యా ల? " అని మరిది అడిగితే ' ఇప్పుడు నేనేం జేస్తున్నాను? ఆయన అంత్యక్రియలేగా! జయరాముడిని పడగొట్టిన వాళ్ళ నోట్లో రూకలు పడాల! ఆయన అంత్యక్రియలు పూర్తైనట్టే " అని మునెమ్మ చెప్పే మాటలు గగుర్పాటు కలిగిస్తాయి.
లైబ్రరీలో తప్పక ఉండవలసిన పుస్తకం ఇది.

(మనసులో మాట సుజాత గారి సౌజన్యంతో )
http://manishi-manasulomaata.blogspot.com/2008/04/blog-post_13.html

డా.కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10న పుట్టారు. తిరుపతిలో పియుసి, పాండిచ్చేరిలో ఎంబిబిఎస్‌ చేశాక నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి విక్టోరియా మెమోరియల్‌ ఆసుపత్రిలో స్కిన్‌ స్పెషలిస్టుగా కుష్టు రోగులకు సేవలందించారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో వుంటూ ఆర్మూరులో వైద్య సేవలు అందిస్తున్నారు. కుష్టువ్యాధిపై ఆయన రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

పాతిక సంవత్సరాలుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యలపట్ల సానుతాపంతో రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.

వీరి ఇతర రచనలు:

బానిసలు
భగవానువాచ
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌
స్మశానం దున్నేరు
అతడు అడవిని జయించాడు
రాముడుండాడు రాజ్జిముండాది
మూగవాని పిల్లనగ్రోవి
చివరి గుడిసె
సిటీ బ్యూటిఫుల్‌
నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌వారు అతడు అడవిని జయించాడు నవలను 14 భారతీయ భాషల్లోకి అనువదించారు.
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ నవల మరాఠీలోకి అనువాదమైంది.
తన రచనా స్పర్శతో బాధల గాయాలు స్పృశించి, హృదయాలను తేలికపరచటం, అనివార్యమైన జీవిత పోరాటానికి ఉపక్రమింపజేయటమే తన లక్ష్యమని వినమ్రంగా చెప్పే వీరిది వర్ణాంతర, మతాంతర వివాహం. కొడుకూ కూతురూ సంతానం.

మునెమ్మ ... నవల
రచన: డా. కేశవరెడ్డి

తొలి పలుకు: జయప్రభ
మలి పలుకు: అంబటి సురేంద్రరాజు

ముఖచిత్రం: కాళ్ళ

111 పేజీలు, వెల రూ.40

......................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌