Monday, December 8, 2008

వికలాంగులైన స్త్రీలకు, వారి సంరక్షకులకు ధైర్యం చెప్పి చేయూతనిచ్చే పుస్తకం



వికలాంగులైన స్త్రీలు - ఆరోగ్య సంరక్షణ ...
( ''వైద్యుడు లేని చోట'', ''మనకు డాక్టర్‌ లేని చోట'' వంటి సుప్రసిద్ధ ప్రయోజనాత్మక పుస్తకాలను అందించిన హెస్పేరియన్‌ ఫౌండేషన్‌ వారి మరో అపూర్వ గ్రంథం)


అంగవైకల్యం శాపం కాదు.
ప్రపంచంలో ఎవరైనా, ఎప్పుడైనా అంగవైకల్యానికి గురికావచ్చు.

యుద్ధాలు, ఉగ్రవాదం, రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాలు, మందుపాతరలు, బాంబు దాడులు, మతకల్లోలాలు, గూండాయిజం, హింస, రసాయనాలు, రేడియో అణుధార్మికత, మాదకద్రవ్యాల వాడకం, జబ్బులు, కాలుష్యాలు మొదలైన కారణాలవల్ల ఏ అవయవలోపంలేని వ్యక్తులు సైతం హఠాత్తుగా అంగవికలురుగా మారుతున్నారు.

అదేవిధంగా తల్లిదండ్రుల మాదకద్రవ్యాల వ్యసనం, వారు తమ జబ్బులకు సరిగా చికిత్స చేయించుకోకపోవడం, నిషేధిత మందులు వాడటం, వంశపారంపర్య లోపాలు, మేనరికం వివాహాలు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, నాటు మంత్రసానులు చేత కాన్పులు చేయించుకోవడం, గర్భవిచ్ఛిత్తికి నాటు మందులు వాడటం, వంటి కారణాల వల్ల అనేకమంది పిల్లలు వివిధ లోపాలతో పుడుతున్నారు. పుట్టిన తరువాత పిల్లలకు సరిగా రోగనిరోధక టీకాలు వేయించకపోవడం, సరైన ఆరోగ్య, ఆహార జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్ల కూడా ఎంతోమంది పిల్లలు అంగవైకల్యం బారిన పడుతున్నారు.

పురుషాధిక్య సమాజంలో సాధారణ స్త్రీలు ఎదుర్కొనే సమస్యలకుతోడు వికలాంగులైన స్త్రీలు మరిన్ని రెట్లు ఎక్కువ సమస్యవలను ఎదుర్కోవలసి వస్తుంది.

వికలాంగులైన స్త్రీలు తమ వైకల్యం వల్ల కంటే దానివల్ల సంక్రమించే న్యూనతాభావం వల్ల, చాలీచాలని సంరక్షణ సౌకర్యాల వల్ల, సమాజ బాధ్యతా రాహిత్యం వల్ల, ప్రభుత్వాలు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి రూపొందించిన ఈ పుస్తకం వికలాంగ స్త్రీలకు - సామాజికపరమైన అడ్డంకులను అధిగమించడానికి, సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, ఆత్మగౌరవాన్ని, తమ సంరక్షణని తామే చూసుకోగల సామర్థ్యాన్ని
పెంపొందిచుకునేందుకు, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించటానికి ఎంతో ఉపయోగపడుతుంది.

అంగవైకల్యం సమాజంలో ఎవరికైనా కలుగవచ్చు. అది ఒక సహజమైన దురదృష్ట స్థితి. కానీ వైకల్యం కలవారు తమ లోపాన్ని మరచి మిగతా సమాజంలోని వ్యక్తులలాగా జీవించాలని కోరుకుంటారు. అందుకు తమకున్న అవకాశం మేరకు కృషి చేస్తారు. కానీ సమాజంలోని ఇతర వ్యక్తులు వారిపట్ల చూపించే వివక్ష, చిన్న చూపు వారిని తీవ్రమైన నిరాశకు, నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి.
వికలాంగులపట్ల సాంఘిక వివక్ష, నిరాదరణ, చులకనభావం, అసత్యపు అభిప్రాయాలను తొలగించేందుకు కూడా ఈ పుస్తకం విశేషంగా తోడ్పడుతుంది.

ఇందులోని అధ్యాయాలు:
1. వైకల్యం - సామాజిక స్పృహ (వైకల్యం అంటే ఏమిటి? దానికి కారణాలు)
2. వైకల్యానికి చేయూత - స్నేహపూర్వక ఆరోగ్య సంరక్షణ
3. మానసిక ఆరోగ్యం
4. మీ శరీరాన్ని గురించి తెలుసుకోవడం
5. మీ శరీర సంరక్షణ
6. ఆరోగ్య పరీక్షలు
7. లైంగికత
8. లైంగిక ఆరోగ్యం - లైంగిక సంబంధాల వల్ల వ్యాపించే వ్యాధులను, హెచ్‌ఐవి/ఎయిడ్స్‌తో సహా నిరోధించటం
9. కుటుంబ నియంత్రణ
10. గర్భం
11. నొప్పులు - శిశు జననం
12. మీ బిడ్డ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు
13. వైకల్యంతో వయసు పెరుగుట
14. దూషణ, హింస, ఆత్మరక్షణ
15. సంరక్షకుల తోడ్పాటు

ఇంకా వివిధ రకాల మందులు, జాగ్రత్తలు, సమస్యలు, వినికిడికి తోడ్పడే సాధనాలు, నడవడానికి సహాయపడే చేతికర్రలు, చక్రాల కుర్చీలు తీసుకోవలసిన జాగ్రత్తలు వంటివి ఇందులో సవివరంగా సచిత్రంగా చర్చించబడ్డాయి.

ఈ పుస్తకం వికలాంగ స్త్రీలకు ఒక మార్గదర్శకంగా, వారికి అవసరమైన సంపూర్ణ సమచారాన్ని అందించేదిగా రూపొందించబడింది. 42 దేశాలలోని ఎంతోమంది వికలాంగ స్త్రీల అనుభవాలు, సలహాలు సూచనల ఆధారంగా తీర్చిదిద్దబడిన ఈ పుస్తకాన్ని వికలాంగ స్త్రీలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, సమాజ సేవారంగంలో పనిచేసేవారు, ప్రతి ఒక్కరూ విధిగా చదవాల్సిన అవసరం వుంది.

.............ఈ పుస్తకాన్ని మీ బీరువాలో దాచిపెట్టకండి. పదిమందికీ అందజేయండి...............


వికలాంగులైన స్త్రీలు - ఆరోగ్య సంరక్షణ
- జేన్‌ మాక్స్‌వెల్‌, జూలియా వాట్స్‌ బెల్సర్‌, డార్లీన డేవిడ్‌

ఆంగ్ల మూలం: A Health handbook for Women with Disablities, Hesperian Foundation, USA, 2007.

తెలుగు సేత : రాణి
414 పేజీలు, వెల: రూ.220

......................

1 comment:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌