
మూడు దశాబ్దాల క్రితం దాశరథి రంగాచార్య రాసిన 'చిల్లర దేవుళ్లు' నవల తెలుగు సాహిత్యరంగంలో ఆలోచనలు రేకెత్తించింది.
తెలంగాణా ప్రాంతపు ఇతివృత్తం, అందులోని పాత్రల కనుగుణమైన సంభాషణ, తెలంగాణా పరిసరాల చిత్రణ, పండుగల విధానం చెప్పడంలో ఓ కొత్త గాలిని మోసుకొచ్చింది.
అప్పటికి తెలంగాణా యాస అచ్చులో కనిపించడం కొందరు అమర్యాదకరంగా భావించినవారున్నారు.
అ లాంటి భావజాలం నుంచి బయటపడి తెలంగాణా మాండలికానికి సాహిత్య గౌరవం తీసుకొచ్చారు, సాహిత్య రంగంలో స్వేచ్ఛను తీసుకొచ్చారు దాశరథి రంగాచార్య.
మూడు దశాబ్దాల అనంతరం కొత్త తరాలకు ముఖ్యంగా పిల్లలకు పరిచయం చేయాలన్న సంకల్పంతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ఆ నవలకు సంక్షిప్త రూపాన్ని తీసుకొచ్చారు.
ఈ తరం పాఠకులు ఒకనాటి తెలంగాణా జీవితాన్ని తెలుసుకోవడానికి వీలు కల్పించే రీతిలో ఈ పుస్తకాన్ని సచిత్రంగా రూపొందించారు.
తెలుగులో ఇదో కొత్త సంప్రదాయంగా అనిపిస్తోంది. ఈ ప్రయత్నం ఎన్నదగిందికూడా.
మూడు దశాబ్దాల క్రితం చిల్లర దేవుళ్లు సృష్టించిన ప్రకంపనలు ఇప్పటికీ ఇంకా వినిపిస్తున్నాయి.
... ... ... ...
తెలంగాణా జీవితాన్ని చిత్రించిన తొలి నవలగా చరిత్రలో స్థిరపడిన చిల్లర దేవుళ్లు నవల ఈ తరం వారికోసం అన్నట్టు మళ్లీ అందుబాటులోకి రావడం విశేషం.
నిండైన సైజుతో తెలంగాణా ఆత్మను నింపుకున్న బతుకమ్మ ముఖచిత్రం పుస్తకానికి ఆభరణం.
జరిగిపోయిన కాలచక్ర ప్రవాహంలాంటి ఒక తరాన్ని ముందుకు నడిపించి, నాటి సమకాలీన జనజీవన చైతన్యానికి దోహదం చేసిన నాటిమేటి రచనలు నేటితరం చదువరులకు మార్కెట్‌లో లభ్యంకావడం లేదన్నది వాస్తవం. కొన్ని అమూల్య రచనలైతే పూర్తిగా కనుమరుగయ్యాయనీ మనకు తెలుసు. ఈ లోటును పూడ్చడం కోసం హైదరాబాద్ బుక్ ట్రస్ట్‌వారు వెలువరిస్తున్న '' మన మంచి పుస్తకాలు ''సిరీస్‌లో భాగమే ఈ '' చిల్లర దేవుళ్లు ''.
పదేళ్లు దాటిన పిల్లలు, పెద్దలందరూ చదువుకునేందుకు వీలుగా ఎంతో జాగ్రత్తగా నవలని తీర్చిదిద్దామని ముద్రాపకులు చెప్పన మాట అక్షర సత్యం.
నాటి నిజాం నవాబుల పాలనని తెలంగాణా ఆత్మతో దాశరథి రంగాచార్య అక్షరీకరించిన తీరు అద్భుతం.
(ఆంధ్రప్రభ, వార్త దినపత్రికల సమీక్షలు)
చిల్లర దేవుళ్లు
- దాశరథి రంగాచార్య
బొమ్మలు : ఏలే లక్ష్మణ్
35 పేజీలు : వెల: రూ.15
...........................
No comments:
Post a Comment