Sunday, December 28, 2008

మూగవాని పిల్లనగ్రోవి ... డా.కేశవరెడ్డి
....
'మూగవాని పిల్లనగ్రోవి' ఒక రైతు మరణ, పునరుత్థానాల గాథ. ఆ రైతు - ప్రయత్నం నుంచి వైఫల్యానికీ, వైఫల్యం నుంచి అభద్రతా భావానికీ, అభద్రత నుండి ఉన్మాదానికీ, ఉన్మాదం నుండి మరణానికీ నడిచిన కథ. తన మరణంలో ప్రాణత్యాగం చేసిన తీరువల్ల కర్మవీరుడై, అమరుడై, పురాణ పురుషుడైన కథ.

డా.కేశవరెడ్డి ఈ కథ ఇతివృత్తం ఎంచుకోవడంలో, కథని చెప్పిన తీరులో అసమాన కౌశలాన్ని ప్రదర్శించారు. ఈ కథలో కూడా పురాతన ఆసియా కథన సంప్రదాయాన్ని, ఆదిమ జాతుల విశ్వాస ధోరణిలో చెప్పే నేర్పు వల్ల ఇంతదాకా తెలుగు సాహిత్యంలో మనం వినివుండని అపూర్వ కథనాన్ని ప్రదర్శించారు.

మూగవాని పిల్లనగ్రోవి 'అతడు అడవిని జయించాడు' లాగానే ఒక వీరగాథ.

అయితే ఇది ఒట్టి వీరగాథగా ఆగిపోలేదు. ఆ వీర గాథ (legend) ఒక పురాణ ప్రతీక (myth) గా కూడా రూపొందింది ఇక్కడ.

ఇక్కడ రచయిత పురాణ ప్రతీకని ఇవ్వడంతో తన పని ముగించినట్టు కనబడినా అది నిజం కాదు. అటువంటి పౌరాణిక ముగింపు (mythological summation) ఇవ్వడంతోనే అతను మనల్ని వేధించడం మొదలు పెడుతున్నాడు.

ఎందుకు ఈ కథ ఇలా ముగిసింది?
ఈ కథకు యథార్థమయిన ముగింపు ఇదేనా??
ఇటువంటి పర్యవసానానికి కారణాలు ఎటువంటివి???

ఇటువంటి ప్రశ్నల పరంపరతో మనం ఆలోచనాపరులంకావడంలోనే రచయిత నిజమయిన విజయం వుంది.
బీదవాళ్లు భూస్వాములపై తిరగబడ్డారని ఎవరయినా రచయిత ఒక నవలని ముగిస్తే, ఆ ముగింపు మనని ఊరడిస్తుంది, మత గురువుల పరలోకం గురించిన ప్రభోధాలవలె.

ఆ ముగింపు మనకు ఇచ్చేది జాగృతి కాదు.
విశ్రాంతి!
అటువంటి రచన చదివిన తర్వాత మనకెటువంటి అ లజడీ కలగదు.
ఏప్రశ్నలూ రేకెత్తవు.

కానీ ఎంతో ప్రశాంతంగా, దివ్యంగా కనిపించే ఈ రచనలోని ముగింపు మనని ఎంతో ఆశాంత పరుస్తుంది. కథలో మణియం వలె మనం కూడా కారణాల అన్వేషణ మొదలుపెడతాం. ఎవరికి తోచిన కారణాలు వాళ్లు చెప్పడంతో చర్చ మొదలవుతుంది.

ఇటువంటి చర్చ నుండి ఒక సామాజిక జాగృతి పొటమరిస్తుంది.
....

(వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ముందుమాట లోంచి)

''మూగవాని పిల్లనగ్రోవి నవలలోనే కాదు, మిగిలిన నవలల్లో కూడా రచయిత ప్రతి సన్నివేశాన్నీ దృశ్యమానం చేస్తారు. “Writing as showing” కి కేశవరెడ్డి నవలలను మించిన దృష్టాంతం తెలుగులో మరొకటి లేదు.

అన్నీ పాఠకుల కళ్లముందే జరుగుతాయి.
పాఠకుడు ప్రతి కథనానికి ప్రత్యక్ష సాక్షి అవుతాడు. ప్రేక్షక పాత్రను దాటి దృశ్యంలో పాత్రగా, కథలో భాగస్వామిగా లీనమైపోయే పరిస్థితిని రచయిత కల్పిస్తాడు.

ఈ విధంగా ఆయన ప్రతి నవల ఒక దృశ్యకావ్యంగా, స్క్రీన్‌ప్లే గా రూపుదిద్దుకుంటుంది.

కేశవరెడ్డి నవలలతో విషయపరంగానే కాక రూపపరంగా కూడా గొప్ప సినిమాలు తీయవచ్చు.
స్క్రీన్‌ప్లే మళ్లీ రాసుకోనవసరం లేనంత గొప్పగా వుంటాయి ఆయన నవలలు.

భావాలతో పోలిస్తే మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు, రంగులు, వర్ణనలే కాదు చివరికి అంకెలు కూడా గొప్పవన్న హెమింగ్వే అభిప్రాయంతో ఏకీభావం వున్నందునే ఆయన ఇంత గొప్ప నవలలు రాయగలిగారా?

హెర్మన్‌ మెల్విల్‌, జాక్‌ లండన్‌, గోర్కీ (కథకుడు), నికోస్‌ కజాంట్జకిస్‌ (జోర్బాది గ్రీక్‌ నవల), హెమింగ్వే వంటి రచయితలతో పోల్చదగిన నవలా రచయిత కేశవరెడ్డి.

ఆంద్రీ తార్కొవిస్కీ 'శాక్రిఫైజ్‌' సినిమా చూసినప్పుడు కలిగిన భీతావహమే ''మూగవాని పిల్లనగ్రోవి'', ''చివరి గుడిసె'' నవలలు చదివినప్పుడు కలిగింది.

బి.వి.కారంత్‌ ''చొమనదుడి'' చూసినప్పుడు ...
దాగర్‌ బ్రదర్స్‌ 'రుద్రవీణ' విన్నప్పుడు ...
కుమార్‌ సహానీ 'ఖయాల్‌ గాథా' చూసినప్పుడు ...
కలిగే వివశత్వం కేశవరెడ్డిని చదివినప్పుడూ కలుగుతుంది.

హబీబ్‌ తన్వీర్‌ నాటకం,
రిత్విక్‌ ఘటక్‌ సినిమా ఆయన నవలలకు దగ్గరగా వుంటాయి.

“Man ought not to know more of a thing than he can creatively live upto” అని నీషే ఏనాడో చెప్పిన గొప్ప సత్యాన్ని అప్రయత్నంగా ఆచరిస్తున్నందువల్లే కేశవరెడ్డి నవలా వ్యాసంగాన్ని తపస్సులా దీక్షగా నిర్వర్తిస్తున్నారనుకోవాలి.''
...

(- అంబటి సురేంద్రరాజు రాసిన చివరి మాట లోంచి)


మూగవాని పిల్లనగ్రోవి (నవల)
రచన: డా.కేశవరెడ్డి

మొదటి ముద్రణ: ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 1993, రీతిక పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌ 1995.
ముఖచిత్రం: కాళ్ల

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ : 040-2352 1849

ముద్రణ: అనుపమ ప్రింటర్స్, గ్రీన్ వ్యూ, 126 శాంతి నగర్, హైదరాబాద్ - 28, ఫోన్: 040- 2339 1364 / 2330 4194


132 పేజీలు, వెల: రూ.60
.......

4 comments:

 1. ఈ కావ్యం గురించి కొత్తగా నేను చెప్పేదేమీ లేదు. తనలో లీనం చేసేసుకుని చదివింపజేస్తుంది. కానీ..

  పుస్తకం డిజైను మాత్రం అసంతృప్తి మిగిల్చింది. పుస్తకం కొలతలు మరీ తక్కువగా ఉండి కాసిని తక్కువ పేజీలతో పెద్ద కాగితాలతో ఉంటే మరింత హుందాగా, అందంగా ఉండేది. అట్ట డిజైను కూడా బాలెదు..

  ReplyDelete
 2. నేను చెప్పదలచినదిదీ:
  పుస్తకం డిజైను మాత్రం అసంతృప్తి మిగిల్చింది. కొలతలు (పొడవు వెడల్పులు) మరీ తక్కువగా ఉండటంతో రూపం బాలేదు. కాసిని తక్కువ పేజీలతో పెద్ద కాగితాలతో ఉంటే మరింత హుందాగా, అందంగా ఉండేది. అట్ట డిజైను కూడా బాలెదు..

  ReplyDelete
 3. నిజమే! పుస్తకం సైజు అభ్యంతరకరంగా వుంది. అసలు పాఠకులకు ఆ సైజు ఆనుతుందా లేదా అనేవిషయంపైన మీరెప్పుడైనా కూసింత పరిశోధన జరిపారా?

  ReplyDelete
 4. @ చదువరి, కత్తి మహేశ్‌ కుమార్‌

  కేశవరెడ్డి రచనలు చాలావరకు నవలికలు. సాధారణ డెమీ సైజ్‌లో ప్రచురిస్తే యాభై పేజీలకు మించవు. వాటిని సెంటర్‌ పిన్నింగ్‌తో వెలువరిస్తే నవలకు అంత నప్పదనిపించింది.

  అంతేకాకుండా ఆయన రచనలను మిగతా పుస్తకాలకు భిన్నంగా, ప్రత్యేకంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో క్రౌన్‌ సైజ్‌ను ఎంపికచేయడం జరిగింది.

  హైదరాబాద్ బుక్ ట్రస్ట్‌ ఈ సైజ్‌లో పుస్తకాలను ప్రచురించడం అరుదు. ఆట్ట కోసం డిజైనర్‌ని ఆశ్రయించడం కూడా అరుదనే చెప్పాలి.. కొంత అదనంగా డబ్బును వెచ్చించి మేము ప్రత్యేకంగా వెలువరించిన పుస్తకాలలో ఇదొకటి.

  పాఠకులు హర్షిస్తారనే ఆశిస్తున్నాం.

  ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌