Monday, December 29, 2008

చివరి గుడిసె ... డా.కేశవరెడ్డి






కేశవరెడ్డికి శ్రోతగా ...

'చివరి గుడిసె' బాధామయం, భయావహం అయిన తీవ్ర ఉత్కంఠతో కూడిన విషాదాంత గాథ.

నాకు తెలిసినంత మటుకు ఇంత అద్భుతమైన కథని నేను తెలుగు సాహిత్యంలో ఇంతదాకా చదవలేదనే చెప్పాలి.

శిల్పంలో, చిత్రణలో, ప్రయోజనంలో ఒక 'కన్యాశుల్కం' ఒక 'యజ్ఞం' మాత్రమే దీనికి సాటి రాగల రచనలు.

అయితే గురజాడ, ఉన్నవ, కాళీపట్నం వంటి మహా రచయితలు ఒకే కాలానికీ, ఒకే వ్యవస్థకూ చెందిన వైరుధ్యాల్ని చిత్రించగా డా.కేశవరెడ్డి భిన్న వ్యవస్థలకు చెందిన వైరుధ్యాల్నీ, భూమిపైనా, పాతాళంలోనూ కూడా జరిగే పోరాటాన్నీ అత్యంత ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో చిత్రించారు ఈ నవలలో.
... ...
ఒక జాతిని తల్లి కడుపులోనించే నేరస్థులుగా నిర్ణయించిన ప్రభుత్వం గురించి ఏ యానాదికయినా స్పష్టంగా తెలుసు.

''గవుర్మెంటోళ్లంటే ఎవరు సావి? తాసిల్దారు, రివినిస్పెట్రూ, మనేగాడూ ఈళ్లేగదా గవుర్మెంటు'' అటువంటి ప్రభుత్వానికంతటికీ ఆధార స్తంభమయిన గ్రామ మణియాన్నే నిజమైన క్రిమినల్‌గా చూపించడమే ఈ కథా ప్రజ్ఞ.
....
డా.కేశవరెడ్డి భూస్వామ్య సమాజంలోని మానవత్వం బయటకి ప్రకటితం కావడానికి బైరాగినీ, భూస్వామ్య అమానుషత్వమంతటికీ మణియాన్నీ ప్రతినిధులుగా తీసుకున్నాడు. ఇద్దరిదీ 'చేను' గురించిన తాపత్రయమే.
... ...
ఒట్టి యానాదుల జీవితం గురించి, పీడన గురించి రాయడానికి మాత్రమే రచయిత ఈ కథని రాసాడనుకోను. తాను తొలినుంచీ ప్రయత్నిస్తున్న స్థూల, సూక్ష్మ పోరాటాల అత్యంత సునిశితమయిన చిత్రణకి ప్రయత్నించడమే ఈ ఇతివృత్తంలోని బలం.
... ...
( - వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ముందుమాట లోంచి)
.............................................................

ఒంటిల్లు అను స్తావర జంగమాత్మక ప్రపంచం


డాక్టర్‌ కేశవరెడ్డి నవలా ప్రపంచం గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు దుస్సాహసం కొద్దీ చెప్పబోయే ముందు ''మూగవాని పిల్లనగ్రోవి'' నవల చివరి వాక్యం ఇక్కడ ప్రస్తుతిస్తాను.

''పడమటి వైపు నుండి గ్రామంలోకి ప్రవేశించే వాళ్లు (బక్కిరెడ్డి) కానను సమీపించగానే తమకు తెలియకుండానే తమ నెత్తుల మీది తలపాగాలను తీసివేస్తారు. తమకు తెలియకుండానే వాళ్ల శిరస్సులు అవనతాలవుతాయి''.

కేశవరెడ్డి నవలలు చదివిన పాఠక ఆగంతకులకు కూడా ఆ బాటసారులకు కలిగిన అనుభవమే కలుగుతుంది. తమకు తెలియకుండానే వాళ్ల శిరస్సులు అవనతాలవుతాయి.

తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలో పుట్టి, తెలుగుభాష చదవడం వచ్చి, ఆ భాషలో నవలలు చదివిన వాడికి మున్నెన్నడూ కలగని అనుభవం కేశవరెడ్డి నవలలు చదివితే కలుగుతుంది.

గొప్ప భావావేశం వారిని ముప్పిరిగొంటుంది.
గాఢానుభూతుల ప్రకంపనలు వారిని వివశులను చేస్తాయి.
వ్యాకులచిత్తులను చేయగల మహా సౌందర్యమేదో వారికక్కడ లభిస్తుంది.
స్పర్శేంద్రియాలకు లోబడని ఆథోలోకాన్ని వారు అక్కడ మొట్టమొదటిసారి స్పృశిస్తారు.

''మానవ సంబంధాలలోని రాక్షసత్వాన్ని, సృష్టి యొక్క నిరర్థకతను'' భగవంతునిలా నిర్దయగా క్రూరంగా విపులీకరించే నిర్వికారుడైన రచయితను మీరక్కడ దర్శిస్తారు.

రచయిత ముందు తమ కృతజ్ఞత వ్యక్తం చేసేందుకు మాటలు రాక, వచ్చిన మాటలు చాలక మరో మార్గం లేక వాళ్ల శిరస్సులు అవనతమవుతాయి.
... ... ...
(- అంబటి సురేంద్రరాజు రాసిన చివరిమాట నుంచి)

చివరి గుడిసె
డా.కేశవరెడ్డి

మొదటి ముద్రణ: ఆహ్వానం మాసపత్రిక, 1993, రీతిక పబ్లికేషన్స్‌ 1996
ముఖ చిత్రం: కాళ్ల

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ : 040-2352 1849

ముద్రణ: అనుపమ ప్రింటర్స్, గ్రీన్ వ్యూ, 126 శాంతి నగర్, హైదరాబాద్ - 28, ఫోన్: 040- 2339 1364 / 2330 4194


158 పేజీలు, వెల: రూ.80

.............................

2 comments:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌