Sunday, December 14, 2008

రుదాలి - మహా శ్వేతాదేవి కథల సంపుటి


జీవన పోరాటాన్ని తాత్వీకరించిన మహా శ్వేతాదేవి కథలు ...

మహాశ్వేతా దేవి ఎనభైలలో రాసిన కథలు చాలా విశిష్టమైనవి. భారతీయ సమాజంలో కుల, వర్గ దోపిడీ పీడనలకు ప్రత్యక్ష కథనాలవి.
మహాశ్వేతాదేవిని తెలుగు వారికి ఆత్మీయురాలిగా చేసిన హెచ్‌.బి.టి. మరోసారి ఆమె కథలు ఐదింటిని ''రుదాలి'' పేరుతో ప్రచురించింది.

పిడికెడు సత్తు (పిండి) కోసం
గుప్పెడు మెతుకుల కోసం
కాసింత గంజి కోసం
చారెడు నేల కోసం
చిటికెడు ఉప్పు కోసం
తమ జీవితాల్ని అమ్ముకొనే దీనులు ఈ కథల్లో మనకు కనిపిస్తారు.
బతకడం కోసం అనునిత్యం సంఘర్షిస్తుంటారు. వారి జీవితమంతా అస్తిత్వ పోరాటమే. ఆ పోరాటమే వారికి బతుకుతెరువు చూపుతుంది.

దోపిడీ సమాజంలో పరాయీకరణకు గురయ్యేది కేవలం పేదల శ్రమ మాత్రమే కాదు - వారి వైయుక్తిక అనుభూతులు కూడా.
ఆఖరికి వారి ఏడుపు కూడా అమ్మకపు సరుకయ్యే వైనాన్ని తెలిపే అద్భుతమైన కథ 'రుదాలి'.

మామూలుగా కథలు సంఘటన ప్రథానంగా సాగుతాయి. కానీ రుదాలి కథలో రచయిత్రి 'శనిచరి' జీవితం మొత్తాన్ని సమగ్రంగా కళ్ల ముందు నిలిపింది. చలికాలపు ఎండలో గిన్నె నిండా బెల్లం, సత్తూ (పిండి) కలుపుకొని తింటూ కూర్చోవాలి అన్న అతి సాధారణమైన కోరిక శనిచరిది.
తినడానికి ఏమైనా పెట్టండి అని అరుస్తూ ఆమె అత్తగారు చనిపోయింది.
శివలింగానికి అభిషేకం చేసిన పాచిపోయిన మురుగు పాలు తాగి మొగుడు చనిపోయాడు.
క్షయ వ్యాధి సోకి కొడుకు కాలం చేశాడు.
తిండికోసం - కేవలం జిహ్వ చాపల్యం తీర్చుకోడానికి కోడలు ఎవరితోనే వెళ్లిపోయి చివరికి వేశ్యా వాడలో తేలింది.
దొరల వెట్టి చెయ్యలేక మనవడు ఊరు విడిచి పారిపోయాడు.
ఏ సందర్భంలోనూ శనిచరికి ఏడుపు రాలేదు.
ఆమెకు జీవితంలో ఏడ్చే వ్యవధి దొరకలేదు.
తీవ్రమైన నిర్బంధమో, భయంకరమైన దోపిడీయో, క్రూరమైన అణచివేతో, తప్పించుకోలేని మత క్రతువులో ఆమె ఏడుపును మింగేసేవి.
ఆమె తన కన్నీళ్లని అమ్మకానికి పెట్టింది.
ఏడవడమే వృత్తిగా చేసుకుంది.
దొరల కుటుంబంలో ఎవరైన చస్తే ఏడవడానికి కిరాయికి వెళ్లి వికృతంగా, వైనవైనాలుగా ఏడ్చి దొరల ప్రతిష్టను పెంచేది. అందుకు వేశ్యా వాడల నుంచి ఏడ్చేవాళ్లని కుదిర్చి పెట్టేది. చివరికి వాళ్లందర్నీ సంఘటితపర్చే ప్రయత్నంలో రుదాలి కథ ముగుస్తుంది.

శనిచరి వైయుక్తిక జీవితాన్ని చిత్రీకరించే క్రమంలో మొత్తం సమాజం, దాని మత, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ వికృత రూపం బహిర్గతమైంది. ఈ కథలో పాత్రలు, సంఘటనలు కాల్పనికాలు కావు. కథ ఆయ సంఘటనలచుట్టూ అ ల్లినదీ కాదు. అందుకే చిన్నకథలో విశాలమైన జీవితాన్ని వర్ణించడానికి వీలయింది. పలామూ ప్రాంత ప్రజల వర్తమాన జీవితాన్ని చారిత్రీకరించడానికి మహాశ్వేతాదేవి యాంటీ ఫిక్షన్‌ టెక్నిక్‌ని ఎన్నుకొన్నారు. పలామూ ప్రాంతాన్ని మొత్తం భారతదేశానికి ప్రతిబింబంగా నిలిపారు. ఆ క్రమంలో కోల్‌ ఆదివాసుల వీరోచిత పోరాటాల్ని, వాటిని అణచివేసిన రాజపుత్రుల క్రౌర్యాన్ని తెలిపే చరిత్రని కథలో యిమిడ్చారు. ఆ కథ చెప్పి ''దులాన్‌'' శనిచరిని జీవన పోరాటంలో నిమగ్నం చేస్తాడు. పేదల చెమట, కన్నీళ్లూ, రక్తమూ, శరీరంలో ప్రతి అణువునూ బతకడానికి అనివార్యంగా ఎలా ఉపయోగించుకోవాల్సి వస్తుందో చెప్పే దులాన్‌ గొంతు రచయిత్రిదే. కథ మొదట్లో నిస్సహాయురాలిగా వున్న శనిచరి దులాన్‌ నేర్పిన పోరాట స్ఫూర్తితో రుదాలి ఆచారాన్ని అడ్డం పెట్టుకొని దొరల చావును కోరుకుంటూ - ఆ చావులకు ఏడ్చి డబ్బు గుంజి వారిమీద పగ తీర్చుకొనే స్థాయికి ఎదుగుతుంది. మధ్య తరగతి మేధావులకు ఒక్కోసారి అది ఎబ్బెట్టుగానూ, అసహజంగానూ వుంటుంది. ''చిన్నోళ్లు'' కథలో కూడా ఈ విషయాన్ని గమనించవచ్చు.

తీవ్రమయిన అణచివేతకు గురయి అడవి లోతట్టు ప్రాంతానికి పారిపోయిన కుబా అగరియాలు తినడానికి తిండిలేక, శారీరకంగా గిడసబారిపోయిన ఒకానొక భయంకర సత్యం 'చిన్నోళ్లు' కథకు మూలం.
తరతరాలుగా కొనసాగే ఆకలీ అణచివేత సాధారణ మానవుల్ని పిగ్మీలుగా మార్చేయగలదు.
తమను పిగ్మీలుగా మార్చిన అనాగరిక వ్యవస్థ ముఖంమీద కుభా అగరియాలు తమ అంగాల్ని రాసి కసి తీర్చుకుంటారు. ఉప్పులేక ఊపిరి తీసుకోవడం కష్టమైన గిరిజనులు ప్రాణాలకు తెగించి ఏనుగులకోసం అటవీ శాఖ వాళ్లు అడవిలో చల్లిన రాతి ఉప్పును దొంగిలించి ఏనుగు కోపానికి గురై మరణిస్తారు. మనిషికి గానీ, జంతువుకు గానీ ఉప్పు దొరకకుండా చేసిందెవరు? తనకు ఉప్పు దొరకకుండా చేసిన మనుషుల్ని అడవి జంతువు సహించనప్పుడు మనుషులెలా సహించగలుగుతారు? ప్రతిఘటన అనివార్యమన్న విషయాన్ని 'ఉప్డు' కథలో రచయిత్రి ప్రతీకాత్మకంగా చెప్పారు.

కులాన్ని, వర్గాన్ని వేరువేరుగా చూడలేం - దోడీకి రెండూ సమానంగా దోహదం చేస్తాయనే స్పృహ మహాశ్వేతాదేవి రచనల్లో కనిపించే ప్రధానాంశం.
బలీయమైన మత విశ్వాసాలు, లోతుగా దాడుకుపోయిన కుల వ్యవస్థ వర్గ సమాజ,లో పీడనకు తిరుగులేని సాధనాలుగా ఉపయోగపడే తీరుని ఆమె తన రచనల్లో అడుగడుగునా స్పష్టం చేశారు.
ఆమె వర్గ దృక్పథం కులాన్ని మర్చిపోయేలా చేయలేదు. అంతేకాదు - కులం పేరున జరిగే అణచివేత, నిర్బంధపు వెట్టి, లైంగిక దోపిడీతో సహా స్త్రీల అనేక సమస్యలు - ఇవన్నీ భూమి సమస్యతో ముడిపడి వున్నాయని, భారతదేశపు భూ విధానంలో కుల - వర్గ దోపిడీ, పీడితుల ప్రతిఘటనా మమేకమై వున్నాయనీ ఆమె ఈ కథనాల్లో నిరూపించారు.

ఇందులోని 'దయ్యాలున్నాయి జాగ్రత్త', 'శ్రీశ్రీ గణేశ మహిమ (రాకాసి కోర)' కథలను సూరంపూడి సీతారాం తెలుగులోకి అనువదించారు. మహాశ్వేతాదేవిని తెలుగు పాఠకలోకానికి మొదటిసారిగా పరిచయం చేసిన ఆయనకే ఈ కథల సంపుటిని అంకితం చేయడం ఎంతైనా సమంజసం. మిగతా కథలను కలేకూరి ప్రసాద్‌ (రుదాలి; రుదాలి జీవన పరిణామ చిత్రణ), అనంత్‌ (చిన్నోళ్లు), ప్రభంజన్‌ (ఉప్పు), ప్రభాకర్‌ మందార (భారతదేశపు ప్రతిబింబం పలామూ- ఒక పరిచయం) అనువదించారు. అనువాదాలు బాగున్నాయి. పాత్రోచితమైన మాండలికం వాడి వుంటే ఇంకా బావుండేది.

ఈ కథలేవీ పాఠకుణ్ణి ఉల్లాస పరచవు - భయంకరమైన సమకాలీన దుర్భర సత్యాలీ కథలు - 'తక్షణ స్పందననూ, చర్యనూ' కోరుతున్నాయి.
(ఆదివారం ఆంధ్ర జ్యోతి 18-7-1999 లో ఎ.కె.ప్రభాకర్‌ పుస్తక సమీక్ష)

రుదాలి కథల సంపుటి
- మహాశ్వేతాదేవి

పుస్తక సంపాదకురాలు: సూరంపూడి కామేశ్వరి
198 పేజీలు, వెల: రూ.45

4 comments:

  1. ఈ పుస్తకం లో కథలు చదివాక మనసు గట్టిగా పిండేసినట్లయి కాసేపు ఆలోచనలు లేకుండా పోతాయి. ముఖ్యంగా శనిచరి కథ, గణేశ మహిమలో లక్ష్మి పరిస్థితి, ఉప్పు కథ ..ప్రతి కథా వ్యధా భరితమే! కానీ వేరే రాష్ట్రానికి చెందిన కథలను అనువదించేటపుడు ఏ మాండలికాన్ని వాడతారు? ప్రామాణికమైన తెలుగు వాడటమే సరైనదనిపించింది. అనువాదాలు కూడా ఎక్స్ లెంట్ గా ఉన్నాయి ఈ కథలో! డైరెక్ట్ కథ చదువుతున్న అనుభూతే కలుగుతుంది. లైబ్రరీలో తప్పక్ ఉండాల్సిన పుస్తకం ఇది.

    ReplyDelete
  2. సుజాత గారూ, మీ సానుకూల వ్యాఖ్యకు ధన్యవాదాలు!

    ReplyDelete
  3. చక్కని సమీక్ష

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌