Wednesday, October 29, 2008

తిండి గింజలకు తిలోదకాలు ... అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార అభద్రత విశ్లేషణ - డా.అమితావ ముఖర్జీ, వందనా శివ, ఉత్సా పట్నాయక,్‌ దేవీందర్‌ శర్మ


ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాల్లోకి కార్పొరేషన్లు ప్రవేశించడం సులభతరమైంది. ఫలితంగా సన్నకారు రైతులు వేగంగా నిర్వాసితులైపోతున్నారు. అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతను రాజ్యం గాలికి వదిలేసింది. వాటికోసం ఇప్పుడు ప్రైవేటు రంగంపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు రంగానికి గ్రామీణ ప్రాంతాల ప్రగతిపట్ల ఏమాత్రం ఆసక్తిలేదు.

నిత్యాహారంలో భాగమైన పప్పు ధాన్యాలను, ముతక ధాన్యాలను ఉత్పత్తి చేసే సాగు భూమి తగ్గిపోయి, నీరు ఎక్కువ అవసరమైన నూనె గింజలను, చెరుకు, బంగాళాదుంపలు, ప్లాంటేషన్‌ వంటి పంటలను పండించే భూమి విస్తీర్ణం రోజురోజుకూ పెరిగిపోతోంది. వ్యవసాయ, వ్యవసాయేతర శ్రామికుల వాస్తవికాదాయం పడిపోతోంది. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ఉపాధి అవకాశాలు స్తంభించిపోతున్నాయి. ఉద్యోగులు తొలగింపునకు గురవుతున్నారు. ఇవన్నీ దేశంలో అభద్రతా స్థితిని పెంపొందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆహారభద్రతపై తగినంత సమాచారం అందించి దానిపై శాస్త్రీయ చర్చకు వీలుకల్పించే కృషిలో భాగంగా ఈ పుస్తకం వెలువడింది.

స్వతంత్రభారతంలో వ్యవసాయం - ఆకుపచ్చ విప్లవమూ అటు తర్వాతా ... అనే వ్యాసంలో ఆహార భద్రతపై హరిత విప్లవ ప్రభావాన్ని వందనా శివ సవివరంగా చర్చించారు.

ఎగుమతి లక్ష్యంగా గల వ్యవసాయం - ఆహార భద్రత, భారత తదితర వర్థమాన దేశాల పరిస్థితి ... అనే వ్యాసంలో ఉత్సా పట్నాయక్‌ సరళీకరణ, స్థిరీకరణ, వ్యవస్థాగత సర్దుబాట్లు తదితర ప్రైవేటీకరణ చర్యలు సృష్టిస్తున్న బీభత్సాన్ని కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించారు.

భయం గొల్పే భవిష్యత్తు ... అనే వ్యాసంలో దేవీందర్‌ శర్మ ఇటీవలి అంతర్జాతీయ దృశ్యాల నేపథ్యంలో మన దేశం అనుసరిస్తోన్న తప్పుడు వ్యవసాయ విధానాల గురించి, వ్యవసాయ దిగుమతులపై ఆంక్షలను తొలగించాలంటూ మనదేశంపై పెరుగుతున్న వత్తిళ్లగురించి, వాటి భవిష్యత్తు పరిణామాల గురించి చర్చించారు.

ప్రవేశిక లో డా. అమితావ ముఖర్జీ మొత్తం పరిస్థితిని సమీక్షించారు. వర్థమాన దేశాల్లో నెలకొంటున్న ఆహార అభద్రత గురించి సమగ్ర అవగాహనను కలిగిస్తాయి. ఆలోచింపజేస్తాయి ఇందులోని వ్యాసాలు.


తిండి గింజలకు తిలోదకాలు
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార అభద్రతకు దోహదం చేస్తున్న అంశాల విశ్లేషణ

- డా.అమితావ ముఖర్జీ, వందనా శివ, ఉత్సా పట్నాయక,్‌ దేవీందర్‌ శర్మ
తెలుగు అనువాదం : కలేకూరి ప్రసాద్‌
84 పేజీలు, వెల: రూ.20

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌