Tuesday, October 28, 2008

వ్యవసాయం : ఎటు మన పయనం ? - వి. హనుమంతరావు

వ్యవసాయం : ఎటు మన పయనం ? - వి. హనుమంతరావు
ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, వ్యవస్థాగత మార్పులు, ప్రైవేటీకరణ, ప్రపంచ బ్యాంకు మొదలైన వాటి ప్రభావాలు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల మీద ఆధిపత్యం కోసం అమెరికా తదితర సామ్రాజ్యవాద దేశాలు క్రమేణా రణ నీతికి బదులు రుణ నీతిని అనుసరిస్తూ బడుగు దేశాల మూలుగులను పీల్చేస్తున్నాయి.

మన దేశంలో నూటికి 70 మంది వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. జాతీయాదాయంలో మూడోవంతు వ్యవసాయం నుంచే వస్తోంది. వ్యవసాయదారులు పండిస్తేనే మనందరికీ తిండి లభిస్తుంది. వ్యవసాయం దెబ్బతింటే దేశంలో మూడోవంతు పరిశ్రమలు పడుకొంటాయి. మన ఆర్థిక వ్యవస్థలో అంత ముఖ్యమైన వ్యవసాయం గురించి అసలు నూతన ఆర్థిక విధానంలో సరైన ప్రస్తావనేలేదు. వ్యవసాయం గురించిన విధాన పత్రం తయారు కాకుండానే నూతన ఆర్థక విధాన పత్రం తయారు చేశారు మన పాలకులు. పునాది గురించి పట్టించుకోకుండానే స్వతంత్ర భారత సౌధాన్ని నిర్మిస్తున్నారు. దేశ స్వాతంత్య్రాన్ని ప్రపంచ విపణివీధిలో తాకట్టుపెట్టేందుకు సంసిద్ధులవుతున్నారు. వీటన్నింటి ఫలితంగా నేడు భారత వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

భారీ పెట్టుబడులు పెట్టి, లాభాలు సంపాదించాలనే యావ వున్న వారికే వ్యవసాయంలో స్ధానం వుంటుందని ప్రభుత్వ విధానాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు తదితర సంస్థలు ప్రోత్సహించిన అధిక వరి వంగడాలు మన గ్రామ సీమల్లో ఆర్థిక వ్యత్యాసాలను పెంచుతున్నాయి. ఎక్కువ ఎరువులు, ఎక్కువ నీరు, అదే మోతాదులో పురుగుమందులు వాడితే తప్ప ఆ అధిక దిగుబడి వరివంగడాలు పండవు. అందుకే ఎన్ని ఎరువుల కర్మాగారాలు నిర్మించుకున్నా ఇవాళ తీవ్రమైన ఎరువుల కొరత ఏర్పడి రైతులు అ ల్లాడున్నారు. బడా భూస్వాములతో, పెట్టుబడిదారులతో సామాన్య రైతులు పోటీపడలేక నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయానికి తిలోదకాలిచ్చి, ఉన్న భూములను భూస్వాములకు సమర్పించుకుని ఎందరో సన్నకారు రైతులు కూలీలుగా పట్టణాలకు వలస పోతున్నారు.

వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులను, సంక్షోభాన్ని చక్కగా చిత్రించిన పుస్తకమిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, వివాదాలను, ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన నీటి వినియోగదారుల సంఘాల లోపాలను, భూసంస్కరణలకు పట్టిన దుర్గతిని రచయిత ఇందులో చక్కగా చిత్రించారు. మన వ్యవసాయ విధానం, దాని స్థితిగతులు, రుణాలు, ధరలపెరుగుదల కథా కమామిషులను అద్భుతంగా విశ్లేషించారు. సమగ్ర సమాచారాన్ని సేకరించి, సులభశైలిలో రాసిన ఇందులోని వ్యాసాలు మిమ్మల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.

రచయిత వి. హనుమంతరావు గత 50 సంవత్సరాలుగా పత్రికా విలేకరిగా, సంపాదకునిగా పనిచేస్తున్నారు..డేటా న్యూస్‌ ఫీచర్స్‌ సస్థ సంపాదకునిగా ఆంధ్రప్రదేశ్‌ వార్షిక దర్శిని, పురపాలక దర్శిని, డేటా ఆంధ్ర ప్రదేశ్‌ పక్షపత్రికలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఎట్‌ 50 అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని వెలువరించారు.

వ్యవసాయం: ఎటు మన పయనం ?
- వి. హనుమంతరావు
94 పేజీలు, వెల : రూ.25

2 comments:

  1. ఈ పుస్తకం చాలా విలువైనది. నాగరీకులు తాము తింటున్న బువ్వ ఎక్కడినుండి వస్తుందో తెలువకుంట బతుకుతున్నరు. తినడానికి బువ్వ దొరుకుతుందో లేదో విశ్లేషించే ఈ పుస్తకాన్ని తప్పకా కొని చదువుతాను.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌