Wednesday, October 29, 2008

పురుగు మందుల విషవలయం - రాబర్ట్‌ వాన్‌డెన్‌ బోష్‌


గత మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ కీటక నాశినుల వెల్లువ ఎక్కువయింది. వరి, పత్తి, కంది, కూరగాయలు, పండ్లు తదితర పంటలపైనే కాదు చిన్న చిన్న పెరటితోటల్లో, ఇళ్లల్లో, గోల్ఫ్‌ మైదానాల్లో ఎక్కడపడితే అక్కడ రకరకాల పురుగుమందులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

ఆధునిక కీటక నాశినులన్నీ ప్రధానంగా విషాలు. అవి అటు చెడువాటినే కాదు ఇటు మంచివాటినీ సమానంగా నాశనం చేస్తాయి. వాటిని తెలివిగా వాడకపోతే ప్రకృతిలోని సాధారణ సమతౌల్యత దెబ్బతిని తిరిగి కీటకాల దాడి మరింతగా పెరుగుతుంది. మానవాళికి హాని చేసే కీటకాల శరీర పటుత్వం కన్నా మేలు చేసే కీటకాల శరీర పటుత్వం తక్కువ. అందువల్ల కీటక నాశినుల వల్ల మనకు మేలు చేసే కీటకాలే ఎక్కువగా బలిఅవుతాయి.

ఇళ్లల్లో కీటక నాశినులు వాడటం వల్ల ప్రమాదస్థాయి మరింత తీవ్రంగా వుంటుంది. మనదేశంతో సహా కొన్ని వర్ధమాన దేశాల్లో తల్లి పాలల్లో కూడా డిడిటి అవశేషాలు కనిపించాయి. మలేరియా నిర్మూలన పేరుతో విచ్చలవిడిగా డిడిటిని వాడిన ఫలితంగా అది సంభవించిన పరిణామమిది.

కీటక నాశినుల వాడకం ఆ వ్యాపారం సాగించేవారికి తప్ప ఇతరులందరికీ హాని కలిగిస్తుంది. ఈనాటి కీటకనాశినులు పురుగులను అరికట్టకపోగా, ఆ పురుగుల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ మరింత అధికమోతాదులో పురుగు మందులను వాడాల్సిన దుస్థితికి దారితీస్తున్నాయి. రైతుల అప్పులనూ, రైతుకూలీలకు తీవ్ర అనారోగ్యాన్ని మిగులుస్తున్నాయి. వాడకందార్లను ఎలాంటి నష్టపరిహారాన్ని పొందేందుకు అవకాశంలేని అనూహ్య ప్రమాదాలకు గురిచేస్తున్నాయి.

ఇవాళ శీతలపానీయాలతో సహా అనేక ఆహార పదార్థాలలో పురుగుమందుల అవశేషాలు పెద్దఎత్తున కన్పించడం ఆందోళన కలిగిస్తోంది.

పురుగు మందులు తలపెట్టే విధ్వంసం, అది జీవావరణ సమతుల్యానికి కలిగించే హాని, శాస్త్రవేత్తలం ... విషయజ్ఞులంఅని చెప్పుకునే వారి మానసిక నిష్క్రియాపరత్వం, ఆత్మవంచన తత్పలితంగా పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కలుగుతున్న హాని నేపథ్యంలో ఆవేశంతో, ఆవేదనతో, బాధతో వెలువరించిన పరిశోధనాత్మక రచన యిది.

పురుగు మందుల విషవలయం
- రాబర్ట్‌ వాన్‌ డెన్‌ బోష్‌
ఆంగ్ల మూలం : The Pesticide Conspiracy - Robert Van den Bosch, Doubleday & Co, USA
తెలుగు అనువాదం : రామమూర్తి
పుస్తక సంపాదకుడు: కె. సురేష్‌
78 పేజీలు, వెల: రూ.18

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌