
నిమ్న కులాలవారి కోసం, స్త్రీల కోసం దేశంలోనే ప్రప్రథమంగా పాఠశాలలు స్థాపించి, విద్యావ్యాప్తి ద్వారా వారిని దాస్య విముక్తుల్ని చేసేందుకు; కులవివక్షనూ, సాంఘిక దోపిడీనీ, మూఢనమ్మకాలనూ ... వాటికి కేంద్ర బిందువైన బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన తొలితరం సామాజిక విప్లవకారుడు జోతిరావు ఫూలే (1827-1890). ఆయన సమగ్ర జీవిత సంగ్రామ చరిత్రే ఈ పుస్తకం.
నిన్న మొన్నటి వరకూ మన దేశంలో విద్య అగ్రవర్ణాల గుత్తసొత్తుగా వుండేది.
స్త్రీలైతే ఏ కులానికి చెందినవారైనా నాలుగు గోడల మధ్య బందీలుగా పడివుండాల్సిందే.
విద్య మీదా, రాజ్యం మీదా, మతం మీదా బ్రాహ్మణులదే తిరుగులేని పెత్తనం.
ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మం న్యాయం అంటూ వారు బోధించే నీతులన్నీ వారి ఆధిపత్యం కొరకే అన్నట్టు నడిచిన కష్టమైన ఆనాటి కాలంలోనే సమానమైన మరో సమాజం కోసం నడుంబిగించాడు ఫూలే.
ఎంతో సాహసోపేతంగా నిమ్న కులాల కోసం, స్త్రీల కోసం పాఠశాలల్ని నెలకొల్పి, వారి కొరకు తన భార్య సావిత్రీబాయికి చదువు చెప్పి ఆమెను టీచర్‌గా తీర్చిదిద్దాడు.
అంతేకాక సతీ సహగమనాన్ని, అంటరానితనాన్ని, పురోహిత వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యమించాడు.
వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.
కార్మిక కర్షకుల హక్కులకోసం, సంఘ సంస్కరణ కోసం దళితులపై తరతరాలుగా సాగుతున్న బ్రాహ్మణీయ దోపిడీని ఎదిరిస్తూ తుదివరకు నిలబడ్డ ఫూలే జీవితం, పోరాటం తదనంతర కాలంలో డాక్టర్ అంబేడ్కర్ వంటి ఎందరో మహనీయులకు స్ఫూర్తినిచ్చింది.
హిందూమతోన్మాదం ఇవాళ ...మతభక్తే ... దేశభక్తి ... అనే కొత్త వాదనతో తిరిగి పడగ విప్పేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇ లాంటి పుస్తకాల ఆవశ్యకత ఎంతో వుంది.
రచయిత ధనంజయ్ కీర్ మహారాష్ట్రకు చెందిన వారు. డాక్టర్ అంబేడ్కర్ మిత్రుడు. 1969లో వెలువడిన మహాత్మా ఫూలే సమగ్ర వాజ్మయ్ పుస్తకానికి సంపాదకులు. ఆయన మహాత్మా జోతిరావ్ ఫూలే జీవితం గురించి చాలాకాలం పరిశోధించి ఈ పుస్తకాన్ని రాశారు.
ఈ పుస్తక స్వేచ్ఛానువాదకురాలైన డా. విజయ భారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రాశారు. వాటిలో అంబేడ్కర్, పురాణాలు-కులవ్యవస్థ పేరుతో రాసిన సత్యహరిశ్చంద్రుడు, దశావతారాలు, షట్చక్రవర్తులు ముఖ్యమైనవి.
మహాత్మా జోతిరావ్ ఫూలే
- ధనంజయ్ కీర్
తెలుగు సేత: డా. విజయ భారతి
208 పేజీలు, వెల: రూ.60/-
No comments:
Post a Comment