Thursday, October 16, 2008

తొలి ఉపాధ్యాయుడు ...చదువులపై రాసిన, కంటతడి పెట్టించే అపూర్వ నవల. రచన: చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌ ... తెలుగు అనువాదం : ఉప్పల లక్ష్మణరావు


మారుమూల కిర్గిజ్‌ గ్రామంలో తొట్టతొలి పాఠశాలను స్థాపించి ... నవ సమాజ నిర్మాణం కోసం ఓ యువ ఉపాధ్యాయుడు పడ్డ తపనను, ఆ క్రమంలో సామాజికంగా అతనికి ఎదురైన పెను సవాళ్లను హృద్యంగా చర్చిస్తుందీ నవల.

దూషన్‌ పేరుతో ఐత్‌మాతొవ్‌ 1962లో రాసిన ఈ నవలకు ఆంగ్ల అనువాదమైన ఫస్ట్‌ టీచర్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది.

సోవియట్‌ సమాజ నిర్మాణం కోసం తరతరాలుగా వస్తున్న సంప్రదాయ విలువలకు దూరం జరగాల్సి వచ్చినప్పుడు తొలినాళ్లలో ఆయా జాతులు అనుభవించిన సంఘర్షణను, ఆ వ్యథను ... ఆక్రమంలో ఒ తొలితరం ఉపాద్యాయుడు సాధించిన విజయాలను అద్భుతంగా వివరిస్తుందీ నవల.

బాహ్య ప్రపంచపు విజ్ఞానాన్నీ, విద్యనూ తన కుగ్రామంలోకి తీసుకొచ్చి వారి జీవితాల్లో అనూహ్య మార్పులు తెచ్చిన దూషన్‌ అనుభవాలు ... నేడు మనదేశంలో ఇటువంటి కృషి చేస్తున్న ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

... రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించటంకంటే కూడా సమాజం అంతరాత్మను ప్రతిధ్వనించటమే ముఖ్యమన్న మాక్సిం గోర్కీ మాటలను చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌ శిరసావహించారు.

ఒక రచయిత నిబద్ధతకు ...ఎటువంటి భేషజాలూ లేకుండా మార్పును ఆహ్వానించటం, ఆవిష్కరించటమే నిజమైన కొలమానమని వ్యాఖ్యానించేవారాయన. అందుకే ఆయన సోవియట్‌ వాస్తవికతలోని చీకటి కోణాలను కూడా నిష్కర్షగా, ఆలోచనాత్మకంగా తన రచనల్లో ప్రతిబింబించారు.

... కిర్గిజ్‌ జాతిపితగా పేరొందిన చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌ రచనలను మా దేశంలో ప్రతి కుటుంబం చదువుతుంది. మళ్లీ మళ్లీ చదువుతుంది. ఎందుకంటే మాకు గుండె ధైర్యాన్ని నూరిపోసింది ఆయన రచనలే. కేవలం ఒక వ్యక్తిగా మనం ఎంత మార్పు తేవచ్చో చూపారాయన ... అంటారు కిర్గిజ్‌ మానవ హక్కుల కార్యకర్త నటాలియా ఆబ్లోవా.

అర్థశతాబ్ధం క్రితం నాటి జమీల్యా, తొలి ఉపాధ్యాయుడు, తల్లి భూదేవి వంటి ఆయన రచనలు 150 ప్రపంచ భాషల్లోకి అనువాదమవటమే కాదు ఇప్పటికీ వన్నె తగ్గకుండా సమకాలీన రచనల్లా అ లరిస్తుండటానికి ఐత్‌మాతొవ్‌ స్పృశించిన సార్వజనీన, మానవీయ భావనలే కారణం.ఆయన కిర్గిస్థాన్‌ రాయబారిగా పలుదేశాల్లో పనిచేశారు. 2008 జూన్‌ 10న జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో కన్నుమూశారు.

తొలి ఉపాధ్యాయుడు
- చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌
అనువాదం: ఉప్పల లక్ష్మణరావు
106 పేజీలు, వెల: రూ.50

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌