Sunday, October 5, 2008

అమ్మా నాన్నలకు ... ఎ బుక్‌ ఫర్‌ పేరెంట్స్‌ ... ఏ.ఎస్‌.మకరెంకో


ప్రపంచ ప్రసిద్ధ విద్యావేత్తలలో ఒకరైన ఆంటన్‌ సెమ్యోనొవిచ్‌ మకరెంకో పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకోసం ప్రత్యేకంగా రాసిన పుస్తకం ఎ బుక్‌ ఫర్‌ పేరెంట్స్‌.

పిల్లలను కావాలనుకోవడమే ఒక బాధ్యతను స్వీకరించడమని, దానిని తల్లితండ్రులు గుర్తించాలని మకరెంకో అంటారు. బాధ్యతను చేపట్టడం అంటే వారిని జీవితంలో ఆర్థికంగా స్థిరపడేలా చూడగలగడం ఒక్కటే కాదని ఆయన కచ్చితమైన అభిప్రాయం. చిన్నారులు మైనం ముద్దల వంటివారనీ, వారు పెద్దలుగా ఎదిగి ఎలా తయారైనా బాధ్యత అమ్మా, నాన్నలదేననీ విశ్వసిస్తారు. పసిపిల్లలకు ఇల్లే పాఠశాల అన్నది ఆయన నమ్మకం.

విద్యాబోధనారంగంలో ప్రజాస్వామ్య భావనలను ప్రవేశపెట్టిన మకరెంకో కుటుంబంలోనూ ఈ ధోరణులు ఉండటం వాంఛనీయమని భావించారు. అతి గారాబం లేదా అతి క్రమశిక్షణ, అర్థం లేని అధికార ప్రదర్శనల వల్ల పిల్లల మనస్తత్వం ఎలా రూపొందుతుందో మకరెంకో ఈ గ్రంథంలో ఉదాహరణలతో సహా రాశారు.

సునిశితమైన ఆయన పరిశీలనాశక్తి, సున్నిత మనస్తత్వం, మొత్తం సమాజం పట్ల బాధ్యత ముఖ్యంగా పిల్లలపై ఆయనకు గల అపారమైన అనురాగం ఇందులో ఆద్యంతం కనిపిస్తాయి.

పిల్లల పెంపకం బాధ్యతలు వహించే అమ్మా నాన్నలకు స్వార్థం ఉండకూడదంటూనే అర్థం లేని త్యాగాల వల్ల ఫలితం రాదని మకరెంకో అంటారు. ఆయన వ్యక్తం చేసిన అన్ని అభిప్రాయాలతో ఏకీభవించలేకపోయినా విద్యాబోధనారంగ నిపుణుడిగా, దశాబ్దాల తరబడి పిల్లలతో సాన్నిహిత్యం కలిగిన పరిశీలకునిగా, అన్నింటికంటే ప్రధానంగా అత్యున్నతమైన మానవతావాదిగా మకరెంకోకు గల గుర్తింపును దృష్టిలో ఉంచుకుంటే బిడ్డల పెంపకంపై తల్లితండ్రుల కోసమే రాసిన ఈ పుస్తకం పెద్దలందరికీ నిస్సందేహంగా ఉపయోగకరం.
విద్యాబోధన పద్ధతులు, బిడ్డల శిక్షణ వంటి అంశాలపై మకరెంకో రాసిన వివిధ గ్రంథాలు పలు ఖండాల్లో, అనేక భాషల్లో లక్షల సంఖ్యలో ప్రచురితమై, ప్రజాదరణ పొందాయి. మకరెంకో రచనల్లో తెలుగులో వచ్చిన రెండో పుస్తకమిది.
......

...పిల్లలు తమ పెద్దలతో, ముఖ్యంగా తల్లితండ్రులతో అనుచితంగా ప్రవర్తించారంటే, క్రమశిక్షణ లేకుండా దిమ్మరులుగా, దొంగలుగా, గూండాలుగా తయారయ్యారంటే, కుటుంబం పట్ల, చదువుపట్ల బాధ్యతను విస్మరించారంటే అందుకు కారణాలకోసం ఎక్కడో అన్వేషించవద్దు. తొలి తప్పు మీదే - అమ్మానాన్నలదే అని గుర్తించండి. ఇలా జరిగిపోయిన తప్పుల గురించి ఆవేదన చెందడం కంటే, ఏ తరహా వైఫల్యాలు పిల్లలను పెడదారిలోకి నెడతాయో గుర్తించండి. అందుకు నా ఈ ప్రయత్నం ఉపకరిస్తే ఆ మేరకు అది ఒక విజయమే.
...మకరెంకో

అమ్మా నాన్నలకు ...
ఏ.ఎస్‌.మకరెంకో
ఆంగ్లమూలం ఎ బుక్‌ ఫర్‌ పేరెంట్స్‌
తెలుగు అనువాదం: టి.ఎన్‌.వి.రమణమూర్తి
200 పేజీలు, వెల : రూ.50/-

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌