Saturday, October 11, 2008

వాస్తు - నిజానిజాలు ... ఆర్‌.వి.కొల్హాట్కర్‌, జెఎన్‌టియు ఆర్కిటెక్చర్‌ ప్రొఫెసర్‌


ఇటు మూఢ నమ్మకాలు, అటు ఫ్యాషన్లు మన సమాజాన్ని అంటురోగాల్లా అలుముకుంటున్నాయి. యువకులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, విద్యావంతులు, నిరక్షరాస్యులు అన్న తేడాలేకుండా అందర్నీ అవి లొంగదీసుకుంటున్నాయి. ప్రవాహంలా వచ్చిపడుతున్న వాటి ధాటికి హేతువాద దృక్పథం, తర్కం, విచక్షణ, వివేకం అన్నీ మట్టిగొట్టుకుపోతున్నాయి.

నిజమే, వాస్తుశాస్త్రం చాలా ప్రాచీనమయినది. అందుబాటులో వున్న సామాగ్రిని బట్టి ఆనాడు ఇళ్లు ఎట్లా కట్టాలో చెప్పేవారు. అట్లాగే వైద్యరంగంలోనూ ప్రాచీన కాలంలో కొన్ని చికిత్సా పద్ధతులు ప్రాచుర్యంలో వుండేవి. కాలం గడిచే కొద్దీ వైద్యరంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎంతో అభివృద్ధి జరిగింది. అదేవిధంగా గృహనిర్మాణ రంగంలోనూ ఎంతో పురోభివృద్ధి జరిగింది. అయినా ఇంకా ప్రాచీన పద్ధతులనే పట్టుకుని వేలాడటం, వాస్తు పేరుతో గందరగోళం సృష్టించడం దారుణం.

వాస్తు అంటే నివాసం లేదా ఇల్లు అని అర్థం. మన పూర్వీకులు ఒకప్పుడు గుహల్లో నివసించారు. తరువాత ఆకులతో కుటీరాలు నిర్మించుకున్నారు. తరువాత మట్టితో ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు సిమెంట్‌తో ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు.

ప్రాచీన కాలంలో మాయామాతా, వరాహమిహిరుడు, మానసారుడు మొదలైనవారు వాస్తు శాస్త్ర గ్రంథాలు రాశారు. అయితే వాళ్లు భిన్న ప్రాంతాలకు చెందిన వాళ్లు కావడంతో వాళ్ల అభిప్రాయాల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. ఈనాటి అపర వాస్తు పండితుల అభిప్రాయాల్లో కూడా అట్లాంటి అభిప్రాయభేదాలను మనం గమనించవచ్చు.

ఆధునిక ఆర్కిటెక్ట్‌లు ఎంతో శ్రమించి ఇళ్లకు అద్భుతమైన ప్లాన్లు గీసి ఇస్తే అవన్నీ ఈ కుహనా వాస్తు పండితుల సలహాలతో అస్తవ్యస్తమవుతున్నాయి. ఆ పండితుల హద్దులకు లోబడకపోతే ఆర్కిటెక్టులు తమ ఉపాధినే కోల్పోయే దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడింది. వాస్తు పిచ్చి మన సమాజంలో రోజురోజుకూ ముదిరిపోతోంది. వాస్తుపండితులు గృహస్థులను రకరకాలుగా భయపెడుతున్నారు. ... ఇట్లా కట్టావంటే నీ కొడుక్కో కూతురుకో ప్రాణగండం వుంటుంది ... నీ భార్య అనారోగ్యం పాలవుతుంది ... నీ సంసారంలో గొడవలు, అశాంతి చెలరేగుతాయి ... నీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ... అంటూ బెంబేలిత్తిస్తుంటారు. దాంతో ఎందరో చక్కగా కట్టుకున్న ఇళ్లను కూడా వేలకు వేలు ఖర్చుపెట్టి అనవసరంగా చెడగొట్టుకుంటున్నారు.

మన దేశంలో రాజకీయ నాయకులకు ఈ వాస్తు భయం మరింత ఎక్కువగా వుంది. కారణం అన్ని రంగాలకన్నా అస్థిరమైంది రాజకీయ రంగం. వాళ్ల భయాలు, మూఢనమ్మకాలు మొత్తం సమాజం మీద మరింత గాఢంగా ప్రభావం చూపుతున్నాయి.

ఎన్‌.టి.రామారావు కి ఈ వాస్తు భయాలు పుష్కలంగా వుండేవి. పర్యవసానంగా ఆయన తన ఇంటికి ఎన్నో మార్పులు చేర్పులు చేయించారు. కానీ అవేమీ ఆయనకు కలిసిరాలేదు. ఆయన తన ముఖ్యమంత్రి పదవినే కాదు చివరికి ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అట్లాగే దేవెగౌడ ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు వాస్తు పండితుల సలహా మేరకు భవనానికి ఎన్నో మార్పులు చేయించారు. అయినా సంవత్సరం గడిచే లోగానే ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు.

ఇవాళ ఏ రియలెస్టేట్‌ ప్రకటన చూసినా మా ఇండ్లు, ఫ్లాట్లు పక్కా వాస్తు ప్రకారం నిర్మించబడ్డాయన్న మాట విధిగా కనిపిస్తుంది. అశాస్త్రీయంగా కట్టిన వాటిని శాస్త్రీయంగా వున్నాయని నమ్మింపజేసే ప్రయత్నమంటే ఇదే. అసలు ఈ వాస్తు పిచ్చి మొదట ఆంధ్రప్రదేశ్‌లోనే మొదలయింది. క్రమంగా దేశమంతటికీ వ్యాపించింది. విచిత్రం ఏమిటంటే చివరికి అనేకమంది ముస్లింలు సైతం ఈ వాస్తును బహిరంగంగానో రహస్యంగానో పాటిస్తున్నారు.

వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం ఇంటికి దక్షిణ ద్వారం వుండకూడదు... అది అశుభం అంటారు. కానీ ఏ నగరం లోనైనా నాలుగు రోడ్ల కూడలికి వెళ్లి చూడండి అనేక షాపుల ద్వారాలు దక్షిణాభిముఖంగా కనిపిస్తాయి. అది అనివార్యం కూడా. అవన్నీ నష్టాల్లో మునిగితేలుతున్నాయా? అంతెందుకు అగ్రగామి దేశమైన అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ కూడా దక్షిణాభిముఖంగానే వుంది.
వాస్తుపండితులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఇట్లాంటి అపోహలను అనంతంగా ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారు. వాస్తు గుట్టు రట్టు చేయడానికి తన వ్యాసాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, బహిరంగ చర్చల ద్వారా ప్రొఫెసర్‌ ఆర్‌.వి. కొల్హాట్కర్‌ విశేషంగా కృషి చేస్తున్నారు. వారి కృషికి మద్దతు పలుకుతూ వాస్తు పై ఆయన రాసిన ఈ చిన్న వ్యాసాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ విస్తృత చర్చ నిమిత్తం ప్రజలకు అందిస్తోంది.

వాస్తు - నిజానిజాలు
ప్రొఫెసర్‌ ఆర్‌.వి.కొల్హాట్కర్‌
తెలుగు అనువాదం: రవి
10 పేజీలు, వెల: రూ.2

4 comments:

 1. naati taraniki neeti taraniki vunna diffrenceni chakkaga vivarinchstu,""వాస్తు - నిజానిజాలు "" la dwara muDanammakalaku. vastavikataku madya dhuranni kuda vivarincharu.thanks for posting such a nice posting...

  srisatya.

  ReplyDelete
 2. శ్రీసత్య గారూ, చక్కని అభిప్రాయం వెలిబుచ్చారు. ధన్యవాదాలు.

  ReplyDelete
 3. very nice story. In present situation this book is very useful to the people

  ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌