
సుప్రసిద్ధ జర్మన్ రచయిత ఎరిక్ కేస్టనర్ 1933లో పిల్లల కోసం రాసిన నవల దాస్ ప్లెయిజెండె క్లాసెస్ (ఫ్లయింగ్ క్లాస్‌రూమ్)కు తెలుగు అనువాదమిది. బోర్డింగ్ పాఠశాలల్లో చదువుకునే పిల్లల జీవన చిత్రాన్ని ఆవిష్కరించే ఈ నవలలో క్రిస్టమస్ డ్రామా, పిల్లల, ఉపాధ్యాయుల అనుభవాలు, అనుభూతులు హృదయానికి హత్తుకునేలా చిత్రించబడ్డాయి. మధ్యమధ్య పెద్దలు చేసే యుద్ధాల మీదా, జాతీయవాదం మీదా, దేశభక్తి మీదా చేసిన వ్యాఖ్యానాలూ చెణుకులూ పాఠకులను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. జర్మనీలో నాజీలు ఇంకా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోకముందు కేస్టనర్ రాసిన చివరి రచన యిది. అయితే ఇందులో నాజీల గురించిన ప్రస్తావన ఎక్కడా స్పష్టంగా లేకపోయినప్పటికీ నవల నేపథ్యంలో కనిపించే ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, తీవ్ర నిరుద్యోగ సమస్య వంటివి జర్మన్ ఓటర్లు హిట్లర్ వైపు గంపగుత్తగా మొగ్గుచూపడానికి ఏవిధంగా దోహదం చేశాయో చాటిచెబుతాయి.
ఈ నవలలోని పాత్రలన్నీ ఉల్లాసంగా, ఉత్తేజంగా అనిపిస్తాయి. కథనం మనసును రంజీపజేసేలా సాగుతుంది. ఈ పుస్తకం ద్వారా రచయిత యిచ్చిన సందేశం ఏడు దశాబ్దాల అనంతరం ఈనాటి సమాజానికి కూడా వర్తిస్తుంది. సునిశితమైన హాస్యం, బోర్డింగ్ పాఠశాల జీవితం, గొడవలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు, నాటకీయత, అక్కడి స్నేహమాధుర్యం ... అన్నింటికీ మించి ''బాల్యాన్ని మరచిపోకండి'' అనే ఉదాత్తమైన సందేశం పాఠకుల మనసుపై చెరగని ముద్రవేస్తాయి. పెద్దల కన్నీళ్లు ఎంత బరువైనవో పిల్లల కన్నీళ్లు కూడా అంతే బరువైనవికదా.
ఎరిక్ కేస్టనర్ (23-2-1899 - 29-7-1974) ఇరవైయవ శతాబ్దపు జర్మన్ కథకులలో, స్క్రీన్‌ప్లే రచయితలలో ప్రముఖుడు. హాస్యపూరిత స్ఫూర్తిదాయక బాల సాహిత్యం ద్వారా, అడపాదడపా రాసిన వ్యంగ్య కవితల ద్వారా ఆయన ఎంతగానో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కేస్టనర్‌కు పదిహేనేళ్లప్పుడే మొదటి ప్రపంచయుద్ధం మొదలవుతుంది. ఒకచోట ''ఆ యుద్ధం నా బాల్యాన్ని మింగేసింది'' అని ఆక్రోశిస్తాడాయన. 1917లో నిర్బంధంగా సైన్యంలో చేరవలసి వస్తుంది. సైనికుడిగా తను పొందిన క్రూరమైన శిక్షణ, యుద్ధం సృష్టించే బీభత్సం, మానవహననం ఆయనపై తీవ్రమైన ప్రభావం చూపాయి. అవి ఆయనలో మిలిటరీ వ్యతిరేక భావనలు పెంపొందింపజేశాయి. ఆ తదనంతర కాలంలో ఆయన వివిధ పత్రికలలో స్వేచ్ఛా విలేఖరిగా పనిచేశారు. ప్రముఖ బెర్లిన్ పత్రికలన్నింటిలో కాలమ్‌లను, సమీక్షలను, వ్యాసాలను రాశారు. 1928లో ఆయన రాసిన ఎమిల్ అండ్ దై డిటెక్టివ్ (ఎమిల్ అండ్ ది డిటెక్టివ్) అనే పిల్లల నవల ఎంతో ప్రాచుర్యం పొందింది. పిల్లల డిటెక్టివ్ రచనలకు అది మార్గదర్శకమయింది. ఎనిడ్ బ్లయిటోన్ వంటి అనేకమంది పిల్లల పుస్తక రచయితలు దానినుంచి ప్రేరణ పొందారు.
నాజీలు కేస్టనర్‌ను చాలా ఇబ్బందులకు గురిచేశారు. అయినా జర్మనీని వదిలివెళ్లేందుకు ఆయన ససేమిరా అన్నారు. ఈ ఎగిరే క్లాస్‌రూం నవల ప్రచురించబడిన కొద్దిరోజులకే నాజీలు అధికారంలోకి వచ్చారు. వచ్చిరాగానే వాళ్లు ఈ పుస్తక ప్రతుల్ని తగులబెట్టారు. నాజీ గూఢచారి సంస్థ గెస్టపో ఆయనను అనేకసార్లు ప్రశ్నించి వేధించింది. జర్మన్ రచయితల సంఘం ఆయనను తమ సంఘం నుంచి బహిష్కరించింది. నాజీల పాలన కొనసాగినంతకాలం కేస్టనర్ ఇలా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆయన మొదటినుంచీ శాంతికాముకుడిగానే వున్నారు. పశ్చిమ జర్మనీలో అణ్వాయుధాల నిల్వలను వ్యతిరేకించే ప్రజాప్రదర్శనల్లో చురుకుగా పాల్గొన్నారు. వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా కూడా ఆయన తన నిరసన గళాన్ని వినిపించారు.
శ్రీ బి.వి.సింగరాచార్య గారు ఈ పుస్తకాన్ని ఆరోజుల్లోనే నేరుగా జర్మనీనుంచి తెలుగులోకి అనువదించి, ప్రచురించడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ప్రముఖ చిత్రకారుడు శ్రీ అన్వర్ ఈ పుస్తక ప్రతిని హైదరాబాద్ బుక్ ట్రస్ట్‌కు అందించడమే కాకుండా దీని పునర్ముద్రణకు ఎంతో మక్కువతో శ్రమదానం చేశారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
ఎగిరే క్లాస్ రూమ్
- ఎరిక్ కాస్ట్‌నర్
జర్మన్ మూలం:
తెలుగు అనువాదం: బి.వి.సింగరాచార్య
162 పేజీలు, వెల: రూ.70
No comments:
Post a Comment