Thursday, October 16, 2008

తల్లి భూదేవి ... రచన: చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌ ... తెలుగు అనువాదం : ఉప్పల లక్ష్మణరావు


మన భారతీయ సంప్రదాయాల్లో మాదిరిగానే ప్రాచీన మధ్య ఆసియా పురాణాల్లో కూడా తల్లిని సృష్టికీ, తొలి గుర్తింపునకూ మూలంగా ప్రతీకగా భావిస్తారు.

మన అస్తిత్వానికీ, మన పురోభివృద్ధికీ, మనల్ని మనం తీర్చిదిద్దుకోడానికీ కీలకమైన ఆధారంగా నిలిచేది తల్లి ... భూదేవే.
అందుకే ఐత్‌మాతోవ్‌ తల్లి భూదేవిలో వ్యవసాయిక కుటుంబానికి చెందిన వృద్ధ మహిళ తొల్గొనాయ్‌ తన కళ్లముందే ఎంతోమంది తమ అస్తిత్వం కోల్పోవటాన్నీ, ఆ వరస విషాదాలనూ మర్చిపోలేదు. యుద్ధంలో భర్తనూ, ముగ్గురు కొడుకులనూ పోగొట్టుకున్న ఆమెకు మిగిలిందిఒకే ఒక వ్యక్తి ... గర్భంతో వున్న కోడలు!

ఆమె కూడా కాన్పు కష్టమై మరణించటంతో కొత్తగా ఈ లోకంలోకి వచ్చిన బిడ్డకు జీవితాన్నీ, ఈ లోకాన్నీ పరిచయం చేసే బాధ్యత తొల్గొనాయ్‌ మీదే పడుతుంది. దాన్ని ఆమె స్వీకరించిన తీరు, నిర్వహించిన వైనం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.
వ్యక్తులుగా మన గతాన్నీ, మన చరిత్రనూ, దాని విలువనూ ఎన్నటికీ విస్మరించలేమనీ, మనం ఈ లోకంతో సంబంధాలను విస్మరించుకోగలమేమోగానీ తెంచుకోవటం మాత్రం అసాధ్యమని బలంగా నొక్కి చెబుతుందీ రచన.

రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పరిణామాలను ఆమె చర్చించే తీరు చూస్తే ... మనకు దేనినైనా భరించే, దేనినైనా కడుపులో పెట్టుకునే చల్లిటి తల్లి భూమాత గుర్తుకొస్తుంది.. అందుకే ఐత్‌మాతొవ్‌ ఆ తల్లి భూదేవినే ప్రతీకగా నిలబెడతారు.

... రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించటంకంటే కూడా సమాజం అంతరాత్మను ప్రతిధ్వనించటమే ముఖ్యమన్న మాక్సిం గోర్కీ మాటలను చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌ శిరసావహించారు.

ఒక రచయిత నిబద్ధతకు ...ఎటువంటి భేషజాలు లేకుండా మార్పును ఆహ్వానించటం, ఆవిష్కరించటమే నిజమైన కొలమానమని వ్యాఖ్యానించేవారాయన. అందుకే ఆయన సోవియట్‌ వాస్తవికతలోని చీకటి కోణాలను కూడా నిష్కర్షగా, ఆలోచనాత్మకంగా తన రచనల్లో ప్రతిబింబించారు.

... కిర్గిజ్‌ జాతిపితగా పేరొందిన చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌ రచనలను మా దేశంలో ప్రతి కుటుంబం చదువుతుంది. మళ్లీ మళ్లీ చదువుతుంది. ఎందుకంటే మాకు గుండె ధైర్యాన్ని నూరిపోసింది ఆయన రచనలే. కేవలం ఒక వ్యక్తిగా మనం ఎంత మార్పు తేవచ్చో చూపారాయన ... అంటారు కిర్గిజ్‌ మానవ హక్కుల కార్యకర్త నటాలియా ఆబ్లోవా.

అర్థశతాబ్ధం క్రితం నాటి జమీల్యా, తొలి ఉపాధ్యాయుడు, తల్లి భూదేవి వంటి ఆయన రచనలు 150 ప్రపంచ భాషల్లోకి అనువాదమవటమే కాదు ఇప్పటికీ వన్నె తగ్గకుండా సమకాలీన రచనల్లా అ లరిస్తుండటానికి ఐత్‌మాతొవ్‌ స్పృశించిన సార్వజనీన, మానవీయ భావనలే కారణం.ఆయన కిర్గిస్థాన్‌ రాయబారిగా పలుదేశాల్లో పనిచేశారు. 2008 జూన్‌ 10న జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో కన్నుమూశారు.

తల్లి భూదేవి
- చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌
అనువాదం: ఉప్పల లక్ష్మణరావు
187 పేజీలు, వెల: రూ.75

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌