Wednesday, September 24, 2008

దక్షిణ తూర్పు పవనం ... మెక్సికో జపటిస్టా జాతీయ విముక్తి సైన్యం తిరుగుబాటుదారుడు మార్కోస్‌ ఉత్తరాలు, ప్రకటనలు ... షాడోస్‌ ఆఫ్‌ టెండర్‌ ఫ్యూరీఈ పుస్తకం మీరు చదవకపోతే ఎంతో నష్టపోతారు. కొద్ది రోజుల్లో మీ ముఖం వాడిపోతుంది. రాత్రులు నిద్రపట్టదు. క్రమంగా మీ జుట్టు రాలిపోతుంది. ఆ తరువాత కాళ్లు చేతులు సహకరించడం మానేస్తాయి. ఏం జరుగుతుందో తెలియని వేదనతో చనిపోతారు.
మీ ఇష్టం ...

... షాడోస్‌ ఆఫ్‌ టెండర్‌ ఫ్యూరీ ... మీద న్యూయార్క్‌ టైమ్స్‌లో బిల్‌ కాస్‌బీ రాసిన రివ్యూ నుంచి ...

...


ఇక ఇదే పుస్తకానికి గద్దర్‌ రాసిన ముందుమాట ...

ఈ మహా పుస్తకం చదివిన కొద్ది
అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది
అన్నం పండించి తిండిలేని,
బట్టలను పుట్టించి మానం దాచుకోను మాసికలేని,
ఏడేడు అంతస్తుల అద్దాల మేడలు కట్టి,
దాని నీడలో కూడా తలదాచుకోలేని
కష్టజీవుల మూగ కన్నుల్లోకి చూసినప్పుడు
స్పందించే ప్రతి మనిషిలో ...
ఏదో అంతుచిక్కని సరికొత్త స్పందన మొదలౌతుంది
ఈ అక్షరాలను చదివిన కొద్ది.
నడిపే కాళ్లకే దుమ్ము అంటుతుంది
కలిసే చేతులకే బురద అంటుతుంది
బతకడం కోసమే చనిపోతమంటది ఈ పుస్తకం
మేం నేలతల్లి మీద సెమట సుక్కలు రాల్సినప్పటినుండి,
మాకు తెలియకుండనే మా రక్తాన్ని
శ్రమరూపంలో తాగేదివాళ్లే ...
హింసావాదులెవరో చెప్పండి
అనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ పుస్తకం.
మేం కన్నీళ్లు రాల్చి
మా నిరసనను తెలిపితే ...
మా కనుపాపలను కూడా చిదిమేస్తే
కొడవండ్లు నూరకుండా ఏం చేయమంటారు?
అని అడుగుతుంది ఈ నెత్తురు ఉత్తరం.
మేం మహోన్నతమైన మానవులం
మా గుడిసెలోని పిల్లి, కుక్క, మేకపిల్ల, ఆవు, గుర్రం, గాడిదా ...
అన్నీ తిన్న తరువాతే మేం తింటాం
దీనిలో రహస్యమేమీ లేదు
మాకు స్వంత ఆస్తి లేదు.
చెట్లు.. పక్షులు.. నదులు.. పాములు.. పులులు వేటికీ మావల్ల హానిలేదు.
చంపడం మాకు చాలా సులువైన పని
కానీ అది మా నీతి కాదు
అన్నిటిని బ్రతకనివ్వని కొందర్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం
అది మా ధర్మంగా భాావిస్తాం.
ఆయుధాలే మా యుద్ధాన్ని నిర్ణయించవు
అవి ప్రాణంలేని సాధనాలే
మేం ఒక్కసారి మెంటల్లీ ఆర్మ్‌డ్‌ అయిపోతే
ఇక మాదే జయం, విజయం.
పుట్టలోని నాగన్న పుట్టలోనే వుంటే
మేం దానికి పాలు పోసి పూజిస్తాం
అది దారి తప్పి మా ఇంటికే వొస్తే
నాగస్వరం పాట ద్వారా వెల్లిపో నాగన్నా
అని బ్రతిమాలుకుంటాం
కానీ...
అది మా పసిపిల్లల తొట్టిలో ఎక్కితే
నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలుగా నరికేస్తాం
అన్ని జీవరాసులు బ్రతుకాలనే కోరుకొంటాయి
కొన్ని మాత్రం బ్రతకడం కోసం చావుని కోరుకొంటాయి. అట్లాంటి వారమే ఈ జపటిస్టా జాతీయ విముక్తి సైనికులం. మీ మనసులో మాకింత చోటిస్తే మా బతుకు ధన్యం అని మురిసిపోతాం....
కొనసాగుతుంది ఈ పుస్తక కావ్యం -

దక్షిణ తూర్పు పవనం
మెక్సికన్‌ జపటిస్టా తిరుగుబాటుదారుడు మార్కోస్‌ లేఖలు, ప్రకటనల సంకలనం

ఆంగ్ల మూలం : షాడోస్‌ ఆఫ్‌ టెండర్‌ ఫ్యురీ, మంత్లీ రివ్యూ ప్రెస్‌, న్యూయార్క్‌

తెలుగు అనువాదం: శశి
72 పేజీలు, వెల రూ.18

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌