Friday, September 19, 2008

ప్రపంచ చరిత్ర ...ఆంగ్ల మూలం: క్రిస్‌ బ్రేజియర్‌ ...తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకట సుబ్బయ్యఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల చరిత్రల గురించి స్లూళ్లో నాకు నేర్పింది శూన్యం. అనంత యుద్ధాల, రాజకీయాల అడుగున సహస్రాబ్దాలుగా మరుగున పడిపోయిన మహిళల చరిత్ర గురించి నాకు బొత్తిగా తెలియదు. అది ఇప్పుడిప్పుడే కాలగర్భం నుంచి పైకి తేలుతున్నది. యుగయుగాల జన సామాన్యపు దైనందిన అనుభవాల తాలూకు సమాచారం కొద్దికొద్దిగా తెలుస్తున్నది. పిరమిడ్లు నిర్మస్తూ మరణించిన వ్యక్తుల, కోటల అడుగున వున్న నేలను దున్నిన సామాన్యుల వ్యథార్థ జీవిత యదార్థ దృశ్యాలు స్వల్పంగానైనా ప్రస్ఫుటమవుతున్నాయి..

పాత పాఠ్యపుస్తకాలన్నీ వదిలేసిన ఖండాల, సమాజాల లోతుల్లోకి తొంగి చూసినప్పుడు చరిత్ర పరిశోధన నాకు అద్భుతంగానే తోచింది.

అయితే, ఈ గుప్త చరిత్రలను నేను రాజ వంశాల, అగ్రరాజ్యాల యుద్ధాలకు సంబంధించిన సాంప్రదాయక కథనంతో జోడించే ప్రయత్నం కూడా చేశాను. సామాన్య స్త్రీ పురుషుల సేవనూ విస్మరించకూడదు. దానితో పాటే అప్పటి రాజకీయ స్థితిగతులనూ, ఆనాటి ప్రపంచ రూపకల్పనకు దోహదం చేసిన వివిధ సామ్రాజ్యాల విజయ పరంపరలనూ చరిత్రలో చేర్చాలి. వాటిని స్పృశించని చరిత్ర అయోమయంగా వుంటుంది.

చరిత్ర బోధన మెరుగవుతోంది.

చిన్నపిల్లలకు వాళ్లకు తెలిసిన పరిధికి వెలుపల వున్న మహా విశ్వ దృశ్యాన్ని ప్రదర్శించడంపై ఇతోధిక శ్రద్ధ పెరిగిందని వింటున్నాను. మంచిదే. ఒక గొప్ప అ ల్లిక తాలూకు కొద్ది భాగాలు మాత్రమే తెలిసిన మనలాంటి వాళ్లందిరి కోసమే ఈ రచన.
- క్రిస్‌ బ్రేజియర్‌


వస్తు మార్పిడి కాలం వరకు సామాన్యుల జీవితం ఒక రకంగా వుండి - మతం, భూస్వామ్యం ప్రవేశంతో ఎలా విచ్ఛిన్నమయిందో, రాజకీయ కుట్రలు, యుద్ధోన్మాదం, మతోన్మాదంతో రాజులు, పోప్‌లు ప్రపంచ మనుగడను ఎలా అధోగతి పాలుచేశారో విశ్లేషించిన పుస్తకమిది. అదే క్రమంలో బానిస తిరుగుబాట్లు, జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమాల ఉద్భవాలను కూడా ఇది వివరించింది.పెట్టుబడిదారి సమాజం ఆవిర్భావం వరకు ప్రతిబింబించిన ఈ సమగ్ర ప్రపంచ చరిత్రను అందరూ తప్పక చదవాలి.

ప్రపంచ చరిత్ర
క్రిస్‌ బ్రేజియర్‌
తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య
146 పేజీలు, వెల: రూ.30

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌