
73వ, 74వ రాజ్యాంగ సవరణల తరువాత చట్టసభల్లో కూడా స్త్రీలకు ప్రాతినిధ్యమివ్వాలనే ఉద్యమాలు వచ్చాయి.
1996లో మొదటిసారిగా మహిళా రిజర్వేషను 81వ రాజ్యాంగ సవరణ ప్రవేశ పెట్టడం, అది ఓడిపోవడం జరిగింది.
ఆతర్వాత చాలాసార్లు బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి.
అయితే చర్చకు కొత్తగా వచ్చిన విషయం 33 శాతం ప్రాతినిధ్యంలో కుల రీత్యా కూడా స్త్రీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని దళిత, బహుజన పార్టీలు, స్త్రీలు చేసిన డిమాండు.
స్త్రీలకు స్త్రీలుగా మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే, దళిత, బహుజన స్త్రీలకు ప్రాతినిధ్యం లభించే అవకాశాలుండకపోవచ్చు.
పైగా మధ్య తరగతి, చదువుకున్న ఉన్నత కుటుంబాల స్త్రీలకే ప్రాతినిధ్యం పరిమితమయ్యే ప్రమాదం వుంటుంది.
పై అంశాలపై వచ్చిన చర్చ మహిళా సంఘాలలో వున్న భేదాభిప్రాయాలను, కుల వ్యవస్థపై వుండే అవగాహనలను వెలిబుచ్చాయి.
ఈ చర్చను చారిత్రకంగా, రాజకీయంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. ఇది భారత రాజకీయ, సామాజిక వ్యవస్తను అర్థంచేసుకోడానికి ఒక కీలకమైన అంశం.
చట్టసభల్లో స్త్రీల ప్రాతినిధ్యం గురించి వివిధ కోణాల్లో చర్చించిన ఈ పుస్తకంలో ఆరు అధ్యాయాలున్నాయి.
1. ప్రత్యామ్నాయ ఆధునికతలు ... రిజర్వేషన్లు - స్త్రీల ఉద్యమాలు. - మేరీ జాన్
2. రిజర్వేషన్ల చరిత్రలో ఉద్యమాలు - భగవాన్‌దాస్
3. ఫ్రాన్స్‌లో సమానత్వ ఉద్యమం - డానియెల్ హాస్ ద్యుబోస్
4. అంతుపట్టని స్త్రీ : స్త్రీవాదం రిజర్వేషన్ బిల్ - నివేదితా మీనన్
5. కర్ణాటకలో రిజర్వేషన్ల చరిత్ర - మానస గ్రూపు, బెంగళూరు
6. కులం - జెండర్ చిక్కుముడి : హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి పోరాటం - జాయింట్ యాక్షన్ కమిటి.
వీటిని డి.వసంత, బాలాజీ, మొక్కపాటి సుమతి, శ్రీనివాస్ ప్రసాద్ తెలుగులోకి అనువాదం చేశారు. ముందుమాట రమా మేల్కోటే, ఎస్.జయ రాశారు. ఇది అన్వేషి ప్రచురణ.
స్త్రీలు - ప్రాతినిధ్యం
కోటాపై చర్చ
సంకలనం : అన్వేషి
106 పేజీలు, వెల రూ.20
No comments:
Post a Comment