
లోకంలో మనిషికి నిత్యావసరమైన వస్తువులన్నింటినీ మనుష్యుల్లో కాయకష్టం పడేవాళ్లే ఉత్పత్తి చేస్తుంటారు. కానీ ఆశ్రమ ఫలితం మాత్రం వాళ్లకి దక్కదు. అది స్పష్టంగా అందరికీ కనిపిస్తున్నదే. అట్లా దక్కకపోవడానికి కారణం రాముడి మీదో రహీము మీదో లేక పూర్వజన్మల మీదో మరి దేనిమీదో తోసేస్తారు.
ఎవరు అని ప్రశ్నిస్తే ...
ఆ శ్రమపడేవారి కష్టఫలితాన్ని ఎవరైతే దోచుకొంటున్నారో వారే నని సమాధానం చెప్పవలసివుంటుంది.
దోపిడీ చేసే వర్గాలే దాదాపు ప్రతి దేశంలోనూ పాలకవర్గాలుగా వుంటూ వస్తున్నాయని చరిత్ర ఏమాత్రం చదువుకున్నా మనకి తెలుస్తుంది.
దోపిడీ కాబడేవాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పక తిరుగుబాటు చేస్తాడని ఈ ఇరవయ్యో శతాబ్దపు ప్రతి దేశపు దోపిడీ పాలకవర్గానికీ తెలుసు. కానీ, ఈ నిజాన్ని స్పార్టకస్ తిరగబడేవరకూ కూడా ఆనాటి రోమన్ పాలకవర్గం కనుక్కోలేకపోయింది. అందువల్ల తొలుత దెబ్బతింది. తరవాత నిలదొక్కుకొని తిరుగుబాటుని అణచివేయగలిగింది.
పాలక వర్గం స్పార్టకస్ నుంచి పాఠాలు నేర్చుకొంది.
స్పార్టకస్ తరవాత ఈ రోజుకీ కూడా పాశ్చాత్య దేశాల పాలకవర్గాల ఏకైక లక్ష్యం (ఇప్పుడు మనదేశంలోని పాలకవర్గపు లక్ష్యం లాగే) ఏమిటీ అంటే ...
శ్రామిక వర్గాన్ని ఎన్నటికీ అధికారంలోకి రానివ్వకూడదు. వారిని ఎల్లకాలం అణచివుంచాలి. అందుకు ఎల్లప్పుడూ సర్వసిద్ధంగా వుండాలి. అదీ ఆ లక్ష్యం.
అందువల్లనే స్పార్టకస్‌కి అంత ప్రాముఖ్యత.
అతను ఓడిపోయాడు, చనిపోయాడు. క్రీస్తు పూర్వమే పుట్టాడు, గిట్టాడు. కానీ అతని పేరు చెప్తే దోడిడీదారులందరికీ ఇప్పటికీ బెదురు. వారు శ్రామికవర్గాల జనాన్ని పందులకంటే హీనంగా చూస్తారు. కానీ ఆ జనాలు ఉగ్రనరసింహులుగా మారి విజృంభించగలరన్న సత్యాన్ని చరిత్రలో మొదటిసారిగా చాటిచెప్పినవాడు స్పార్టకస్.
అందుకే, ఇరువర్గాలువారికీ కూడా అతను ముఖ్యడు. ఇరువర్గాల వారూ అతణ్ని గుర్తుంచుకుంటారు ... శ్రమించేవారు ఆశతో, దోపిడీదార్లు పగతో ...!
....
హోవర్డ్ ఫాస్ట్ 1914లో జన్మించారు. 75కు పైగా నవలలు, అనేక చిన్న కథలు రాశారు. ఇ.వి.కన్నింగ్ హోమ్ అన్న కలం పేరుతో మిస్టరీ నవలలు కూడా రాసారు. ఫాస్ట్ అత్యంత పేదరికంలో పుట్టి పెరిగారు. పదేళ్ల వయసప్పుడు పనిచేయడం మొదలుపెట్టారు. దినపత్రికలు వేయడం, సిగరెట్ల తయారీ, కసాయి దుకాణం శుభ్రం చేయడం, దుస్తుల ఫాక్టరీలో పని, ఓడల రవాణాలో గుమాస్తాగిరి వంటి ఎన్నో పనులు చేస్తూనే హైస్కూల్ చదువు పూర్తిచేశారు.
జాక్ లండన్ రాసిన ఉక్కుపాదం నవలతో తనకు తొలిసారిగా సోషలిజంతో పరిచయమయ్యిందని ఫాస్ట్ స్వయంగా చెప్పుడున్నారు. ఆయన 1944-57 మధ్య అమెరికా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా వున్నాడు. వామపక్షీయులను సంవత్సరాలపాటు వేధించిన మాక్‌కార్తిజం నుంచి ఎలాగో బతికి బయటపడ్డారు. ఆయన జీవితమంతా ఫోనుల టాపింగ్, అమెరికా గూఢచారి పోలీసు (ఎఫ్.బి.ఐ) నిఘాలతో గడిచిపోయింది. ఆయన పుస్తకాలను ప్రచురించనివ్వలేదు. అమెరికా సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవాళ్ల పేర్లు ఇవ్వ నిరాకరించినందుకు ఫాస్ట్‌కి జైలు శిక్ష కూడా పడింది. 1950లో జైలులో వున్నప్పుడే ఆయనకు స్పార్టకస్ నవల రాయాలన్న ఆలోచన వచ్చింది. అట్టడుగు వర్గాల బాధామయ, నిరాశాపూరిత జీవితం జైలులో వుండగా మరింత బాగా అవగతం అయ్యింది. మాక్‌కార్తిజం అణచివేతకారణంగా ఏ ప్రచురణకర్త కూడా స్పార్టకస్‌ని ప్రచురించే సాహసం చేయలేదు. దాంతో 1951లో హోవర్డ్ ఫాస్ట్ స్వయంగా స్పార్టకస్‌ని ప్రచురించారు. ఆ తరువాత అది ఒక్క ఇంగ్లీషులోనే వందకు పైగా ముద్రణలు పొంది లక్షలాది ప్రతులు అమ్ముడయ్యాయి. ప్రపంచంలోని దాదాపుగా అన్ని ప్రధాన భాషలలోకి అనువదించబడింది. స్పార్టకస్ నవల ఆధారంగా అదే పేరుతో ఇంగ్లీషులో వచ్చిన సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందింది.
స్పార్టకస్
-హోవర్డ్ ఫాస్ట్
తెలుగు అనువాదం: ఆకెళ్ల కృష్ణమూర్తి
ముందుమాట: రాచకొండ విశ్వనాథశాస్త్రి
224 పేజీలు, వెల: రూ.45
No comments:
Post a Comment