Sunday, September 7, 2008

ఖైదీ నెం. 174517 ... నాజీ మారణ శిబిరాలలో యూదులు ... ప్రీమో లెవి స్వీయానుభవాలు


నాజీలు, ఫాసిస్టులు సృష్టించిన విధ్వంసం, భయానకమైన మారణకాండ గురించి ఎన్నో రచనలు వచ్చాయి.
వాటిలో మృత్యువు అంచువరకూ వెళ్లి బతికి బయటపడ్డ ప్రీమొ లెవి రాసిన స్వీయానుభవాలు మనల్ని వెంటాడుతాయి. మనుషులు ఇంత రాక్షసులుగా మారగలరా అని గగుర్పాటు కలుగుతుంది.
ఒకానొక చారిత్రక వికృతత్వానికి సాక్షిగా నిలబడి, దాని భయానకమైన అనుభవాలకు బాధితుడై కూడా ఎంతో సంయమనంతో ఆయన తన అనుభవాలను మనకు చెపుతున్నారు.
దాదాపు 60 లక్షల మందిని దారుణంగా హతమార్చిన ఆ దుర్మార్గపు ఫాసిస్టు హింసను ఈ పుస్తకం నగ్నంగా బట్టబయలు చేసింది.
ఈ పుస్తకంలో అక్షరబద్ధమైన అనుభవాలు మనుషుల్ని నిల్చున్నచోట నిలువనీయవు.
ప్రీమొ లెవి 1919లో ఇటలీలోని టురిన్‌లో పుట్టాడు. రసాయనిక శాస్త్రంలో పిహెచ్‌.డి. చేశాడు. 1943లో ఫాసిస్టు వ్యతిరేక తిరుగుబాటు కూటమిలో చేరాడు. జర్మన్‌ సైన్యం అతణ్ని బందీగా పట్టుకొని ఔప్విట్స్‌ క్యాంపు (మృత్యు శిబిరం)కు పంపింది. ఆయన 1945లో ఆ నరకం నుంచి బయటపడగలిగాడు. తర్వాత టురిన్‌ వచ్చి కెమిస్ట్‌గా తన జీవితం కొనసాగిస్తూ అనేక రచనలు చేశారు.
1947లోనే ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. అతికష్టం మీద ఒక ప్రచురణ సంస్థ దీనిని ప్రచురణకు స్వీకరించి 2,500 కాపీలను ముద్రించింది. కానీ ఐరోపా అంతా యుద్ధ శోకంలో వుండి తేరుకోడానికి ప్రయత్నిస్తున్న సమయం కావడంతో అవి కూడా అమ్ముడు పోక అటకెక్కాయి. ఆతరువాత 1958లో తిరిగి ఈ పుస్తకాన్ని పునర్ముద్రించారు. ఒక్క ఇటలీలోనే 5,00,000 కాపీలు అమ్ముడు పోయాయి. అనేక ప్రపంచ భాషల్లో ఇది అనువదించబడింది. రేడియోకు, థియేటర్‌కు కూర్పులు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.
దుర్భరమైన కష్టాలను, అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ఎంతో ఆశావహంగా జీవిస్తూ వచ్చిన ప్రిమో లెవి1987 ఏప్రిల్‌ 11న ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఒక విషాదం.
...సర్వస్వాన్ని కోల్పోయిన మనిషి తనను తాను కోల్పోతాడు. అతని చావునీ బతుకునీ ఏ మాత్రం మానవ స్పృహ లేకుండా నిర్ణయించవచ్చు. అతను పనికి వస్తాడా లేదా అన్నదానిపైనే ఇక్కడ అతని బతుకును నిర్ణయిస్తారు. ఈ అర్థంలో నాజీ మృత్యు శిబిరాలను (కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులను) అర్థం చేసుకోవాలి. భౌతికంగా మాత్రమే చనిపోవడం కాదు... సర్వస్వాన్ని కోల్పోతూ చనిపోవడం... అదే ఇక్కడ జరుగుతుంది. నేనిప్పుడు ఖైదీని. నా నెంబరు 174517. నాకు బాప్తిజం యిచ్చారు. (బాప్తిజం అంటే చర్చిలో/క్రైస్తవ మతంలో చేర్చుకొనడానికి జరిపే ఒక మతకాండ.) మమ్మల్ని వరుసగా నిలబెట్టారు. ఒక నాజీ అధికారి చేతిలో చిన్న సూది వున్న సాధనం వుంది. దాంతో అతను ఎంతో నైపుణ్యంతో మా ఎడమ చేతుల మీద చకచకా మా ఖైదీ నెంబర్లను పచ్చబొడిచాడు. పచ్చపొడిచేటప్పుడు విపరీతంగా నొప్పి వేసినా ఆ కార్యక్రమం త్వరగానే ముగిసింది. ఆ పచ్చబొట్టును మేమిక చనిపోయేంతవరకు మోయాల్సిందే...

ఖైదీ నెం.174517
నాజీ మారణ శిబిరాలలో యూదులు
ప్రిమొ లెవి
ఆంగ్ల మూలం: ఇఫ్‌ దిస్‌ ఈజ్‌ ఎ మాన్‌, ట్రాన్స్‌లేటెడ్‌ బై స్టువర్ట్‌ వోల్ఫ్‌.
తెలుగు అనువాదం: కలేకూరి ప్రసాద్‌
110 పేజీలు, వెల: రూ.25

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌