Friday, September 5, 2008

మా కథ: పోరాట పథంలో బొలీవియా మహిళలు- దొమితిలా బారియోస్‌ ద చుంగార


మా కథ
పోరాట పథంలో బొలీవియా మహిళలు
దొమితిలా బారియోస్‌ ద చుంగార


దక్షిణ అమెరికా ఖండంలో ఒక చిన్న దేశం బొలీవియా. దాని జనాభా 50 లక్షలు. పేరుకు ఇంత చిన్న దేశమే అయినా అది గని కార్మిక ఉద్యమంతో, దానితో చేయీ చేయీ కలిపి నడచిన మహిళా ఉద్యమంతో ఎంతో పేరు సంపాదించుకుంది. అక్కడి తగరపు గనుల్లో మహిళా ఉద్యమాన్ని నడిపిన ఒక నాయకురాలి స్వీయ కథనం ఈ పుస్తకం.
ఇది నవలా? అనుభవాల గుచ్ఛమా? ఆత్మకథా? చరిత్రా? అర్థశాస్త్రమా?
జన జీవితపు కొలిమిలో పుటం పెట్టిన ఆ అనుభవాలు చదువుతోంటే ఇది నవలే అనిపిస్తుంది.
శకలాలు శకలాలుగా వున్న ఆ కథనం ఇది అనుభవాల సంపుటేమో అనిపిస్తుంది.
పుస్తకం మొత్తం దొమితిలా మన ఎదురుగా నిలబడి చెప్పిన ఆత్మకథేమో అనిపిస్తుంది.
తారీఖులు, దస్తావేజుల జోలికి పోకుండానే ముఫ్ఫై సంవత్సరాల బొలీవియన్‌ ప్రజా పోరాట సాంప్రదాయాన్ని ఇది మన కళ్లముందు రూపుకట్టి... ఇది చరిత్ర పుస్తక మేమో అన్పిస్తుంది.
అంకెలూ, పట్టికలూ లేకుండానే ఈ పుస్తకం ఆర్థిక విధానాల్ని వివరిస్తుంటే అర్థశాస్త్ర గ్రంథమేమో అన్పిస్తుంది.
ఇంతకూ ఇదేమిటో మీరే తేల్చుకోండి.

దొమితిలా మాటల్లో:
....నా జీవితమంతా జనానిది. నా కేమేం జరిగాయో నా దేశంలో వందలాది మందికవే జరిగాయి. నేను స్పష్టంగా చెప్పదలచుకున్నది ఈ సంగతే. ప్రజల కోసం నేను చేసినదానికన్నా చాలా ఎక్కువ చేసిన వాళ్లు వున్నారని నాకు తెలుసు. ఐతే వాళ్లలో కొందరు చనిపోయారు, మరికొందరి సంగతి బయటకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. అందుకే నేనిక్కడ నా సొంత గొడవ మాత్రమే చెప్పదలచుకోలేదంటున్నాను. బొలీవియాలో ఎన్నో సంవత్సరాల పోరాటంలో మేం పొందిన అనుభవాలను నేనిక్కడ పొందుపరచదలచుకున్నాను. మా అనుభవాలు కొత్త తరానికి, కొత్త జనానికి ఏదో ఓ రకంగా ఉపయోగపడతాయనే ఆశతోనే ఈ చిన్నమెత్తు కానుకను మీ ముందు పెడుతున్నాను......

మా కథ
దొమితిలా బారియోస్‌ ద చుంగార
స్పానిష్‌ మూలం: లెట్‌ మి స్పీక్‌ ! టెస్టిమోనీ ఆఫ్‌ డొమిటిలా, ఎ వుమన్‌ ఆఫ్‌ ది బొలీవియన్‌ మైన్స్‌.
తెలుగు అనువాదం: వేణు
192 పేజీలు, వెల: రూ.50

2 comments:

  1. మీరు వేసే పుస్తకాలు నేను చాలా ఇష్టంగా కొంటాను. కానీ సమస్య ఏమిటంటే మీ పుస్తకాలు విశాలాంధ్రలో అన్ని వేళలా దొరకవు. ఎందుకనంటారు? మీ పుస్తకాలు అన్నీ ఒకేచోట దొరికే పద్ధతి ఏమిటి?

    ReplyDelete
  2. I am sorry; Visalandhra's head office always has 200 copies each as stock; but lazy branch managers do not always order the books they need. Maybe, if you persuade them to do so?

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌