Monday, September 15, 2008

యుద్ధానికి పునాదులెక్కడ? ...అమెరికా...చమురు...పొలిటికల్‌ ఇస్లాం


వర్తమాన ప్రపంచ రాజకీయాల పోకడ మారుతోంది. ఒకప్పుడు కమ్యూనిజాన్ని బూచిగా చూపిస్తూ ప్రచ్ఛన్న యుద్ధం సాగించిన అమెరికా ఇప్పుడు తీవ్రవాదంపై సమరం పేరుతో ప్రత్యక్ష యుద్ధాలకు, ప్రపంచ స్థాయి పోరాటాలకు తెర తీస్తోంది.

2001 సెప్టెంబర్‌ 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, పెంటగాన్‌లపై జరిగిన దాడులకు ప్రతిగా అమెరికా యుద్ధ స్పందన హఠాత్తుగా తీసుకున్న అనూహ్య నిర్ణయమేమీ కాదు. ఆ యుద్ధానికి అదొక్కటే పార్శ్వమూ కాదు. అదొక సంక్లిష్ట అర్థిక - రాజకీయ - మత సంబంధ అంశం. తీవ్రవాదం పై సమరం పేరుతో ఆఫ్ఘనిస్థాన్‌పై సాగిన భీకర యుద్ధానికి మూలాలు ఎక్కడ వున్నాయో గ్రహించాలంటే - ఈ శతాబ్ది ఆర్థిక రంగం తీరుతెన్నులనూ, పశ్చిమాసియా, గల్ఫ్‌ ప్రాంతాల్లో అమెరికా సాగిస్తున్న చమురు రాజకీయాలనూ, అమెరికాకు పెను సవాలుగా నిలుస్తున్న రాజకీయ, ఉగ్రవాద ఇస్లామిక్‌ ఉద్యమానూ అర్థం చేసుకోక తప్పదు. ఆ దిశగా సాగిన ప్రయత్నమే ఈ పుస్తకం.

అమెరికా సామ్రాజ్యవాద ఆర్థిక రాజకీయాలు, వాటి పర్యవసానాలు, స్వప్రయోజన కాంక్షతో ఆ దేశం అంతర్జాతీయంగా జోక్యం చేసుకుంటూ కొన్ని దేశాలను ధూర్త రాజ్యాలుగా ముద్ర వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను, చమురు దాహంతో నడుపుతున్న రాజకీయాలను ఈ పుస్తకంలోని వేరు వేరు అధ్యాయాలు వివరంగా విప్పి చెబుతాయి.

1. అసలు ఉగ్రవాది అమెరికాయే ... అనే వ్యాసంలో నోమ్‌ చోమ్‌స్కీ (తెలుగు అనువాదం: ఎన్‌.వి.రమణమూర్తి) అమెరికా ఐక్యరాజ్య సమితి తీర్మానాలను, అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటనను ఎలా కాలదన్నిందో, తన యుద్ధోన్మాదాన్ని స్వార్థ రాజనీతిని సమర్థించుకునే క్రమంలో అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఎలా ఉల్లంఘించిందో వివరిస్తారు.

2. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ధోరణులు, లక్షణాలు ... అనే వ్యాసంలో డి. పాపారావు పెట్టుబడిదారీ వ్యవస్థ గతిని, గమనాన్ని విశ్లేషించారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ఇతర దేశాలను ఆక్రమించి ప్రత్యక్ష దోపిడీని కొనసాగించే పరిస్థితులు సామ్రాజ్యవాదానికి లేవు. అందుకే అది పెట్టుబడిదారీ మార్కెటు వ్యవస్థను ఆసరాగా చేసుకొంటోంది. ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ వ్యవస్థ సమస్త రుగ్మతలను నిర్మూలిస్తుందనే ప్రచారంలోని డొల్లతనం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఏదేశంలో చూసినా సంస్కరణలు ప్రజల జీవన ప్రమాణాలను, ఉపాధి అవకాశాలను పెంచకపోగా ఇంకా దెబ్బతీస్తున్నాయి. బహుళ జాతి సంస్థలు వర్ధమానదేశాల మార్కెట్‌ను దారుణంగా కొల్లగొడుతున్నాయి అంటారాయన.

3. అమెరికా చమురు రాజకీయాలు మధ్య ఆసియా దేశాలు, ఆఫ్ఘనిస్థాన్‌ ... అనే వ్యాసంలో యం. చెన్న బసవయ్య రెండో ప్రపంచ యుద్ధం తరువాత అగ్రరాజ్యంగా ఎదిగిన అమెరికా చమురు రాజకీయాలలో పోషిస్తున్న కీలక పాత్రను, మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్థాన్‌లలో జరుగుతున్న పరిణామాలని విశ్లేషించారు.

4. ఇస్లామిక్‌ విప్లవాలు కొత్త కోణాలు ... అనే వ్యాసంలో శ్యామసుందరి ఇస్లామిక్‌ విప్లవ నేపథ్యాన్ని, ఇరాన్‌లో పెల్లుబికిన జన చైతన్యాన్ని, పాలస్తీనా విమోచన ఉద్యమాన్ని, ఆఫ్ఘనిస్థాన్‌ స్థితిగతులను, అమెరికా ద్వంద్వ నీతిని వివరించారు.

పాఠకుల ముందున్న ప్రశ్నలు, సమస్యలన్నింటికీ ఈ పుస్తకం సమాధానం కాకపోవచ్చు. అయితే గత రెండు మూడు దశాబ్ధాలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలను, మరో దశాబ్దకాలం ప్రభావితం చేయనున్న సంఘటనల మూలాలను అర్థం చేసుకోవటానికి ఈ పుస్తకం తప్పక ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం.

యుద్ధానికి పునాదులెక్కడ?
అమెరికా...చమురు...పొలిటికల్‌ ఇస్లాం
-నోమ్‌ చోమ్‌స్కీ, డి.పాపారావు, డా.యం. చెన్నబసవయ్య, శ్యామసుందరి
118 పేజీలు, వెల: రూ.30

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌