మన దేశంలో ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితి బద్దలవడానికి సిద్ధంగా వున్న అగ్నిపర్వతంలా వుంది.
శతాబ్దాలుగా అక్షర జ్ఞానానికి నోచుకోని వివిధ వర్గాల ప్రజల్లో క్రమేణా విద్యావ్యాప్తి జరుగుతున్నందువల్ల దేశ రాజకీయ రంగంలో వారి ప్రమేయం, డిమాండ్లు పెరుగుతున్నాయి.
వారి పోరాటాలు కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి.
వర్తమానంలోని ప్రతి పోరాటం వేళ్లు భూతకాలం లోతుల్లోకి చొచ్చుకునిపోయి వుంటాయి.
నేటి పోరాటాన్ని బలోపేతం చేసుకునేందుకు, భవిష్యత్తును మరింత ప్రతిభావంతంగా తీర్చిదిద్దుకునేందుకు మనం మన పోరాట మూలాలను అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. ....
కుల వ్యవస్థను, హిందూ సామాజిక దొంతరలను సవాలు చేస్తూ అనేక ఉద్యమాలు వచ్చాయి. కొన్ని ముఖ్యమైన సామాజిక మార్పులకు సైతం అవి దోహదపడ్డాయి. అయితే సమాజంలోని అధికార సంంబంధాలను మాత్రం అవి పెద్దగా మార్చలేకపోయాయనేది మాత్రం వాస్తవం..
బ్రాహ్మణత్వాన్ని ఎదురిస్తూ ఉద్భవించిన బౌద్ధ మతం పలు దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో గొప్ప సామాజిక, రాజకీయ శక్తిగా మారింది కానీ తను పుట్టిన భారతదేశంలో మాత్రం అది నిలదొక్కుకోలేకపోయింది.
సమకాలీన దళిత ఉద్యమం (నవీన బౌద్ధమత ఉద్యమం) కుల వ్యవస్థను సవాలు చేసేందుకు గాను బౌద్ధమతాన్ని పునరుద్ధరించే స్థాయిలో లేదు. తమ మనుగడ కోసం, తమ హక్కుల, అధికారాల సాధనకోసం పోరాడే దళిత బహుజనులకు (షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి) తగిన రాజకీయ గుర్తింపును సాధించే స్థాయిలోలేదు.
ఇవాళ బుద్ధుణ్నీ, బౌద్ధ మతాన్నీ హిందూత్వీకరించేందుకు, దళిత బహుజనుల ఉద్యమాలన్నింటినీ హిందూత్వ పరిధిలో ఇరికించేందుకు సరికొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం వుంది.
ఈ క్రమంలో అసలు బుద్ధుణ్ని ఒక రాజకీయ తాత్వికుడిగా, ఆ కాలపు గొప్ప విప్లవకారుడిగా చూడకుండా ఆయనను ఏ విధంగా దైవీకరించారు... ఏవిధంగా ఆయనకు పవిత్రతను ఆపాదించారు... ఆయనను సాక్షాత్తు విష్ణు మూర్తి తొమ్మిదవ అవతారంగా ఎందుకు మార్చారు ... వంటి అంశాల్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.
బౌద్ధ ఉద్యమం, బౌద్ధ ఆలోచనా విధానం మేధోపరంగా కూడా తీవ్ర వక్రీకరణకు, చిన్న చూపునకు గురైంది.
బుద్ధుణ్ని మేధావులు ఒక ఋషిగా, మత బోధకుడిగా చూశారే తప్ప ఒక విప్లవకారుడిగా ఒక రాజకీయ సిద్ధాంత కర్తగా పరిగణించలేదు.
బుద్ధుణ్ని ఈవిధంగా సొంతం చేసుకోవడం, వక్రీకరణకు గురిచేయడం వెనుక వలసవాద, జాతీయవాద మేధావుల పాత్ర (కుట్ర) ఎంతగానో వుంది.
జాతీయోద్యమ కాలంలో మహాత్మా జ్యోతీబా ఫూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌లు తప్ప మిగతా తాత్విక మేధావులంతా బౌద్ధమతాన్ని హిందూమతంలో అంతర్భాగంగానే చూశారు. ....
ప్రాచీన భారత రాజకీయ తత్వవేత్తల్లో కేవలం ఇద్దరిమీదనే ఎక్కువ పరిశోధనలు జరిగాయి. వాళ్లు హిందూ ధర్మాన్ని పెంచి పోషించిన మనువు, కౌటిల్యుడు. అయితే బుద్దుడు మనవుకంటే, కౌటిల్యుడి కంటే ఎంతో పూర్వకాలం వాడని అనేక పురావస్తు, చారిత్రక అధ్యయనాల వల్ల స్పష్టమవుతోంది. నిజానికి సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ల కంటే కూడా బుద్ధుడు చాలా ముందరివాడు.
చైనా చారిత్రక రికార్డులను బట్టి చూస్తే బుద్ధుడు కన్ఫ్యూషియస్ కంటే కూడా ముందరి వాడని స్పష్టమవుతుంది.
కాబట్టి బుద్ధుడిని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసి, ఆయనను రాజనీతి తత్వవేత్తగా నిలబెట్ట గలిగితే మానవాళికి తెలిసిన, అతి ప్రాచీన రాజకీయ తాత్వికులలోకెల్లా గౌతమ బుద్ధుడే మొట్టమొదటివాడవుతాడు. ఆయన తాత్వికత ఈ దేశపు, యావత్ ప్రపంచపు తత్వశాస్త్రాన్ని మరో మలుపు తిప్పుతుంది.
అయితే ఇదొక బృహత్తరమైన కార్యక్రమం. ఈ రచనలో నా లక్ష్యం చాలా పరిమితం. బుద్ధుడి తాత్వికతలో అంతర్లీనంగా వున్న రాజకీయ స్వభావాన్ని మాత్రమే ఇందులో రుజువు చేయాలనుకుంటున్నాను.
బుద్ధుణ్ని కేవలం మతపరమైన సంస్కరణవాదిగా కాకుండా ఒక రాజకీయ తాత్వికుడిగా అధ్యయనం చేసేందుకు నా ఈ ప్రయత్నం భవిష్యత్ రాజకీయ శాస్త్రవేత్తలకు ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను. ఇందులో గౌతమ బుద్ధుడి రాజకీయ తాత్విక రూపురేఖలను స్థూలంగా మాత్రమే చిత్రించాను. భవిష్యత్తులో ఈ అంశంపై పరిశోధనలను నిర్వహించే వారికి ఇది ఒక ప్రాథమిక ఆధారంగా పనికొస్తుందని భావిస్తున్నాను.
భారత దేశ చరిత్రను తిరగరాసే ఒక బృహత్తర ప్రణాళికలో నా ఈ రచన అంతర్భాగమని చెప్పవచ్చు. కొందరు భారతీయ విద్యావేత్తలు ఇప్పటికే ఆ ప్రణాళికలో నిమగ్నమై వున్నారు. .....
(ముందుమాట నుంచి...)
ఈ పుస్తకం డా.కంచ ఐలయ్య పిహెచ్‌డి కోసం చేసిన అధ్యయన ఫలితం.
దేవుడి రాజకీయ తత్వం
బ్రాహ్మణత్వంపై బుద్ధుని తిరుగుబాటు
రచన: కంచ ఐలయ్య
ఆంగ్లమూలం : గాడ్ యాజ్ ఎ పొలిటికల్ ఫిలాసఫర్, బుద్ధాస్ ఛాలెంజ్ టు బ్రాహ్మణిజం, సామ్య, కోల్‌కతా, సర్వహక్కులు రచయితవి.
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
226 పేజీలు, వెల : రూ.70/-
No comments:
Post a Comment