మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Monday, September 22, 2008
గంధపు చెక్కల వీరప్పన్ ... తమిళ పక్ష పత్రిక నక్కీరన్ విలేకరులు 2000 సంవత్సరంలో వీరప్పన్‌తో జరిపిన ఇంటర్వ్యూ ... ముధల్ వెట్టెయుమ్ ముధల్ కలైయుమ్ .
రాంగోపాల్ వర్మ వీరప్పన్‌పై చలన చిత్రం నిర్మించేందుకు పూనుకోవడంతో ఈ లెజండరీ క్రిమినల్ మళ్లీ మరోసారి వార్తలలోకి వచ్చాడు.
తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో 6,000 కి.మీ. మేర విస్తరించివున్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని తన నేర సామ్రాజ్యంగా మార్చుకొని, అడ్డొచ్చినవాళ్లని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తూ దాదాపు పాతిక సంవత్సరాలపాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ కంటిలో కునుకులేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్.
దంతాలకోసం వీరప్పన్ రెండువేల ఏనుగులను చంపాడనీ, రూ.100 కోట్ల విలువచేసే గంధపు చెక్కలను, ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేశాడనీ, పోలీసు ఫారెస్టు సిబ్బందితో సహా మొత్తం 138 మందిని పొట్టనపెట్టుకున్నాడనీ అంటారు.
సరిహద్దు భద్రతా దళానికి చెందిన 7 బెటాలియన్ల సైనికులు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 4,500 మంది స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏళ్ల తరబడి అతడిని వేటాడి వెంటాడి చివరికి ఎన్‌కౌంటర్ చేయగలిగాయి. అతను హతుడవడానికి ఎంతో కాలం ముందే అతని తలకు ప్రభుత్వం రూ.40,00,000 ల బహుమతిని ప్రకటించింది. సుప్రసిద్ధ కన్నడ చలనచిత్ర కథానాయకుడు రాజ్‌కుమార్‌ను వీరప్పన్ 100 రోజుల పాటు కిడ్నాప్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.
వీరప్పన్ కోసం పోలీసులు సత్యమంగళం అడవుల్లో ఉధృతంగా గాలిస్తున్న సమయంలోనే సుప్రసిద్ధ తమిళ పక్షపత్రిక నక్కీరన్‌కు చెందిన విలేకరులు రహస్యంగా వీరప్పన్‌ను కలిసి ఇంటర్వ్యూ చేసి ఈ సంచలన కథనాన్ని బయటపెట్టారు.
మన వ్యవస్థ లోని లొసుగుల్ని, హిపోక్రసీని, ముఖ్యంగా న్యాయస్థానాలు, పోలీసు విభాగం, ప్రభుత్వ యంత్రాంగాల పనితీరునూ, రాజకీయ దివాళా కోరుతనాన్నీ అర్థంచేసుకునేందుకు ... చిత్తశుద్ధి గనక వుంటే ఆ లోపాలను సవరించుకునేందుకు కూడా ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.
మహనీయుల జీవిత చరిత్రల నుంచే కాదు, హంతకుల నేరస్థుల జీవనపరిణామ క్రమాలనుంచి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చాటి చెబుతుందీ పుస్తకం.
నక్కీరన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరప్పన్ తన బాల్యం గురించి, తన కుటుంబం గురించి, తను ఏనుగుల వేటగాడిగా, గంధపు చెక్కల స్మగ్లర్‌గా మారడానికి దారితీసిన పరిస్థితుల గురించి, తను చేసిన హత్యల గురించి, అటవీ శాఖలోని అవినీతి, పోలీసుల అత్యచారాల గురించి, ప్రస్తుత వ్యవస్థలోని హిపోక్రసీ గురించి సోదాహరణంగా వివరించాడు.
వీరప్పన్, ఫూలన్ దేవి వంటి క్రిమినళ్ల ఆవిర్భావానికి మూలాలు మన వ్యవస్థలోనే వున్నాయి. వాళ్లు కూడా ఈ వ్యవస్థ చే సృష్టించబడిన వ్యక్తులే.
అందువల్ల మన వ్యవస్థలోని లొసుగుల్ని నిర్మూలించే ప్రయత్నం చేయకుండా కేవలం వ్యక్తుల్ని అదీ తను సృష్టించిన వ్యక్తుల్ని తనే వేటాడుతూ పోవడం వల్ల సమాజానికి ఒనగూడే ప్రయోజనం పెద్దగా ఏమీ వుండదు. అసమానతలు, అక్రమాలు, ఆకలి, అవినీతి, నిరుద్యోగం, దారిద్య్రం వంటి రుగ్మతలకు తావులేని వ్యవస్థను సృష్టించుకోగలిగినప్పుడే ఇలాంటి నేరగాళ్లకు, నేరాలకు తావు వుండదు.
గంధపు చెక్కల వీరప్పన్
తమిళ మూలం: ముధల్ వెట్టాయుమ్ ముధల్ కొలాయుమ్, నక్కీరన్ ప్రచురణ, చెన్నయ్. జులై 2000.
తెలుగు అనువాదం: జానకీ అయ్యర్, ప్రభాకర్ మందార
100 పేజీలు, వెల: రూ.25
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment