Tuesday, July 1, 2008

చక్రాల కుర్చీ నసీమా ప్రయాణం


చక్రాల కుర్చీ

నసీమా ప్రయాణం

నసీమా హుర్‌జుక్‌

తెలుగు అనువాదం: రాధా మూర్తి

మరాఠీ మూలం:

222 పేజీలు, వెల: రూ.60

నసీమా హుర్‌జుర్‌కది వీరోచితమైన గాథ. అప్పటివరకూ హాయిగా, ఆరోగ్యంగా నడిచిపోతున్న ఆమె జీవితం... పదహారేళ్ల వయసులో ఉన్నట్టుండి ఒక్కసారిగా తలకిందులైంది. అనూహ్యమైన అనారోగ్యం ఫలితంగా ఆమె పూర్తిగా చక్రాల కుర్చీకే అతుక్కుపోవాల్సి వచ్చింది. లేవలేదు. అడుగుపడదు. అన్నింటికీ ఇతర్ల మీద ఆధారపడాలి. తొలి రోజుల్లో ఆమె మానసికంగా పూర్తిగా కుంగిపోయింది. నిట్టనిలువునా కుప్పకూలిపోయింది. అయితే అనతి కాలంలోనే ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుంది. తన వైకల్యం మీద ఆమె ఎంత ధీరోదాత్తమైన పోరాటాన్ని సాగించిందో కళ్లకు కడుతుంది ఈ పుస్తకం.

ఇప్పటికీ నసీమా చక్రాల కుర్చీలోనే కూర్చుని వుండవచ్చు. కానీ ఆమె మనలో చాలామంది కంటే ఎంతో ఉన్నతంగా ముందుకు సాగుతోంది. తాను అంగవైకల్యాన్ని జయించడమే కాదు.... హెల్పర్స్‌ ఆఫ్‌ ది హ్యాండీకాప్డ్‌... సంస్థను స్థాపించి ఎందరో పేద వికలాంగులకు చేయూతనిస్తోంది. వారిని పురోగమన పథంలో నడిపిస్తోంది.

మనోగతం ....

నేను పుట్టుకతో వికరాంగురాలిని కాదు. నాకు 16 సంవత్సరాల వయస్సులో ప్రీ డిగ్రీ చేస్తున్నప్పుడు బాగా వీపు నొప్పి వచ్చేది. అట్లా మూడు నాలుగు సంవత్సరాలు వీపునొప్పి వస్తూ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయినా ఏ డాక్టరూ సరిగా రోగ నిర్ధారణ చేయలేకపోయారు. ఏ డాక్టర్‌కీ ఇది వెన్నెముకకు సంబంధించిన వ్యాధి అని తోచలేదు. పైగా నా నొప్పి కేవలం ఊహాజనితమని కూడా కొందరు డాక్టర్లు అన్నారు. పరిణామం, అకస్మాత్తుగా నా శరీరంలో నడుము క్రింది భాగంలో చైతన్యం నశించిపోయి నేను వికలాంగురాలినయ్యాను. సరియైన సమయంలో సరియైన రోగ నిర్థారణ, తగిన వైద్యం జరిగి వుంటే బహుశా ఇట్లా అయి వుండేదికాదేమో. నేను మీకు నాట్య రంగంలోనో, క్రీడా క్షేత్రంలోనో కానవచ్చి వుండేదాన్నేమో?

స్కూల్లో ఎప్పుడూ ఆటల్లో, నృత్యంలో ముందుండే నేను జయ్‌సింగ్‌పూర్‌లో ఏడవ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాల వార్షికోత్సవంలో రాధాృష్ణ నృత్యంలో రాధ పాత్ర వేశాను. నృత్యం ప్రారంభమైన కాసేపటికే స్టేజి కుప్పకూలిపోయింది. నేను కింద పడిపోయాను. నన్ను బయటికి తీసి స్టేజిని సరిచేసి టీచర్లు ఆ తరువాతి ప్రోగ్రాం గురించి అనౌన్స్‌ చేస్తుంటే పరుగెత్తుకు వెళ్లి మిగిలిన సగం డాన్స్‌ను పూర్తిచేస్తానని పట్టుపట్టి ఆ ప్రదర్శనను పూర్తిచేశాను. అప్పుడు గెలిచిన బహుమతి నేను కింద పడినందుకు దొరికింది మాత్రం కచ్చితంగా కాదు

….అంటే కిందపడినా తిరిగి లేచే పట్టుదల నా స్వభావంలో చిన్నప్పటినుంచే వుంది. ఐనప్పటికీ ఈ అంగవైకల్యం వల్ల నేను శారీరకంగా, మానసింగా బాగా కృంగిపోయాను. నేను వికలాంగురాలినైన ఆరునెల్లకి నా తండ్రి చనిపోయారు. అసలే చీకటిగా వున్న నా భవిష్యత్తు మరింత అంధకార మయమైపోయింది. నిరాశా నిస్పృహలతో మంచానికి అతుక్కుపోయాను. చాలామంది ధైర్యం చెప్పేవారు. కానీ వారి మాటలకు నాకు కోపం ముంచుకొచ్చేది. వీళ్ల సొమ్మేం పోయింది. కాలినమ్మకేగా మంట గురించి తెలసేది అనుకునేదాన్ని. నాకు వీల్‌ చైర్‌ ఇవ్వబోతుంటే తీసుకోవాలనిపించలేదు.అట్లాంటి పరిస్థితిలో ఒకనాడు శ్రీబాబూకాకా దివాణ్‌ అన్న గొప్ప వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన కూడా నాలాగే నడుము కింది భాగంలో పక్షవాతగ్రస్తుడైన వ్యక్తి. మూర్తీభవించిన చైతన్యస్ఫూర్తి. ఆయన తన స్వానుభవంతో గ్రహించిన శారీరక బాధలు, వాటి ఉపశమన మార్గాల గురించి చెప్పారు. ఇతరుల నుండి సహాయం తీసుకునేందుకు సంకోచించకూడదనీ, న్యూనతాభావం మనసులోకి రానివ్వవద్దనీ, అవసరమైనప్పుడు ఇతర వికలాంగులకు చేయూతనిచ్చి ఆ ఋణం తీర్చుకోవాలనీ చెప్పారు.

ఆయన హితోపదేశమే నాకు నా కర్యకలాపాల్లో ప్రేరణ మంత్రంగా పనిచేసింది......



3 comments:

  1. Hi. Thank you for the intro. I was also suffering from the same problem.. however, when paraplegia was inches away, I got a life-saving surgery on my spine. This incident has made me a stron person. I too would like to volunteer in any effort that is to give emotional support to paraplegic patients. Thanks.

    ReplyDelete
  2. hi
    mee blagu bagundi
    naa blagu freeonlinemovies can we exchange links

    www.andhratalkies.co.nr


    www.reddimohan.co.nr

    ReplyDelete
  3. Dear Sujata,
    Please do help in getting the book across to people who need it. We would really appreciate this.
    Gita (HBT)

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌