పథేర్ పాంచాలీ
సత్యజిత్ రే అపూర్వ చిత్రానికి నవలా మాత్రృక
బిభూతి బూషణ్ బందోపాధ్యాయ
పథేర్ = పథం, రహదారి, మార్గం
పాంచాలీ = తరతరాలుగా సంప్రదాయ కథా గానానికి ఉపయోగిస్తున్న బెంగాలీ గీతాలు.
అజరామర పథగీతం : పథేర్ పాంచాలీ అనగానే మనకు చప్పున గుర్తుకొచ్చేది సత్యజిత్ రే, ఆయన రూపొందించిన అపూ చిత్ర త్రయం. మొట్టమొదటిసారిగా యావత్ ప్రపంచం దృష్టిని భరతీయ సినిమావైపు ఆకర్షించిందీ, సత్యజిత్ రేకు అంతర్జాతీయ గుర్తింపునూ, అపార ఖ్యాతినీ అర్జించి పెట్టిందీ ఈ చిత్ర త్రయమే. వాటిలో మొదటిది పథేర్ పాంచాలీ (1955), రెండోది అపరాజిత (1956), మూడోది అపూర్ సంసార్ (1959). ఈ మూడు చిత్రాలకూ ప్రఖ్యాత బెంగాలీ రచయిత బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ రాసిన విశిష్ట నవలలే ఆధారం.
నలభైయవ దశకంలో శాంతినికేతన్‌లో లలిత కళలు, గ్రాఫిక్ డిజైనింగ్ అభ్యసించి బయటకొచ్చిన సత్యజిత్ రేను సినిమాలు ఎంతగానో అకర్షించాయి. కానీ భారతీయ సినిమాల్లో ఎంతకీ తీపి వలపుల ప్రేమ పాటలు, మార్మిక పురాణగాథలే రాజ్యమేలుతుండటం ఆయన్ను చాలా చికాకు పెట్టింది. సినిమాకు జీవితమే ముడిసరుకు కావాలి. సినిమా వంటి విస్తృత జనమాధ్యమానికి స్ఫూర్తి మన జీవితంలో, మన మూలాల్లో వుండాలి. సంగీతం, కవిత్వం, చిత్రలేఖనం వంటి రంగాల్లో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన మన దేశం చిత్రదర్శకులను కదిలించలేకపోవటం విడ్డూరమే.
ఈ వేదనే సత్యజిత్ రేను సినిమాలవైపు నడిపించింది. గాఢమైన జీవితానుభూతితో సినిమాను నిర్మించాలనుకున్నప్పుడు ఆయన మనసులో మెదిలిన నవల పథేర్ పాంచాలీ. పథేర్ పాంచాలీ బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ స్వీయ కథాత్మక రచన. ఇది 1928-29లో విచిత్ర అనే పత్రికలో సీరియల్‌గా ప్రచురించబడి 1929లోనే పుస్తక రూపంలో వెలువడింది.
సత్యజిత్ రే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఆనవలను అదే పేరుతో పథేర్ పాంచాలీ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. 1955లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యత్తమ మానవ చిత్రణా పురస్కారం అందుకుంది. దేశవిదేశాల్లో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. చలనచిత్రాల్లో నవ్య ధోరణులకు పునాది వేసింది.
బెంగాలీ/భారతీయ సాహిత్యంలో అప్పటికే సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పథేర్ పాంచాలీ నవలను చలన చిత్రంగా మలచడం ద్వారా సత్యజిత్ రే ఆ నవలకు అంతర్జాతీయ గుర్తింపునూ, శాశ్వతత్వాన్నీ తెచ్చిపెట్టారు.
పథేర్ అంటే పథం అని అర్థం, పాంచాలీలనేవి తరతరాలుగా సంప్రదాయ కథాగానానికి ఉపయోగిస్తుండే బెంగాలీ గీతాలు. అందుకే సత్యజిత్ రే తన చిత్రానికి సాంగ్ ఆఫ్ ద లిటిల్ రోడ్ అనే ఉపశీర్షికను జోడించారు. మారుతున్న కాలంతో పాటే వ్యక్తులుగా తమ తమ జీవితాలకు అర్థాలను వెతుక్కుంటూ పల్లెల నుంచి పట్నాలకు వలసపోతున్న జీవితాలు అంతర్లీనంగా తరచూ మనల్ని కలవరపెడుంటాయి. ఊపందుకున్న పారిశ్రామికీకరణతో అప్పుడప్పుడే గ్రామాల గుండెల్లోకి దూసుకొస్తున్న నాగరికతా రైళ్లు, అబ్బురంతో చూసే పసి మనసుల్లో అవి రేపే గుబుళ్లు, కుటుంబాలను అతలాకుతలం చేసే అనూహ్య విలయాలు, తలవంచకుండా ఆత్మగౌరవంతో సాగించే పేదరికపు పోరాటాలు... ఇలా ఎన్నో బలీయమైన మానవ-సామాజిక సందర్భాలు నవల పొడుగునా పరంపరగా మనల్ని పలకరిస్తుంటాయి. మనసు ఆర్ద్రంగా మానవీయమవుతుంటుంది. అందుకే పథేర్ పాంచాలీ కరిగిపోయే కాలంతో ప్రమేయం లేని క్లాసిక్ గా ఎన్నటికీ వన్నె తగ్గకుండా నిలిచి వుంటోంది.
విశిష్టమైన ఈ బెంగాలీ నవలను మద్దిపట్ల సూరి తేట తెలుగులోకి అనువదించారు. బిభూతి భూషణ్ బందోపాధ్యాయతో పాటు తారాశంకర్ బెనర్జీ, శైలజానంద ముఖర్జీ, నిరంజన గుప్తా వంటి మరెందరో సుప్రసిద్ధ బెంగాలీ రచయితలను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ఘనత మద్దిపట్ల సూరిదే. ఆయన భలేతమ్ముడు (1969), పండంటి కాపురం (1972), విచిత్ర దాంపత్యం (1971) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మాటలు కూడా రాశారు.
No comments:
Post a Comment