Saturday, July 5, 2008

ఎదురీత కిశోర్‌ శాంతాబాయి కాళే ఆత్మకథ


ఎదురీత

కిశోర్శాంతాబాయి కాలే ఆత్మకథ

కొల్హాట్యాచే పోర్‌ అనే పేరుతో వెలువడిన కిశోర్‌ శాంతాబాయి కాళే ఆత్మకథ 1990లలో మరాఠీ సాహితీ లోకాన్ని ఒక కుదుపు కుదిపింది. కొల్హాట్యాచే పోర్‌ అంటే కొల్హాటీ కులం కుర్రోడు అని అర్థం. కొల్హాటీ కులం రాజస్థానీ సంచార తెగకు చెందింది. చాలాకాలం కిందట వాళ్లు పశ్చిమ మహరాష్ట్రకు వలస వచ్చారు. మొదట్లో గారడీ విద్యలను ప్రదర్శిస్తూ పొట్టపోసుకునేవారు. తర్వాత ఆకర్షణీయమైన డాన్సింగ్‌ వృత్తిని ఎంచుకున్నారు.

ఈ కులంలో పుట్టిన ఆడపిల్లలు ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతారు. పెద్దమనిషి కాగానే కొల్హాటీ ఆడపిల్లల్ని కన్నెరికం పేరిట డబ్బున్న వాళ్లకి అమ్మేస్తారు. అట్లా కొనుక్కున్నవాళ్లు కొంతకాలం తరువాత ఆ ఆడపిల్లలకి కడుపు రాగానే వారి కర్మకి వారిని వదిలేస్తారు. అందువల్లనే ఎక్కువ మంది కొల్హాటీ పిల్లలకు తండ్రి పేరు వుండదు. వాళ్లు తమ తల్లిపేరునే పెట్టుకుంటారు. తత్ఫలితంగా పాఠశాలల్లో ఆ పిల్లల్ని అక్రమ సంతానంగా తోటివాళ్లు గేలి చేస్తుంటే తట్టుకోలేక చదువులు మానేస్తుంటారు.

ఇట్లాంటి నేపథ్యంలో ఒక కొల్హాటీ కుర్రవాడు ఏటికి ఎదురీదినట్టు... అడుగడుగునా ఎదురయ్యే అడ్డంకులను తట్టుకుంటూ పట్టుదలగా చదువును కొనసాగించి డాక్టర్‌ అయ్యాడు. మారు మూల గ్రామంలో తన తల్లి పేరు మీద శాంతాబాయి దవాఖానాను స్థాపించి నిస్వార్థంగా ఆదివాసీలకు వైద్య సేవలు అందిస్తున్నాడు. ఆ ధీరోదాత్తుడే డాక్టర్‌ కిశోర్‌ శాంతాబాయి కాళే. ఆయన ఆత్మకథే ఈ పుస్తకం.

ఒక పూరి గుడిసెలో చిన్న చెక్క బల్ల ముందు కూర్చుని వుంటాడు డాక్టర్‌ కిశోర్‌ శాంతాబాయి కాళే. అతని వెనుక మరొక బల్ల వుంటుంది. దానిమీద రకరకాల మందులుంటాయి. మధ్యలో పరదా కప్పి వుండే భాగం పరీక్షగదిగా వాడతాడు. గుడిసె గోడల్ని వెదురు బద్దలతో అల్లి పేడ, బురదమట్టి పులిమారు. ఆ పూరికప్పు కింద వుండేది గచ్చులేని మట్టి నేల మాత్రమే. ముంబయి దగ్గరలోని థాణె-రాయగఢ్‌ జిల్లా సరిహద్దు గ్రామం అయిన కూదేరాన్‌లోని పొడి వాతావరణానికి, వేడికి ఆ గుడిసె పెచ్చులు ఊడి పోతుంటాయి. ఆ గుడిసె చుట్టుపక్కల కొన్ని ఆదివాసీ గుడిసెలు, కొంచెం దూరంగా ఓ ప్రభుత్వ స్కూలు భవనం వుంటాయి.

చుట్టూ ముఫ్పై కిలో మీటర్ల పరిథిలో ఎక్కడా ప్రభుత్వ ఆస్పత్రి గానీ, ఆరోగ్య కార్యకర్తగానీ అందుబాటులో లేని చోట మొక్క వోని ఆత్మ విశ్వాసంతో, నిబద్ధతతో, సేవా భావంతో ఆయన ఈ ఆసుపత్రిని నెలకొల్పాడు. ఆదివాసీ పల్లెలకు వైద్యాన్ని తీసుకెళ్లిన మొట్ట మొదటి డాక్టర్‌ ఈయనే అని చెప్పవచ్చు. మొదట్లో ఆయన ఆ ఊళ్లోని ఓ దేవాలయం లోగిలిలో తన వైద్య సేవల్ని ప్రారంభించాడు. అయితే ఆయన తమ మంచి కోసమే వైద్యం చేస్తున్నాడని గ్రహించాక ఆ ఊరి జనం ఆస్పత్రి కోసం కొంత స్థలం ఇచ్చారు. అందులో క్లినిక్‌, మందుల కొట్టు, రోగులను వుంచడానికి గదులు... వాటికోసం కొన్ని గుడిసెలు నిర్మించుకోడానికి వాళ్లే సహకరించారు. ఆ ఊరికి కరెంటు లేదు. రోడ్డు లేదు. రవాణా సౌకర్యం లేదు. కనీసం మంచి నీటకి కూడా దిక్కు లేదు. దాదాపు ఒకటిన్నర కిలో మీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చుకోవాలి. అట్లాంటి చోట పూరిగుడిసెలో ఆసుపత్రిని నెలకొల్పి, లాంతరు వెళ్తురులో వైద్యం చేయడం మొదలుపెట్టిన కాళే పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆతరువాత ఆయనే ఆ ఊళ్లో ఒక బోరు బావి వేయించాడు. ఆ ఊరికి సింగిల్‌ రోడ్డు వేయించాడు. పోరాడి మరీ బస్సు సౌకర్యం కల్పింపజేశాడు.

డాక్టర్‌ కాళే మొదట్లో నెర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసేవాడు. అప్పుడే ఆయనకు ఆదివాసీలతో పరిచయాలయ్యాయి. ఆదివాసీ ప్రాంతాల్లో బొత్తిగా వైద్య సదుపాయాలేమీ లేవన్న సంగతి వారి ద్వారానే తెలిసింది. దాంతో ఆయన తన ప్రభుత్వోద్యోగానికి రాజినామా చేసి కుదేరాన్‌లో స్వయంగా ఈ దవాఖానాను నెలకొల్పాడు. సరైన మందుల సరఫరాలేని ప్రభుత్వ ఆరోగ్య విధానంతో విసుగెత్తపోయిన ఆయన ఆదివాసుల వైద్యవిధానాన్ని అధ్యయనం చేశాడు. వాళ్లు ఉపయోగించే మూలికల గురించి తెలుసుకున్నాడు. ఆయుర్వేదాన్ని, ఆక్యుప్రెజర్‌, ఆక్యుపంచర్‌ విధానాలను కూడా నేర్చుకున్నాడు.ఆయా పరిస్థితులను బట్టి ఆయన ఈ అన్ని విధానాల్లో రోగులకు చవకగా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాడు.

ఈ పుస్తకం వల్ల డాక్టర్‌ కాళేకి ఎంతగా పొగడ్తలు వచ్చాయో, అంతగా శాపనార్థాలు కూడా వచ్చాయి. తమ కులం పరువు తీశాడని తోటి కులస్థులు ఆయనమీద కత్తికట్టారు. కులం నుంచి వెలివేశారు. ఆయనను భౌతికంగా నిర్మూలించాలని కూడా చూశారు. చెప్పుడు మాటలు విని చివరికి కన్న తల్లి కూడా అతనితో సంబంధాలు తెగతెంచుకుంది. ఆతరువాత ఎంతో కాలానికి ఈ పుస్తకం తననీ తన బతుకునీ అవమానించడానికి రాసింది కాదన్న వాస్తవాన్ని గ్రహించి ఆమె తన కొడుకుదగ్గరకు వచ్చింది.

అణగారిన కులాలకు చెందిన పిల్లలు ఎంత దుర్భరమైన పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తారో, వారికి ఎంత పరిమితమైన అవకాశాలు వుంటాయో, అడుగడుగునా ఎట్లాంటి అవమానాలు ఎదురవుతుంటాయో ఈ పుస్తకం ఆవిష్కరిస్తుంది. రిజర్వేషన్‌, ఎస్‌సి ఎస్‌టి వసతి గృహాలు వంటి సౌకర్యాలు కాళేలాంటి పిల్లల్ని ఎట్లా ఆదుకున్నాయో మనకు స్పష్టమవుతుంది.

ఒక మనిషిగా ఈ సాధారణమైన కథ ఇచ్చే అసాధారణమైన స్ఫూర్తితో మీరు కదిలిపోతారు. ఒక టీచర్‌గా పిల్లలకు మార్గదర్శిగా పిల్లల ఆకాంక్షలేమిటో మీరు తెలుసుకోగలుగుతారు. ఒక దళిత్‌గా కొళ్హాటీ ప్రజల కష్టాలు చూసి జ్వలించి పోతారు. ఒక స్త్రీగా తమాషా డాన్సర్ల దుర్భర జీవితంపట్లా వారిపై సాగుతున్న రకరకాల దోపడీ పట్లా ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

దీన్ని మీరు ఏవిధంగా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. పుస్తకం ఇప్పుడు మీ ముందే వుంది.

మరాఠీ మూలం: కొల్హాటేచే పోర్‌, ముంబాయి, 1994

తెలుగు అనువాదం: కలెకూరి ప్రసాద్‌

144 పేజీలు, వెల:రూ.30

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌