Tuesday, July 8, 2008

కరుకు (తాటికమ్మ) నవల


కరుకు (తాటికమ్మ) నవల

- బామ



2001 సంవత్సరపు క్రాస్‌వర్డ్‌ అవార్డు గెలుచుకున్న తమిళ నవల

తరతరాలుగా గడ్డకట్టుకుపోయిన మౌనాన్నీ, మాట్లాడనివ్వనితనాన్నీ బద్దలు కొట్టుకుంటూ పెల్లుబికి వచ్చిన అసాధారణ దళిత కంఠం కరుకు.

నవలలా కనిపించినా ఇది కల్పిత కథ కాదు. కొంత ఆత్మకథలా, మరికొంత విశ్లేషణలా, అక్కడక్కడ మేనిఫెస్టోలా కలగలిసిపోయి, ఒక విభిన్నమైన వాతావరణాన్ని కళ్లముందు నిలబెడుతుంది. భారతీయ ప్రధాన స్రవంతి ఆలోచనా ధోరణికి వెలుపల, దూరంగా జీవితమనేది ఎలా ఉంటుందో ధైర్యంగా మన కళ్ల ముందుంచుతుంది.

తమిళనాట పరయా (మాదిగ) కులానికి చెందిన గ్రామీణ యువతి బామ తన జీవితంలోని ఒక సంక్షుభిత సమయం అంచున నిలబడి-బాల్యం నుంచి నిండైన విశ్వాసంతో రోమన్‌ కాథలిక్‌ గా ఎలా ఎదిగిందీ మనసు విప్పి చెబుతుంది. మరీ ముఖ్యంగా ఒక దళితగా, స్త్రీగా తనను తాను గుర్తించుకున్న క్రమంలో ఆ విశ్వాసం తన జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పిందీ, ఏ కొత్త చైతన్యానికి పునాది వేసిందీ అసాధారణ శక్తితో వివరిస్తుంది.

రెండు వైపులా పదునుగా వుండే కరుకు (తాటి ఆకు)కూ తన జీవితానికీ చాలా పోలికలున్నాయంటారు బామ.

చిన్నప్పుడు పొయ్యిలోకి పుల్లలు ఏరుకురమ్మని పంపించినప్పుడు నేను తాటిచెట్ల కింద రాలి పడివుండే ఎండిపోయిన తాటికమ్మలని లాక్కుంటూ తీసుకొచ్చేదాన్ని. వాటితో ఆడుకునేదాన్ని. తాటికమ్మ రెండువైపులా పదునుగా వుంటుంది. దాని వల్ల ఎన్నో సార్లు చర్మం గీరుకుపోయేది. నా బాల్యంలో రకరకాలుగా పెనవేసుకుపోయిన ఆ తాటికమ్మలే తర్వాత్తర్వాత నా జీవితానికి ప్రతీకలుగా, ఈ పుస్తకానికి మూలాలుగా మారాయి అంటారామె.

జీవితంలోని వివిధ దశల్లో తాటి కమ్మల్లా లోతుగా, నెత్తురొచ్చేలా కోసుకుపోయిన ఎన్నో సంఘటనలు, నన్ను తెలియనితనంలోకి నెట్టివేసి, బందీగా లోలోపలే అట్టుడికిపోయేలా చేసిన ఎన్నో అన్యాయమైన సామాజిక నిర్మాణాలు, ఆ బంధనాలను బద్దలు కొట్టి, దూరంగా విసిరేసి, నాశనం చేసెయ్యాలన్న నాలోని ఆరాటం, పళ్ల బిగువున గొలుసుల్ని ముక్కలు చేసిన తర్వాత అక్కడ బుస్సున ఎగజిమ్మిన రక్తం ... ఇవన్నీ కలిసే ఈ పుస్తకం.

న్యాయం, ప్రేమ, సమానత్వాలను ఇటుకలుగా పేర్చి సరికొత్త సమాజాన్ని నిర్మించాలని నాలాగా తహతహలాడుతున్న దళిత హృదయాలు ఎన్నో ఉన్నాయి. కొన్నేళ్లుగా అణచివేతను అనుభవిస్తున్న వాళ్లే... ఇప్పుడు రెండువైపులా పదునుండే కరుకుల్లా తయారై తమను అణిచివేస్తున్న వాళ్లకు పెద్ద సవాలుగా నిలబతున్నారు... అంటారు బామ.

బామ దళిత రచయిత్రి. 1958లో తమిళనాడులోని పుదుప్పట్టిలో జన్మించిన ఆమె ఎన్నో ఇబ్బందులు, సవాళ్ల మధ్య నలిగిపోతూనే స్కూలు కాలేజీ చదువులు పూర్తి చేసుకుని టీచరు వృత్తిని స్వీకరించారు. అణిచివేతకు గురవుతున్నవాళ్లకు బాసటగా నిలవాలని సిస్టర్‌గా మారి, చివరికి అక్కడి ఇరుకును భరించలేక తిరిగి సొంత ఊరికి వచ్చేశారు. ఒక టీచరుగా భవిష్యత్తరాలకు ఆత్మగౌరవం, సామాజిక స్పృహ వంటి విలువలను నేర్పించాలని ఆరాటపడతారు. కరుకు (1992) తరువాత సంగది అనే నవల, కుసుంబుక్కారన్‌ అనే కథాసంకలనం వెలువరించారు. కుల వివక్ష, సామాజిక ఆణచివేతలపై ఎన్నో వ్యాసాలు రాశారు.

ఈ నవలను చంద్రిక తెలుగులోకి అనువదించారు. ముఖచిత్రాన్ని కాళ్ల చిత్రించారు.

100 పేజీలు వెల రూ.30

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌