Saturday, July 12, 2008

పురుషాహంకారానికి సవాల్‌


పురుషాహంకారానికి సవాల్‌

తారాబాయి షిండే

నూటా పాతిక సంవత్సరాల క్రితం 1882లో తారాబాయి షిండే భారతదేశంలో స్త్రీల దుస్థితి పట్ల ఆవేదన చెందుతూ, పురుషాధిపత్యం మీద నిప్పులు చెరుగుతూ రాసిన మొట్టమొదటి స్త్రీవాద పుస్తకమిది. మన దేశంలో ప్రతి సామాజిక దురాచారానికీ, సకల దురవస్థలకూ కారణం స్త్రీలే అంటూ నిందించడాన్ని చూసిన తారాబాయి ఆవేశంతో రగిలిపోయింది. పురుషులు సర్వ స్వతంత్రాలనూ హక్కులనూ తమ గుప్పిట్లో పెట్టుకుని, అన్ని అనర్థాలకీ స్త్రీలనే బాధ్యుల్ని చేయడాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ప్రతికూలమైన పురుష పాఠ ప్రపంచాన్ని తాను ఒంటరిగా ఎదుర్కొంటున్నాననే భావనతో ఆమె అసలు దోషులైన పురుషులను కఠినంగా అధిక్షేపించింది. స్త్రీ - పురుష తులనా (స్త్రీ పురుషులలో ఎవరు నిజంగా దుష్టులో నీతినియమాలు లేనివారో తెలియజేసే వ్యాసం) అనే పేరుతో తారాబాయి మరాఠీలో ప్రచురించిన ఏకైక పుస్తకమిది. ఆ తరువాత ఆమె ఏమైనా ఇతర రచనలు చేశారోలేదో తెలియదు. ఆరోజుల్లో ఒక స్త్రీ ఇంత ధైర్యంగా, ఇంత తార్కికంగా స్త్రీ పురుష సంబంధాల గురించి చర్చించడం అద్భుతమనిపిస్తుంది.

జ్యోతీ బా ఫూలే తోనూ, ఆయన స్థాపించిన సత్యశోధన సమాజంతోనూ తారాబాయి కుటుంబానికి దగ్గర సంబంధాలుండేవి. 1885 సెప్టెంబర్‌లో సత్సార్‌ (సత్యవారం) పత్రికలో జ్యోతీ బా ఫూలే తారాబాయి గురించి ఇలా రాశారు: ఈ రోజు ఇంగ్లీషు ప్రభుత్వం అధికారంలో వుండటం వల్ల ఈ దేశ పీడిత ప్రజల్లో కొందరు సంకోచంగానైనా చదవడం రాయడం నేర్చుకోవటం మొదలుపెట్టారు. అట్లాంటి వారిలో తారాబాయి మన ముద్దుల ఆడపడచు. మగవాళ్ల చేతుల్లో బాధలుపడే స్త్రీల కోపాగ్నిని వ్యక్తం చెయ్యటం, మగవాళ్లు ఎలా ఉంటే మళ్లీ తమ స్త్రీల ప్రేమ, విశ్వాసం పొందగలరో స్పష్టంగా చెప్పటం ఆమె ధ్యేయం అని అభివర్ణించారు.

మీరు (పురుషులు) ప్రతి మహిళనీ ఒక పాపిగా భావించి ఆమె జీవితం నరకప్రాయం చెయ్యాలనే ప్రయత్నాలను ఇకముందైనా ఆపేస్తారనే ఆశతో నేనీ పుస్తకం రాస్తున్నాను అంటుంది తారాబాయి ముందుమాటలో. సనాతన మరాఠీ పద్ధతిలో నాలుగు గోడల మధ్య బంధించబడిన, పెద్ద తెలివితేటలు లేని సామాన్యమైన స్త్రీని నేను. ఇది నా మొట్ట మొదటి ప్రయత్నం కనుక ఇందులో కొన్ని అంతన పొంతనలేని విషయాలు వుండొచ్చు. దీనిని కఠినమైన, మొరటు భాషలో రాశాను. అయితే ప్రతి రోజూ మగవాళ్లు చేసే వింత వింత సిగ్గులేని పనులు, క్రూరమైన చర్యల గురించి వింటున్నాము. ఎవరూ ఆ విషయాల గురించి ఒక్క ముక్క కూడా అనడం లేదు. పైగా దోషమంతా ఆడవాళ్లదే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసి నా మనస్సు స్త్రీల ఆత్మగౌరవం కోసం తల్లడిల్లిపోయింది. దాంతో నా భయమంతా ఎగిరిపోయింది. ఇక ఇలా పరుషమైన భాషలో రాయకుంటా వుండలేకపోయాను అంటుంది.

స్త్రీలను నిజమైన ప్రపంచానికి దూరంగా చీకటి మూలల్లోకి తోసి, పరదాల మాటున వుంచి, భయపెట్టి, ఆడబానిసల్లా అణిచిపెట్టి, స్త్రీలకు చదువు అవసరం లేదని చెప్పి పైనుంచి ఆడవాళ్లు బుద్ధిహీనులు, తెలివి తక్కువవాళ్లు అంటూ అవమానించడాన్ని ఆమె సహించలేకపోయింది. భార్య చనిపోతే నడివయసు పురుషుడైనా మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కానీ భర్త చనిపోతే పదహారేళ్ల పడుచు అయినా సరే పెళ్లి చేసుకోడానికి వీల్లేదు. పైగా ఆమె బొట్టు చెరిపేసుకుని, గాజులు పగులగొట్టుకుని శేషజీవితమంతా శాపగ్రస్తురాలిగా చీకటి గదిలో గడపాలనే ఆచారం మీద తారాబాయి నిప్పులు కక్కుతుంది. మరి మీరు కూడా మీ భార్యలు చనిపోయినప్పుడు మీ మీసాలు గొరిగించుకుని, మీ తలకు గుండు కొట్టించుకుని ఏ అడవుల్లోకో పోయి గడిపేయొచ్చుకదా. అమ్మో మీరా? మీరలా చేయరు. భార్య చనిపోగానే ఇంకో ఆమెని పదో రోజుకే తెచ్చేసుకుంటారు. వివేకవంతుడైన ఏ దేవుడు మిమ్మల్ని ఇలా చేయమన్నాడో చెప్పండి. నిజానికి స్త్రీకి ఏది మంచిదో పురుషుడికి కూడా అదే మంచిదవ్వాలి కదా. మీ విషయంలో ఎందుకీ భేదం? అంటూ నిలదీస్తుంది. స్త్రీలను అణిచి వుంచే కుతంత్రంలో భాగంగా రాయబడ్డ పతివ్రత కథలను, పురాణాలను, దేవుళ్ల ద్వంద్వ నీతిని, పక్షపాత ధోరణిని అన్నింటిపైనా ఆవేశంతో విరుచుకుపడుతుంది. అనుకున్నట్టుగానే తారాబాయి పుస్తకం నాటి జనంలో తీవ్రవ్యతిరేకతను రేకెత్తించింది.

ఆ కాలపు స్త్రీల జీవనస్థితిగతులను తెలుసుకునేందుకు ఈ చిన్న పుస్తకం విశేషంగా తోడ్పడుతుంది. ఈ పుస్తకంలో లేవనెత్తబడ్డ అనేక ప్రశ్నలు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.

ఈ పుస్తకాన్ని ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన సి.ఎల్‌.ఎల్‌. జయప్రద ఆంధ్రా యునివర్సిటీలో ఆంగ్ల సాహిత్యం బోధిస్తున్నారు. ఆమె తెలుగు నుండి ఇంగ్లీషులోకి, ఇంగ్లీషు నుంచి తెలుగులోకి చాలా కథలు అనువదించారు. ఆమె అనువాదం చేసిన డా. కేశవరెడ్డి నవల అతడు అడవిని జయించాడు ను మాకమిలన్‌ వారు 1998లో హి కాంకర్డ్‌ ద జింగిల్‌ పేరుతో ప్రచురించారు.

పురుషాహంకారానికి సవాల్‌

40 పేజీలు వెల: రూ.16

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌