Monday, July 14, 2008

మన పిల్లలకు శ్రమ గౌరవ పాఠాలు నేర్పిద్దాం


సారె తిప్పు ... సాలు దున్ను, మన కాలపు శ్రమ గౌరవ పాఠాలు

కంచ ఐలయ్య

సాలు వెనక సాలు తీర్చిదిద్దినట్టుగా మీరెవరైనా దుక్కి దున్న గలరా? వరినాటు వరసబెట్టి మునుం తప్పకుండా నాటెయ్యగలరా? ఒరం జెక్కగలరా? తూర్పార పట్టగలరా? చెయ్యలేరు. వరి... ధాన్యమా! బియ్యమా! తెలియని అజ్ఞానంలో పెరుగుతున్న కంప్యూటర్‌ బ్రాయిలర్‌ కోడిపిల్లల తరం ఈ పనులు అసలే చెయ్యలేరు. కానీ ఒకటి మాత్రం చెయ్యగలరు. సాలుదున్నిన క్రియాశీలి, సృజనశీలి, సంపద సృష్టికర్తను ఉత్త బైతు...ఎర్ర బస్సు ఎక్కొచ్చినోడు అని ఈసడించుకోగలరు. అదీ సమస్య.

ఒక్క రైతునే కాదు... ఆదివాసులను, పశులమందలను ఏలే పసుల కాపర్లను, చెప్పులు కుట్టిచ్చే తోలుపనివాళ్లను, సారెతిప్పి కుండలూ కూజాలూ మట్టి కళాఖండాలను చేసే కుమ్మరులను, సన్నపోగుపెట్టి అగ్గిపెట్టెలో ఇమిడే కళాత్మక నేత దుస్తులను నేసే సాలోళ్లను, మురికి కంపును ఒదిలించి మీకు చలువ దుస్తులందించే చాకలోళ్లను, బొచ్చుతో ఉంటే కోతులను తలపించే మీ ముఖారవిందాలను అద్దంలా మెరిసిపోయేలా చేసే క్షురకులను, చివరికి ఇంటిపని, పాచిపనిచేసే మన తల్లులను, అక్కలను, చెల్లెళ్లను కూడా ఈసడించుకోగలరు.

శ్రమను హీనంగా చూసే సంస్కృతిలో పుట్టి ఎదుగుతున్న భారత సమాజంలో శ్రమకు విలువలేకపోవడం వెనక పెద్ద కుట్రే వుంది. అగ్రవర్ణాల వారు మానవ సంబంధాలను పుట్టుకతోనే శాసించే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను ఏర్పరచడంలో వుంది. కొంచెంకూడా చెక్కుచెదరనివ్వకుండా కులవ్యవస్థను స్థిరీకరించడంలో వుంది. పురుషు సూక్తాల్లో, వేదాల్లో, మనువు ప్రవచించిన అనాది సిద్ధాంతాల్లో వుంది.

కంచ ఐలయ్య అనే ఒక ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఆధిపత్య భావజాలాలపై పోరాటం చేస్తున్న యోధుడు. ఇప్పుడున్న దాన్ని తలకిందులుగా చూసి, అసలు సత్యాల్ని శాస్త్రీయంగా, తాత్వికంగా, సహేతుకంగాచెప్పగలుగుతున్న బుద్ధిజీవి. హిందూమతం పైనా... ఆది శూద్రుల మీద, పంచముల మీద రుద్దిన భావజాలం పైనా ఆయన రాతలన్నీ అందుకే తలకిందులుగా ప్రశ్నించడంతో ప్రారంభమై ఒక గొప్ప తాత్విక దృష్టిని కలిగిస్తాయి. నేను హిందువు నెట్లయిత? అనే ఒక సాదాసీదా మాటతో ఒక గొప్ప తాత్విక ప్రపంచాన్ని గతంలో ఆవిష్కరించిన కంచ ఐలయ్య శ్రమ గౌరవ పాఠాలకు సబంధించి ఇప్పుడు సారె తిప్పు... సాలు దున్ను అనే అద్భుతమైన పుస్తకం రాశారు.

మానవీయ విలువలపట్ల, ప్రజాస్వామ్య విలువలపట్ల ఏమాత్రం నమ్మమున్న ఏ వర్ణాలవారికైనా, ఏ వర్గాల వారికైనా ఈ పుస్తకం ఇప్పటి దాకా నెత్తురులో పాతుకుపోయివున్న భావాలను చెల్లాచెదురుచేసి కనువిప్పు కలిగించగల గొప్ప సాధనం. మానవ నాగరికతకు మూలమైన శ్రమకు సంబంధించిన వివక్ష మూలాలు కుల, మత భావనల్లో ఉన్నాయన్న విషయం గురించిన కొత్త సిలబస్‌ ఈ పుస్తకం.

ఈ ప్రపంచం ఎట్లా నిర్మితమయింది? దాని నిర్మాతలెవరు? పనికీ జెండర్‌కూ గల సబంధం ఏమిటి? అది విలోమంగా ఎందుకున్నది? అసలు పనిచేస్తున్న వాళ్లు ఎవరు? వారికి గౌరవం ఎందుకు దక్కదు?...శానిపని (నైపుణ్యం) ఏమిటి? సన్నపని ఏమిటి? ఈ శ్రమ ఎట్లా పుట్టింది? ఎన్ని మార్పులు చెందింది? ఒళ్లు వంచి, చెపట కక్కుతూపనిచెయ్యడం అనే ఒక గొప్ప విషయం ... ఎందుకు అగౌరవంగా తయారయ్యింది? చదువు పెరిగినక కొద్దీ ఉత్పాదక శక్తుల పట్ల ఏవగింపు, చిన్నచూపు ఎందుకని వస్తున్నది? ఇది పరిణామ క్రమంలో భాగంగా వస్తున్నదా? దీనివెనక కుల, మత వ్యవస్థల ప్రమేయం ఉన్నదా? ఇలా ... సహస్ర వుృత్తుల సమస్త రహస్యాలు, అద్భుతాలు, ఇన్వెన్షన్లూ అన్నీ కలగలిపి నేర్పుతుంది ఈ పుస్తకం.

ఇది వర్తమాన భారతంలో శ్రమకూ, శ్రమకు సంబంధించిన అన్ని వ్యాపకాలకూ ఆమడ దూరమై పోతున్న ఈ తరపు పిల్లలకు నేర్పాల్సిన విషయాలు. ఉత్త భూమి నుంచి బంగారం పండించగల నేర్పు, బట్టలు నేసే నేర్పు, సబ్బుకు మూల మైన సోడా కనిపెట్టిన నేర్పు, తోలుపనిలో వాడిన రసాయనాల నేర్పు, సారె తిప్పి కళాఖండాన్ని వేళ్ల కొనలమీద చేయగల నేర్పు, అందుకు సబంధించిన విజ్ఞానం, దాని కారణంగా ఏర్పడిన ఇవ్వాల్టి సౌకర్యాల గురించి చాలా చిన్న చిన్న విషయాలతో, ఎక్కడా జార్గన్‌ వాడకుండా, అద్భుతంగా మలిచారు ఐలయ్య.

ఇంగ్లీషులో ... టర్నింగ్‌ ద పాట్‌, టిల్లింగ్‌ ద లాండ్‌ - డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ ఇన్‌ అవర్‌ టైమ్స్‌ ... అనే పేరుతో వచ్చిన ఈ పుస్తకానికి చంద్రిక అనువాదం చాలా సరళంగా తెలుగులోనే రాసినట్టుగా వుంది.

ఐలయ్య ఈ పుస్తకం ఎందుకు రాశారు?

ఐఐటీల్లో, ఐఐఎంలలో, కేంద్ర వైద్య సంస్థల్లో చదువుతున్న అగ్రకులాల పిల్లలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఎన్నో ర్యాలీలు చేశారు. వీపీసింగ్‌ బీసీ ల కోసం మండల్‌ కమిషన్‌ సిఫారసులు అమలు పరచాలనుకున్నప్పుడుకూడా విద్యార్థులు పెద్ద గొడవ చేశారు. ఈ ఆందోళనలో వాళ్లు రోడ్లు ఊడ్చారు. బూట్లు పాలిష్‌ చేశారు. కూరగాయలు అమ్మారు. అంటే అర్థం ఏమిటి? డాక్టర్లమై వుండీ మేం రోడ్లు ఊడుస్తున్నామనీ, ఇంజనీర్లమై వుండీ బూట్లు పాలిష్‌ చేశామనీ ... అంతేనా? కాదు. రోడ్లు ఊడ్వడం బూట్లు పాలిష్‌ చెయ్యడం, కూరగాయలు అమ్మడం చిన్నపని అగౌరవమైన పని అని. కానీ వాళ్లు ఆ పనులు నిజంగానే చెయ్యగలరా? సహజ శస్త్రచికిత్సలు చేసే మంత్రసానులు, మంగలి పనివారు లేకుండానే మానవ నాగరికతలో శస్త్ర చికిత్సలు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? లేదు అందుకే ఐలయ్యను ఈ విద్యార్థుల కార్యాచరణ చికాకు పరిచింది. ఆ మాటకొస్తే ఆ విద్యార్థులట్లా బయటపడ్డారు కానీ మన ఇంట్లో, ప్రతివాళ్ల ఇంట్లో వాళ్లు శూద్రులైనా, అగ్రవర్ణాల వారైనా శ్రమ పట్ల కొద్దిపాటి గౌరవం కూడా లేకపోవడం మనకు నిత్యానుభవమే. అందువల్లే మన కాలపు ఈ మిడిమిడి జ్ఞానపు, మిడిమేళపు తరానికి మన కాలపు శ్రమ గౌరవ పాఠాలను కంచ ఐలయ్య అందించారు.

ఆదివాసుల తెలివితేటలు ఏ పండు తినాలో, ఏది కూడదో మనకు నేర్పింది. అట్లాగే చాకలి వారి పని, మంగలి వారి పని, వ్యవసాయం అన్ని వృత్తులూ విజ్ఞానానికి సబంధించిన కొనసాగింపుగానే చూడాలనే విషయం ఈ పుస్తకంలో అనేక ఉదాహరణలతో వుంది.

ఒక్క పిల్లలకే కాదు శ్రమను మరిచిపోయి, మూలాలు మరచిపోయి త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న పెద్దలకు కూడా ఇది కనువిప్పుకాగల పుస్తకం. సింగరేణిలో సమ్మె జరిగినప్పుడు గోడలమీద ఒక నినాదం వుండేది. అది శాశ్వతమైన సత్యం. ... కంప్యూటర్లు బొగ్గు తవ్వగలవా? ... తవ్వలేవు. బొగ్గు లేకుండా ప్రపంచం బతకగలదా? లేదు. అందువల్ల శ్రమకు సంబంధించి మౌలికాంశం భౌతిక శ్రమ, దానికి సబంధించిన మేధో శ్రమ. దీనికి మినహాయింపు లేదన్న సత్యాన్ని కంచ ఐలయ్య పుస్తకం ఆవిష్కరించింది. భారతదేశంలో శ్రమగౌరవం లేకపోవడానికి, ఆశాస్త్రీయ, అభివృద్ధి నిరోధక భావజాలం ఉండడానికి కారణమైన మత కుల వ్యవస్థల పాత్రపై, శ్రమలో జెండర్‌ వివక్షపై కూడా ఈ పుస్తకం కొంత సైద్ధాంతికంగా వివరించింది. ఇది అన్ని పాఠశాలల్లో ... అన్ని గ్రంధాలయాల్లో ఉండాల్సిన పుస్తకం. ముఖ్యంగా శ్రమను గౌరవించే వారికి ఇది హ్యాండ్‌ బుక్‌ కాగలిగిన విలువైన పుస్తకం. దీనికి బొమ్మలు వేసిన దుర్గాభాయ్‌ వ్యామ్‌ను ప్రత్యేకంగా పేర్కొనాలి. పెద్దగా చదువులేని దుర్గాభాయ్‌ వ్యామ్‌ ఫోనులో పాఠ్యాంశాలను విని కేవలం పది రోజుల్లో వేసిన బొమ్మలు ఈ పుస్తకానికి అదనపు అందాన్ని, అదనపు విలువనూ తెచ్చాయి. ఐలయ్యకు అనేక అభినందనలు. ఈ పుస్తకం ముద్రించిన హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌కు కృతజ్ఞతలు.

అ ల్లం నారాయణ,

ఆదివారం ఆంధ్ర జ్యోతి, 30 మార్చి 2008, కొత్త పుస్తకాలు... సమీక్ష

సారె తిప్పు ... సాలు దున్ను, మన కాలపు శ్రమ గౌరవ పాఠాలు

రచన: కంచ ఐలయ్య

బొమ్మలు : దుర్గాభాయ్‌ వ్యామ్‌, తెలుగు అనువాదం : చంద్రిక

పేజీలు 108 వెల రూ.80

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌