Monday, July 7, 2008

మనకు తెలియని మన చరిత్ర తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీలు


మనకు తెలియని మన చరిత్ర

తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీలు

- కె.లలిత, వసంత కన్నబిరాన్‌, రమా మేల్కోటే, ఉమా మహేశ్వరి, సుసీ తారూ, వీణా శత్రుఘ్న, ఎమ్‌.రత్నమాల ( స్త్రీ శక్తి సంఘటన )

తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన స్త్రీల మౌఖిక చరిత్రల్ని వెలుగులోకి తీసుకు రావాలని చేసిన ప్రయత్నమే ఈ మనకు తెలియని మన చరిత్ర. 1946 నుండి 1951 వరకు హైద్రాబాద్‌ సంస్థానంలోని ఫ్యూడల్‌ జమీందారుల మీదా, రజాకార్ల రాక్షసత్వం మీదా, ఆతర్వాత భారత సైన్యం మీదా తెలంగాణాలోని అసంఖ్యా స్త్రీ పురుషులు చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకమైనది. ఈనాడు అదొక ఇతిహాసం. అదే తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం.

తెలంగాణా పోరాట చరిత్రను ఆ పోరాటంలో పాల్గొన్న కొందరు గ్రంథస్తం చేశారు. మరికొందరు ఆ పోరాట జ్ఞాపకాలను రాశారు. అయితే ఆ పోరాటంలో కదం తొక్కిన మహిళల పాత్ర గురించిన పుస్తకాలు దాదాపు రాలేదనే చెప్పాలి. నిర్ణయాలు చెయ్యడంలో స్త్రీల ప్రమేయం లేకపోయినంత మాత్రాన, నాయకత్వ స్థానాల్లో స్త్రీలు లేకపోయినంత మాత్రాన, పోరాటంలో వారి పాత్ర అప్రధానమై పోదు. ఎందుకంటే ఆనాటి సాంఘిక నిర్మాణంలో, ఆ పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకనే స్థానంలో స్త్రీలు వుండటమనేది సాధ్యం అవునా కాదా అనేది పరిశీలించాల్సిన విషయం.

స్త్రీలకు సబంధించిన ఏ పాలసీనీ ఆనాటి కమ్యూనిస్టు పార్టీ తయారు చేయలేకపోయింది. ఉద్యమానికి స్త్రీలు అత్యవసరమని గుర్తించినప్పటకీ, పార్టీ వాళ్లని సహాయకులుగా మాత్రమే చూసింది.

నిజాం రాజ్యంలో భూస్వామికి భూమి మీదే కాదు ఆ భూమి నాశ్రయించుకుని బ్రతికే ప్రతి మనిషి మీదా హక్కు వుండేది. పెద్ద భూస్వాములుగా తెలంగాణా జమీందారులు రైతులను - స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా తమ స్వంత ఆస్తిగా పరిగణించేవాళ్లు. ఆ వ్యవస్థలో స్త్రీలు పురుషులకంటే బాధలు పడ్డారు. నీ బాంచెను దొరా అన్నది తెలంగాణా రైతాంగానికి ఊతపదం అయిపోయింది. బాంచెను అంటే బానిసను అని అర్థం. ఆనాటి దుర్మార్గపు వ్యవస్థకు, నిజాం ప్రభుత్వానికి, భూస్వాములకు, దొరలకు, రజాకార్లకు వ్యతిరేకంగా సమసమాజ నిర్మాణ లక్ష్యంతో సాగిన నాటి సాయుధ రైతాంగ పోరాటంలో స్త్రీలు సమధికోత్సాహంతో పాల్గొన్నారు. దళాల్లో సాయుధులుగా పాల్గొని రజాకార్లను ఎదుర్కొన్నారు. వారిలో కొందరు స్త్రీలను ఇంటర్వ్యూ చేసి రూపొందించిన పుస్తకమిది. మామూలు చరిత్ర చెప్పని విషయాలెన్నో ఈ స్త్రీల గొంతుల్లో వినవచ్చు.

చాకలి ఐల్లమ్మ జ్ఞాపకాలు....

...అప్పుడు కమ్మరాయన ఇల్లు గాలబెట్టిండ్రు..ఇద్దరన్నదమ్ములను సంపిండ్రు..ఒక

కోమటాయన్ను సంపిండ్రు..కుమ్మరోల్ల పిల్లలగాన్ని సంపిండ్రు..గొల్లోల్ల పోరగాడు గొర్లను

దోల్తాంటె సంపిండ్రు...సెట్టుగ్గట్టేసి సంపిండ్రు...వాల్ల కడుపులు గాల...ఆడోళ్లను ఆగం

చేసిండ్రు...ఇగ నేను లేని టైముల.. నా బిడ్డను గూడ కరాబు జేసిరి...నా బిడ్డ పేరు సోము నర్సమ్మ. ఇద్దరు పిల్లలు పుట్టిండ్రు.. అప్పుడు సంటిపిల్ల తల్లి...పచ్చి బాలింత..కొట్టిండ్రు...కరాబు చేసిండ్రు. ఇగ నా బిడ్డను అ ల్లుడు దీస్క వోలె. ఆ అ ల్లుడు

పాడుగాను..వాడు దీస్కవోలె. మల్లో దాన్ని దెచ్చుకున్నడు….

ఆడోల్ల , మొగోల్ల గడీలకి దీస్కపోతాంటె ఊళ్లోల్లు మేం సచ్చిన మంచిదెగని ఆడోల్లని

పోనియ్య మన్నరు. పోనిత్తరా? ఇప్పుడయితె .. నువ్వు సత్తె నాకేంది...నేను సత్తె

నీకేంది...అన్నట్టుండె..ఆ ఇప్పుడయితే నేను సత్తె నాది తిందామని నీకుండె... గట్ల.. ఇప్పటి సంగమేంది... వస్తరు ..సూసుకుంట వోతరు..వొచ్చినోల్లకింత వండి పెడ్తరు.. తింటరు..అప్పుడు బయముండేది.. ఇప్పుడెక్కడిది? అప్పటి సంగానికి..ఇప్పటి సంగానికి చాన తేడుంది.

అప్పుడు సంగమంటె మురిసిన... సంగమంటె పేదోళ్లు సమంగుండాలని...ఆ రాజ్యం

రావాలని... అప్పుడు జెప్పిండ్రు...ఇప్పుడు తిన్నోల్లె తింటాండ్రు..పేదోనికిత్తాండ్రా...వాని

కడుపు గాల వాడే తింటాండు.పేదోల్ల కొస్తాందా మరిప్పుడు...పోరాటం జేసినం..సేస్తె

మాత్రం...పోరాటం జేసినోల్లున్నరా..పోయిరి, సేసినోల్లు సచ్చిరి..

పాలకుర్తిలోని చాకలి ఐలమ్మ లాగే ఆనాటి పోరాటంలో పాల్గొన్న మరికొందరు మహిళల కమలమ్మ, ప్రియంవద, సుగుమ్మ, ప్రమీలాతాయి, కోటేశ్వరమ్మ, దూడల సాలమ్మ, సూర్యావతి, అచ్చమాంబ, ్మబిలున్సీబి బాజీ, రజియా బేగం, మోటూరి ఉదయం, బ్రిజ్‌రాణీ, లలితమ్మ, పెసర సత్తెమ్మ, మల్లు స్వరాజ్యం, అక్కిరాజుపల్లి మహిళలు మొదలైన వారి అనుభవాలు, జ్ఞాపకాలు, ఇంటర్వ్యూలు ఇందులో వున్నాయి.

324 పేజీలు, వెల రూ.50

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌