Saturday, May 30, 2009

వేమన్న వాదం ... సంకలనం, వ్యాఖ్యానం : డా.ఎన్‌. గోపి...వేమన్న వాదం ...

నిజానికి వేమన పద్యాలకు వ్యాఖ్యానం అవసరం లేదు.

కానీ సరళ సుందరమైన వేమన పద్యాల్లో కూడా ఆలోచిస్తేగానీ తట్టని అర్థాలు బోలెడన్ని కనిపిస్తాయి. ఇప్పటికే వేమన పద్యాలకు చాలా వ్యాఖ్యానాలు వచ్చినా వేమన్న వేదననూ, అసమానతలమీద అంతులేని కోపాన్నీ, భావోద్వేగాన్నీ, వాటికి నేపథ్యంలో వున్న నాటి సంఘాన్నీ పక్కకి నెట్టి చిలుక పలుకుల్లాగా వేమన్న కేవలం నీతిసూత్రాలు వల్లించాడన్నట్టుగా వెలసిన తాత్పర్యాలే ఎక్కువ.

వీటిలో కూడా బ్రౌనే కొంత నయం.
మూలం మీది గౌరవంతో ఎందరినో విచారించి, ఎంతో పరిశ్రమతో లఘు వ్యాఖ్యలతో సహా ఇంగ్లీషులోకి అనువదించాడు. కానీ బ్రౌన్‌కు కూడా వేమన్న భాషా, తేటగా చెప్పే పద్ధతీ పట్టినంతగా వేమన భావాలూ, వాదాలూ పట్టలేదు. దీనికి బ్రౌన్‌ను తప్పుపట్ట నవసరం లేదు. ఆయనది ప్రధానంగా భాషా దృష్టి.

వేమన్నను అతని కాలంనాటి సామాజిక సన్నివేశంలో చూడాలనే ఆ లోచన మనకింకా సరిగ్గా కుదురుకోలేదు. వేమన పద్యాలు అప్పటి కాల పరిస్థితులకు ప్రతిస్పందనలుగా, ప్రతీఘాతాలుగా వెలువడ్డాయనే దృష్టితో చూస్తే వేమన పద్యాలు మనకు కొత్త వెలుగుల్తో కనిపిస్తాయి.
అటువంటి ప్రయత్నంలో ఒక చిన్న ప్రారంభమే ''వేమన్న వాదం''.

(- డా.ఎన్‌.గోపి, 'వేమన పద్యాల నేపథ్యం' నుంచి)

... ... ...

తెలుగు పాఠకుల్లో విజ్ఞాన చైతన్యాలను కలిగించటం హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానాశయాలు. అందునుగుణంగా ''వేమన్న వాదం'' మొదటి ముద్రణతో పాఠకులతో పరిచయం ఏర్పరచుకున్నాం. మా ప్రయత్నాన్ని పాఠకలోకం హర్షించినందుకు ఎంతో ఆనందిస్తున్నాం.

సంవత్సరం తిరకక్కుండానే ''వేమన్న వాదం'' సాధారణ ప్రతులన్నీ అమ్ముడయిపోయినాయి. అంతేకాక ఈ పుస్తకాన్ని చదివిన వారు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టును అభినందిస్తూ ఉత్తరాలు రాశారు.

తెలుగువారిని అవాస్తవిక భ్రమల్లో ముంచెత్తే కాల్పనిక సాహిత్యం కొంతకాలం నుంచీ తెలుగునాట స్వైరవిహారం చేస్తున్నది. ఇది చాలక ఇటీవల మంత్ర తంత్రాలతో, గడుసుదయ్యాల కథలతో కుహనా శాస్త్రీయ ధోరణిలో మూర్ఖ విశ్వాసాలకు కొత్తవేషం వేసే సాహిత్య మొకటి బయలుదేరింది.

వీటి తాకిడిని తట్టుకొని వేమన్నవాదంతో మొదలైన హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలు పాఠకుల్లోకి చొచ్చుకుపోవటం మాకు ప్రత్యేకంగా సంతృప్తి కలిగించే విషయం. కొన్ని పరిమితులకు లోబడిఅయినా ''వేమన్న వాదం'' ఈ అశాస్త్రీయ భావాలను ఎదుర్కోగలదని మా విశ్వాసం.
అందువల్ల వేమన్న వాదం అవసరం ఇంకా వుంది.
ఈ పుస్తకం రెండో ముద్రణ తీసుకురాగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాం.

(- చేకూరి రామారావు, 'రెండో ముద్రణ సందర్భంలో' నుంచి)

... ... ... ...

భూమి నాదియన్న భూమి పక్కున నవ్వు
ధనము నాదియన్న ధనము నవ్వు
కదనభీతు జూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ

చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత?
విశ్వదాభిరామ వినురవేమ


వేమన్న వాదం
వ్యాఖ్యాత : డాక్టర్‌ ఎన్‌. గోపి


ప్రథమ ముద్రణ: జులై 1980
పునర్ముద్రణ: 1981, 1984, 1987, 1992, 1998, 2003

88 పేజీలు, వెల : రూ.25


ప్రతులకు, వివరాలకు:


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500067
ఫోన్‌: 040-2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

.....................................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌