Thursday, May 7, 2009

సత్యహరిశ్చంద్రుని కథలో స్లోపాయిజన్‌ లాంటి సందేశాలు !


పురాణాలు - కుల వ్యవస్థ
సత్య హరిశ్చంద్రుడు
-డాక్టర్‌ విజయ భారతి


హేతువాద దృష్టితో పురాణాలను పరిశీలించినట్లయితే ఎన్నో ఆసక్తికరమైన వాస్తవాలు బయటపడతాయి.
ఇందుకు హరిశ్చంద్రుని వృత్తాంతం ఒక తార్కాణంగా పేర్కొనవచ్చు.
పురాణాల్లో ప్రముఖంగా ప్రస్తావించబడిన షట్చక్రవర్తులలో హరిశ్చంద్రుడు మొట్టమొదటివాడు.
త్రేతా యుగానికి చెందిన ఈ రాజు ప్రభావం మన సమాజం మీద ఇప్పటికీ బలంగా వుంది.
హరిశ్చంద్రోపాఖ్యానం, ''కాటి కాపరి'' ఏక పాత్రాభినయం ప్రేక్షకులను ఇప్పటికీ అ లరిస్తూనేవున్నాయి.

హరిశ్చంద్రుని కథ పైకి సత్యవ్రతాన్ని చాటేదిగా కనిపించినప్పటికీ దాని అసలు లక్ష్యం వర్ణ వ్యవస్థ పునాదులను పటిష్ట పరచడం, పాతివ్రత్యం పేరిట స్త్రీలను అణచివేయడం.

హరిశ్చంద్రోపాఖ్యానంలో అంతర్లీనంగా వుండే ఈ సందేశాలు స్లో పాయిజన్‌ వంటివి.

వరుణుడి కరుణతో పుత్ర సంతానాన్ని పొంది వరుణుడు పెట్టిన షరతును ఉల్లంఘించినప్పుడే హరిశ్చంద్రుని సత్యవ్రతం బట్టబయలవుతుంది.
హరిశ్చంద్రుడు రాజ్యాన్ని కోల్పోయింది కూడా కుల దురహంకార ప్రదర్శన మూలంగానే తప్ప అన్యధా కాదు.

విశ్వామిత్రుడి పెంపుడు కూతుళ్లైన మాతంగ (మాల మాదిగ) కన్యలను పెళ్లి చేసుకొమ్మనే ఒత్తిడి వచ్చినప్పుడు హరిశ్చంద్రుడు అహంభావంతో రాజ్యాన్నైనా వదులుకుంటాను గానీ నీచ కుల కాంతలను పెళ్లాడను అని చిక్కుల్లో పడిపోతాడు.

ఆ తరువాత బాకీ తీర్చేందుకు భార్యాబిడ్డల్ని వ్యక్తిగత ఆస్తిలాగా అమ్మేస్తాడు.
నక్షత్రకుడు తనని ఓ ఛండాలుడికి అమ్మబోయినప్పుడు ఇంత బతుకు బతికి నీచ కులస్తుడికి దాస్యుడ్ని కావడమా అని ఎంతగానో గించుకుంటాడు.

ఈవిధంగా కులవ్యవస్థ వికృత రూపం, సత్యవ్రతంలోని డొల్లతనం, స్త్రీల దైన్య స్థితిగతులు పలు సందర్భాల్లో బయటపడతాయి. మార్కెండేయ పురాణం, స్కంధ పురాణం, హరిశ్చంద్రోపాఖ్యానాలను ప్రామాణికంగా చేసుకుని డాక్టర్‌ విజయభారతి గారు హరిశ్చంద్రుని కథను మరో కొత్త కోణంలో విశ్లేషిస్తున్నారు.

డాక్టర్‌ విజయభారతి గారు తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్‌, ఫూలే జీవిత చరిత్రలు ముఖ్యమైనవి. లోగడ వీరు రచించిన ''వ్యవస్థను కాపాడిన రాముడు'', ''పురాణాలు-కుల వ్యవస్థ: దశావతారాలు'', ''షట్చక్రవర్తులు'' పుస్తకాలను ఈ బ్లాగులో పరిచయం చేయడం జరిగింది.

పురాణాలు - కుల వ్యవస్థ
సత్య హరిశ్చంద్రుడు
-డాక్టర్‌ విజయ భారతి

38 పేజీలు, వెల: రూ.15/-


..............................

1 comment:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌