మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Monday, November 16, 2009
బషీర్ ఫకీర్ సూఫీ ఫన్‌కార్ (కళాకారుడు). ...సాక్షి సమీక్ష ...
బషీర్ కథలు
అతను వేరు, అతని సృజన వేరు కాదు.
అతని ఆత్మ, అతని అక్షరం రెండూ ఒక్కటే.
రచయితగా కావచ్చు, అతని రచనలు కావచ్చు, అతనే కావచ్చు- మొదటి నుంచి చివరి దాకా క్రమంగా అర్థం కావచ్చు, కాకపోనూ వచ్చు.
ఎంత కొంచెం జ్ఞానమైనా, అదీ అత్తరబుత్తర గున్నా, జ్ఞానం జ్ఞానమే.
జ్ఞానమే జీవితం.
అందుకే ఆ మహాసముద్రుడి నుంచి ఓ నాలుగు జ్ఞానం చుక్కల్ని నెత్తిన చల్లుకుంటాను!
పద్మశ్రీ వైకం మహమ్మద్ బషీర్‌కు కథకుడిగా భారతీయ సాహిత్యంలో పెద్దపేరు. అతను పుట్టిన ఊరు 'వైకం'. అదే అతని ఇంటిపేరయింది. నివసించిన ఊరు 'బేపూర్' పేరిట మేపూర్ సుల్తాన్ బిరుదయింది. అతని కథలు చదువుతుంటే మామూలు దిన చర్య రాసుకున్నట్లే వుంటుంది. ఎవరైనా కథలు రాయగలరు అనిపిస్తుంది. ఇల్లు కట్టుకుంటే కథ షల్లుకున్నాడు. బిడ్డ పుడితే కథను సృష్టించాడు. గాంధీజీని ముట్టుకోవడం కథ అయింది. మానసిక అనారోగ్యంతో దవాఖానలో చేరితే కథా రచన ఉపశమనం ఇచ్చింది.
కళాత్మక కత తెలిసిన జీవిత కథకుడాయన. ఏ వస్తువును తీసుకున్నా అద్భుత సాహితీ రూపాన్ని తీసుకుంది. విభిన్న కథలను రాసిన కథా ప్రేమికుడు. స్వతంత్ర పోనరాట కథలు, జైలు కథలు, తాత్విక కథలు, ప్రేమ కథలు ఇలా ఏ అంశం గురించి రాసినా మనం చదవకుండా, ప్రభావితం కాకుండా వుండలేం.
మన తెలుగు కథలకు భిన్నంగా వుండే ఏనుగులను దొంగిలించే వాళ్ల కథలు ఎంతో ఆసక్తికరంగా వున్నాయి. అంతేకాదు ఎంతో జటిలమైన అంతర్మథనాలూ ఎంతో సులువుగా అర్థమైపోతాయి. చాలా కథల్లో పునరావృతమయ్యే అతని కొన్ని పాత్రలతో, ఆ వాతావరణంతో కలిసిపోతాం. ప్రతి కథలో బషీరే నేరుగా పాఠకులకు కథ చెప్తుంటాడు. విస్మయాన్ని కలిగించే విషయాలున్నా, చదువుతూ పోతుంటే చాలా మామూలుగా జరిగిపోయినట్లు అనిపిస్తాయి. మనింట్లోనో, మనకు పరిచయమున్న బజార్లోనో, మనూర్లోనో జరిగినట్లుంటాయి. సంఘటనలన్నీ, ఎంతో విస్తృతమైన తన జీవితానుభవాలను, సామాజిక వాస్తవికతలను ఆవిష్కరించటమే ప్రధానం కానీ, ఏ శిల్పంలో చెప్పాలనేది అతనికి ప్రధానం కాదు. ఆ వస్తువే దాని శిల్పాన్ని మలచుకుంటుంది. శ్రద్ధ చూపించినట్లు అన్పించకపోయినా అతనో గొప్ప ఫన్‌కార్ (కళాకారుడు).
చాలా వరకు కథలన్నీ ఫస్ట్ పర్సన్‌లో ఆత్మకథనాత్మక ధోరణిలో సాగుతాయి. బషీర్ పేరుతోనే నేరేషన్ సాగుతుంటుంది. ఆతని వ్యక్తీకరణలు ఎంత అద్భుతంగా వుంటాయో!
ఉదాహరణకు ఓ రెండ చూడండి. ''జమీలా... కన్నీళ్లన్నీ కూజాలోకి పడేలా ఏడువు. వృథా కాకుండా నేను స్నానం చేస్తాను- ప్రపంచాన్ని మార్చేయాలి. జరిత్ర తిరగరాయాలి. లోకాన్ని నెత్తుట్లో స్నానం చేయించి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. ఆత్మగౌరవం దెబ్బతినకుండా ప్రేమించాలి. యవ్వనంలో ఆలోచనలకు సలాం- మతాలకతీతంగా పిల్లల పేర్లు - చిన్నకథ, నాటకం, వచన కవిత ఆకాశం, ఆలిచిప్ప, చాక్లెట్, రొయ్యకన్ను, నక్షత్రం, తుఫాను అని పెట్టుకుందాం.
అతన్ని చదవటం షురూ చేస్తే ఎదురుగా వచ్చి కూర్చుని నింపాదిగా కథలు చెప్తున్నాడనుకుంటాం. చదవటం పూర్తయ్యాక మనకు మనం అర్థమైపోతాం. కథలు సుదీర్ఘంగా నడుస్తున్నట్లే వుంటాయి. కానీ నవలలా సాగదీయని కథా కళాత్మకతా రహస్యాలు అతనికి తెలుసు.
తెలుగు కథల్లో ముస్లిం జీవితం పది, పదిహేను సంవత్సరాల నుంచే వస్తున్నది. కానీ బషీర్ యాభై సంవత్సరాల క్రితమే రాశాడు.
''ఫాతిమా మేక'', ''మి గ్రాండాడ్'' లాంటి పెద్ద కథలు లేదా నవలికలు సాహితీ ప్రేమికులు తప్పక చదివి తీరాల్సినవి.
అన్ని కథలూ చదివాక బషీర్ ఆత్మకథను చదివినట్లు అనిపిస్తుంది.
అతని కుటుంబం మన కుటుంబం అయిపోయినట్టు అనిపిస్తుంది.
ఆలస్యంగానైనా ''బషీర్ కథలు'' హెచ్‌బిటి వాళ్లు తెలుగు వారికి పరిచయం చేయటం ఎంతో అభినందనీయం. (ఈ పుస్తకం అన్ని ప్రధాన బుక్ షాపుల్లోనూ దొరుకుతోంది). అతని మిగిలిన సాహిత్యాన్ని కూడా ఇంకో పుస్తకంగా తీసుకురావాలని విన్నపం.
- బా రహమతుల్లా
సాక్షి దినపత్రిక 16 నవంబర్ 2009.
……………………………….
ఇందులోని కథలు:
1. ఒక ప్రేమ లేఖ 2. ఏనుగుల దొంగ - బంగారు శిలువ 3. పూవన్ బనానా 4. బంగారు ఉంగరం 5. దుడ్డులాఠీ పణిక్కర్ 6. అమ్మ 7. మోసకారి కూతురు 8. తాయెత్తు 9. విశ్వవిఖ్యాత ముక్కు 10. ఏకాంత తీరం 11. గోడలు 12. ఒకనాటి ప్రేమకథ 13. పుట్టిన రోజు 14. టైగర్ 15. ఒక మనిషి 16. అవని తల్లికి అసలైన వారసులు 17. అనల్ హఖ్ 18. శబ్దాలు 19. ఏనుగు పిలక 20. పాత్తుమ్మా మేక కథ నేపథ్యం 21. పాత్తుమ్మా మేక
ఈ కథలను తెలుగులోకి అనువదించినవారు:
సి.అనంత్, జి.షేక్‌బుదన్, విమల, ప్రభాకర్ మందార, సి.వనజ, హెచ్చార్కె, పి.సత్యవతి, ఎస్.జయ, భార్గవ, కాత్యాయని, ఆకెళ్ల శివప్రసాద్, సంధ్య, కలేకూరి ప్రసాద్, పట్నం ఉమాదేవి.
...............
బషీర్ కథలు
-వైక్కం మొహమ్మద్ బషీర్
ముఖచిత్రం: శంకర్
మొదటి ముద్రణ: ఆగస్ట్ 2009
289 పేజీలు, వెల: రూ.100
.....................
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్-500067
ఫోన్: 040 2352 1849
EMail ID : hyderabadbooktrust@gmail.com
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment