Saturday, November 28, 2009

సూర్యుడి ఏడో గుర్రం (సూరజ్‌ కా సాత్వా ఘోడా) ... ధర్మవీర్‌ భారతి ... తెలుగు అనువాదం : వేమూరి ఆంజనేయశర్మ ... ముందుమాట : శ్యామ్‌ బెనెగల్‌ ...


సూర్యుడి ఏడో గుర్రం

హిందీ సాహిత్యంలో ఆత్యంత ప్రయోగాత్మకమైన తొలితరం రచన ఇది. నవల కాని
నవల, కథా సంకలనం కాని కథా సంకలనం.

పైకి సాధారణంగా కనిపిస్తూనే నిగూఢమైన మానవ సంబంధాలనూ, ప్రేమ
పరిణామాలనూ అసాధారణ సహజత్వంతో కొత్తకోణం ఆవిష్కరిస్తుందీ ఆధునిక రచన.
ధర్మవీర్‌ భారతి దీన్ని ఆరు దశాబ్దాల క్రితం రాశారు. అయినా నేటికీ వన్నెతగ్గకపోగా
ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్‌ చేతుల్లో (అదే పేరుతో) చలనచిత్రంగా రూపుదిద్దుకుని
అంతర్జాతీయ ప్రాశస్త్యాన్నీ సంతరించుకుంది.
................

శ్యాం బెనెగల్‌ రాసిన ముందు మాట నుంచి ...

1980ల చివర్లో అనుకుంటా... ఓ రోజు షమా జైదీ వచ్చి మీరు ధర్మవీర్‌ భారతి రాసిన ''సూరజ్‌కా సాత్వా ఘోడా'' నవల చదివారా? అని నన్నడిగారు. స్క్రిప్టులు రాయటంలో చిరకాలంగా నాకు సహకరిస్తున్న ఆమె ఆ సమయంలో ఈ నవల ప్రస్తావన తేవటానికి ఓ చిన్న నేపథ్యం ఉంది. ... ...

ఇదిగో సరిగ్గా అప్పుడే ''సూరజ్‌ కా సాత్వా ఘోడా'' నా కంటబడింది షమా జైదీ ద్వారా! దాన్ని చదువుతూనే కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ నవల సినిమా హక్కులు కొందామనుకుని వెంటనే ధర్మవీర్‌ భారతిని సంప్రదించాను గానీ ... అప్పటికే దాన్ని టీవీ
సీరియల్‌గా తీస్తానన్న ఓ నిర్మాతకు హక్కులు అమ్మటమో లేక మాట ఇవ్వటమో జరిగిందని చెప్పారాయన. ప్రాణం ఉసూరు మనిపించింది.
....

''సూరజ్‌ కా సాత్వా ఘోడా'' నవలలో ఎన్నో కథలున్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని, బిగువుగా అ ల్లుకుపోతూ చదువరులకు గాఢమైన, నిగూఢమైన అనుభూతిని కలగజేస్తాయి. అ లాంటి దీన్ని విడి విడి భాగాలుగా ముక్కలు చేసి, టీవీ
సీరియల్‌గా నడిపిస్తే... పురి విప్పిన దారంలా ... ఆ అ ల్లిక, బిగువు, పొందిక... ...అన్నీ పేలవంగా తేలిపోతాయనిపించింది. చూస్తూ వుండలేక, ఆ టీవీ ప్రొడ్యూసర్‌తో ఎలాగైనా తెగతెంపులు చేసుకోవాలని ధర్మవీర్‌ భారతిపై ఒత్తిడి తేవటం ఆరంభించాను.

నిజానికది నా తత్వానికి సరిపడని పనే. ముందెన్నడూ ఇలా చేయలేదు, భవిష్యత్తులో చేస్తాననీ అనుకోను. కానీ అప్పటికీ, ఇప్పటికీ కూడా నా విశ్వాసం ఏమంటే - అసాధారణ ప్రాముఖ్యం గల ఈ నవలను ఏ ముక్క కాముక్కగా విడగొట్టటం,
ఇందులోని ఒక్కో కథనూ ఒక్కో ఎపిసోడ్‌గా మలిచి సీరియల్‌గా తియ్యటం సరికాదని! మొత్తానికి కొన్ని నెలలు పెనుగులాడి దాన్ని ఎలాగైనా సాధించగలిగాను.
.... .... ....

ఇక నవల గురించి చెప్పుకోవాలంటే ... నాటి సమకాలీన భారతీయ సాహిత్యంలో అత్యంత ఆధునికతను సిద్ధించుకున్న ''మోడర్నిస్ట్‌'' నవలగా దీన్ని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. అనువాద రూపంలో ''సూర్యుడి ఏడో గుర్రాన్ని'' నేటితరం తెలుగు
పాఠకుల ముందుకు తెస్తుండటం ముదావహం.

ధర్మవీర్‌ భారతి గురించి వినని, భారతీయ సాహిత్యంపై ఆయన వేసిన ముద్ర ఏమిటో అంతగా తెలియని కొత్త తరానికి ఇదో అమూల్యమైన కానుక అని భావిస్తున్నాను.


- శ్యాం బెనెగల్‌

4 జులై 2009

సూర్యుడి ఏడో గుర్రం
ధర్మవీర్‌ భారతి

(సూరజ్‌ కా సాత్వా ఘోడా - హిందీ నవల)
తెలుగు అనువాదం: వేమూరి ఆంజనేయ శర్మ

ముందు మాట : శ్యాం బెనెగల్‌
మలిమాట : ఎన్‌. వేణు గోపాల్‌
ముందుమాట అనువాదం: అనంత్‌

115 పేజీలు, వెల: రూ.50

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

E Mail ID : hyderabadbooktrust@gmail.com

1 comment:

  1. ఈ నవల ఆధారంగా శ్యాం బెనెగల్ తీసిన సినిమా చూసి అచ్చెరువొందాను. ఇప్పుడు నవల చదవాలి. ఈ నవలను తెలుగులోకి తెచ్చినందుకు అభినందనలు.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌