Sunday, November 29, 2009

వనవాసి - బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ (పథేర్‌ పాంచాలి రచయిత) - తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం...


వనవాసి (నవల) ...

భారతీయ సాహిత్యంలో అజరామరంగా నిలబడే గొప్ప బెంగాలీ నవల ఇది. ''పథేర్‌ పాంచాలీ'' నవలాకర్తగా విఖ్యాతినొందిన బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ కలం నుంచి జాలువారిన మరో అపురూప రచన ఇది. పథేర్‌ పాంచాలితో సమానమైన ప్రాచుర్యం దీనికి లభించనప్పటికీ ఇది కూడా అంతటి (లేదా అంతకంటే ఎక్కువే) విశిష్ట రచన అన్నది వివేచనాపరులైన విమర్శకుల అభిప్రాయం.
నానాటికీ అంతరించిపోతున్న అరణ్యాలు, కనుమరుగైపోతున్న మన జీవనం గురించి ఇంతటి హృద్యమైన అనుభూత్యాత్మక రచన మరోటి మన సాహిత్యంలో అరుదనే చెప్పవచ్చు.

.....

ముందుమాట నుంచి ...


బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ (1894-1950) బెంగాలీలో రాసిన 'అరణ్యక' నవలకి అనువాదం 'వనవాసి'. అరణ్యక నవల 1938 ఏప్రిల్‌లో మొట్ట మొదటగా ప్రచురింపబడింది.

భిభూతి భూషణ్‌ అనగానే పాఠకుల మనసులో 'పథేర్‌ పాంచాలీ' మెదులుతుంది. సత్యజిత్‌రే తన చిత్రం ద్వారా పథేర్‌ పాంచాలికి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిపెట్టిన విషయం పాఠకులకు తెలుసు. ''వనవాసి''ద్వారా భభూతి భూషణ్‌ తెలుగు పాఠకులకు మరింత చేరువయ్యారు.

డెబ్భై ఏళ్లక్రితం రాయబడిన నవల వనవాసి. అప్పటికీ ఇప్పటికీ వాతావరణ పిరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. భౌగోళిక ఉష్ణోగ్రత నానాటికీ పెరిగి పోతోంది. వర్షాభావం వల్ల రాబోయే కాలంలో జరగబోయేవి జల యుద్ధాలేననిపిస్తుంది.

వంద సంవత్సరాల క్రితం భారత భూభాగంలో 40% ఆక్రమించుకొని వున్న అడవులు 1997 నాటికి 19% అయ్యాయి. కాస్త హెచ్చుతగ్గులున్నప్పటికీ మొత్తం మీద అడవులు అంతరించి పోతున్నాయన్నది వాస్తవం. అభివృద్ధి పేరుతో అడవులు కనుమరుగవు తున్నాయన్నది చేదు నిజం.

అరణ్య ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే ఆదిమ జాతుల సంక్షేమం ప్రశ్నార్థకమవుతోంది. అత్యధిక ప్రజానీకానికి ఉపయోగపడకుండా పేద బడుగు వర్గాలని నిర్వాసితులను చేసే అనివృద్ధి అధివృద్ధికాదు. ఈ దృష్టితో చూసినప్పుడు సాహిత్యంలో ''వనవాసి'' వంటి నవలల అవసరం అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ.

ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ మనదేశంలోకి ప్రవేశించి ప్రజల ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్లో సంక్షోభాన్ని సృష్టిస్తున్న సందర్భంలో; కాలుష్య భూతం భోగోళాన్ని కబళించడానికి పొంచివున్న తరుణంలో, కుల, మత, వర్గ, ప్రాంతీయ వైరుధ్యాలతో మనిషి ఘర్షణపడుతూ ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న సమయంలో; స్వచ్ఛమైన ప్రాణవాయువును అతి స్వచ్ఛమైన అరణ్య వృక్షాల మీద నుంచి సభ్య సమాజపు నాగరికత సోకని అరణ్యవాసుల స్వచ్ఛమైన జీవితాలనుంచి మనకందిస్తున్నాడు రచయిత ఈ నవల ద్వారా.

...

అభివృద్ధి అంటే ఏమిటన్నది నేటికీ చర్చనీయాంశమే.

చలం ''జీవితాదర్శం'' చదివాక భీమ్లీ సముద్రం చూడాలని మనసు ఆరాటపడేది. అట్లాగే వనవాసి నవల చదివాక ఆ అరణ్యాలన్నీ సంచరించాలనే ప్రగాఢ వాంఛ పీడిస్తుంది.

రచయిత తనతో పాటు పాఠకులనీ అరణ్య సంచారం చేయించి అరణ్య ప్రకృతినీ, ప్రకృతితో మమేకమయిన కపటమెరుగని గిరిజనుల స్వచ్ఛమైన జీవనాన్ని అనుభూయమానం చేస్తాడు. మానవ నిర్మితమైన ఉద్యాన వనాలే కాదు సహజ సుందరమైన అరణ్య ప్రకృతినీ, వనాలనీ సందర్శాన స్థలాలుగా ఏర్పాటుచేసి అడవుల నిర్మూలనకి వ్యతిరేక దిశగా ఉద్యమించాల్సిన అవసరముంది.
వన విహారానుభూతిని స్వయంగా అనుభవించగలిగితే భిభూతి భూషణుని తపనలోని గాఢత ఏమిటో అర్థం చేసుకోగలుగుతాం. అతడు మన ఆత్మలమీది పొరల్ని తొలగిస్తున్నాడు. అతడి చేయిపట్టుకుని దుర్గమారణ్యంలోకి ప్రవేశించడానికి మనం సిద్ధం కావాలి మరి!

...

ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువందించిన సూరంపూడి సీతారాం తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లిలో జన్మించారు. దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో ఉద్యోగాలు చేశారు. ఢిల్లీ ఆకాశవాణిలో, చెన్నైలో ఆంధ్రప్రభలో, కలకత్తాలో ఈస్టర్న్‌ ఎక్స్‌ప్రెస్‌లో,ఆంధ్రపత్రికలో, చివరగా భారతీయ సమాచారవిభాగంలో పనిచేసి 1981లో పదవీ విరమణ పొందారు. సహజ సుందర అనువాదాల రూపంలో ప్రపంచ సాహితాన్ని తెలుగు పాఠకులకు దగ్గర చేసిన ఘనత ఆయనది. వారు అనువదించిన మహాశ్వేతాదేవి రచనలైన 'హజార్‌ చౌరాసియాకి మా' (ఒకతల్లి), 'డాయిన్‌' (దయ్యాలున్నాయి జాగ్రత్త), 'శ్రీశ్రీగణేష్‌ మహిమ' (రాకాసి కోర) లను గతంలో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. సీతారాం 1997లో మరణించారు.


వనవాసి
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం


తొలి ముద్రణ: అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రి; సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ తరఫున,1961
హెచ్‌బిటి ముద్రణ: సెప్టెంబర్‌ 2009

278 పేజీలు, వెల: రూ.120

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

2 comments:

  1. ఈ పుస్తకం తాలూకు మొదటి ముద్రణ(1961 లో వేసింది) అతి పాత కాపీ ఈ మధ్య నాకు విజయవాడలో దొరికింది. ఇదొక అద్భుత కళా ఖండం! దీన్ని అర్థం చేసుకోవాలన్నా, ఆస్వాదించాలన్నా పుస్తకం చదివే హాబీ, ఓపిక ఉంటే చాలదు. అంతకు మించి వన సౌందర్యాన్ని , ఏకాంతాన్ని అనుభవించగలిగే సౌందర్య దృష్టి, మానవీయ కోణాన్ని అర్థం చేసుకోగలిగే హృదయమూ ఉండాలి.

    ఎక్కువభాగం రచయిత ఏకాంతంగా అడవిలో గడపడాన్ని వర్ణిస్తుంటే బోర్ ఫీల్ కాలేకపోవడం నాకు అనుభవమైంది.అలాగే పచ్చి మినప పిండి తిని జీవించగలిగే నిర్భాగ్యుల జీవితాలు, వారిని పీడించే భూస్వాములు...ఎంత నచ్చిందో ఇది!

    నా బ్లాగులో నేనే పరిచయం చేద్దామనుకుంటూ ఉండగా ఆశ్చర్యంగా ఇక్కడ!

    ఇంతమంచి పుస్తకాన్ని మీరు మళ్ళీ అందుబాటులోకి తెచ్చినందుకు అభినందనలు!

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌