మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Friday, March 20, 2009
అతడు అడవిని జయించాడు ..... డాక్టర్ కేశవరెడ్డి
1984లో ప్రచురితమై పాతికేళ్లపాటు తన అస్తిత్వవాద నిసర్గ సౌందర్యంతో పాఠకులను అ లరించిన కేశవరెడ్డి ''అతడు అడవిని జయించాడు'' నవలిక నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో విశిష్ట రచన.
లేశమాత్రమైన కథాంశంతో,
అనామకుడూ అపరిచితుడూ అయిన నాయకుడితో,
అద్భుతమూ అపూర్వమూ అయిన అరణ్య నేపథ్యంతో
తన రచనను ఒక పురాణగాథ స్థాయికి తీసుకెళ్లారు కేశవరెడ్డి.
కేశవరెడ్డి రచనల్లో సైతం యిది ఒక ప్రత్యేక విశిష్ట రచన.
తెలుగు నవలల్లో అపూర్వం, అనితర సాధ్యం.
కనీసం ఇంకో పాతిక సంవత్సరాలు ఈ నవల తెలుగు సాహిత్యంలో దీపస్తంభంలా నిలబడి దిక్దర్శనం చేయించడంతో పాటు శిష్ట నాగరిక సమాజపు కళ్లు మిరుమిట్లు గొలపుతుందని నిస్సంకోచంగా నమ్మవచ్చు.
'అతడు అడవిని జయించాడు'లో కథా సమయాన్ని రచయిత ఒకానొక సూర్యాస్తమయాన మొదలెట్టి సూర్యోదయానికల్లా ముగిస్తాడు.
ఈ అస్తమయ ఉదయాల మధ్య
పందుల్ని సాకే ఓ అనామక ముసలివాడి బహిరంతర అన్వేషణ,
అడవిలో చిక్కులు చిక్కులుగా ముళ్లుపడి,
మానవ జీవితంలోని అస్తిత్వ సంఘర్షణగా సామాన్యీకరించబడి,
తీగలు తీగలై నిర్నిరోధంగా సాగుతుంది.
గుప్పెడు గంటల వ్యవధిలోనే కొన్ని కఠోర మరణాలు,
యింకొన్ని అదివాస్తవిక జననాలు,
సంక్లిష్ట సందేహాలు,
గుబులు గొల్పే సందిగ్ధాలు,
వెయ్యివెయ్యిగా తలలెత్తే ప్రశ్నలు,
భీతి కలిగించే హింస,
విశ్వం మొత్తాన్ని గుండెల్లో పొదువుకునే అవ్యాజ ప్రేమభావం,
అమాయక వాత్సల్యాలు, విశృంఖలత్వం, విహ్వలత్వం, వైవిధ్యం, మోహం,
గూఢత్వం, మార్మికత్వం, నిష్ఫలత్వం, నిరర్థకత, పాశవికత, నిస్పృహ, నిరీహ -
ముసలివాడి అనుభవంలోకి నిరంతర ప్రవాహంగా ముప్పిరిగొని, అతణ్ణి నివ్వెర పరుస్తాయి.
అతని అంతరంగం ఎక్కడో మొదలయ్యి ఎక్కడో అంతమయ్యే అరణ్యంగా, సిద్ధపరచిన యుద్ధ రంగంగా సాక్షాత్కరిస్తుంది.
..... (-శ్రీనివాస ప్రసాద్ రాసిన ముందుమాట 'అధోమానవుడు అధిమానవుడైన వేళ' నుంచి)
..............
ఈ రచయితలోని రసదృష్టి ఎంత పదునైనదో!
పందిలో నందిని సందర్శించ గలిగేడు.
నైచ్యం అనబడే దానిలో ఔన్నత్యం చూడకలిగేడు.
సేయంలో ప్రేయం అనుభూతించాడు.
దీన్నే కురూపపు సురూపం (ది బ్యూటీ ఆఫ్ అగ్లీనెస్) అంటారు.
రసద్రష్టకు లోకంలో ఏదీ కురూపం కాదు, అంతా సురూపమే.
ఏదీ కునాదం కాదు, అంతా సునాదమే.
( .......... డాక్టర్ సంజీవదేవ్ రాసిన చివరిమాట 'సింహావలోకనం ' నుంచి)
...........
డాక్టర్ కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10న పుట్టారు.
తిరుపతిలో పి.యు.సి., పాండిచ్చేరిలో ఎం.బి.బి.ఎస్. చేశాక నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి విక్టోరియా మెమోరియల్ ఆసుపత్రిలో స్కిన్ స్పెషలిస్ట్‌గా కుష్టురోగులకు సేవలందించారు.
ప్రస్తుతం నిజామాబాద్‌లో వుంటూ ఆర్మూరులో వైద్య సేవలు అందిస్తున్నారు.
కుష్టు వ్యాధిపై వీరు రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.
పాతిక సంవత్సరాలుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యలపట్ల సానుతాపంతో రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసిగిస్తున్నారు.
బానిసలు,
భగవానువాచ,
ఇన్‌క్రెడిబుల్ గాడెస్,
స్మశానం దున్నేరు,
అతడు అడవిని జయించాడు,
రాముడుండాడు రాజ్జిముండాది,
మునెమ్మ,
మూగవాని పిల్లన గ్రోవి,
చివరి గుడిసె,
సిటీ బ్యూటిఫుల్
వీరి రచనలు.
అతడు అడవిని జయించాడు నవలను నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 14 భారతీయ భాషల్లోకి అనువదించారు.
ఇన్‌క్రెడిబుల్ గాడెస్ నవల మరాఠీలోకి అనువాదమైంది.
తన రచనా స్పర్శతో బాధల గాయాలు స్పృశించి,
హృదయాలను తేలకి పరచటం,
అనివార్యమైన జీవిత పోరాటానికి ఉపక్రమించపజేయటమే
తన లక్ష్యమని వినమ్రంగా చెప్పే వీరిది వర్ణాంతర, మతాంతర వివాహం.
కొడుకూ, కూతురూ సంతానం.
..............
అతడు అడవిని జయించాడు
- డాక్టర్ కేశవరెడ్డి
(ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో 1984లో ధారవాహికగా వెలువడింది).
ప్రథమ ముద్రణ: నవోదయ పబ్లిషర్స్, విజయవాడ, 1985
హెచ్.బి.టి. ముద్రణ: ఫిబ్రవరి, 2009
ముఖచిత్రం : కాళ్ల
98 పేజీలు, వెల: రూ.40
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడి మల్కాపూర్, హైదరాబాద్ 500067
ఫోన్ నెం. 040- 2352 1849
.........
ఇ మెయిల్:
http://hyderabadbooktrust.blogspot.com
.....................................
Subscribe to:
Post Comments (Atom)
నేను చదివాను, చాలా బాగుంటుంది, ముఖ్యంగా తప్పిపోయిన పందిపిల్ల ను , పిల్లలతో సహా కనుక్కున్నప్పుడు చాలా బాగుంటుంది.
ReplyDeleteTranslation dorukutunda
ReplyDelete