Tuesday, March 17, 2009

మూలికా వైద్యంతో ఆరోగ్యం ... డాక్టర్‌ జి. లక్ష్మణ్‌రావు



ఉబ్బసం, కడుపులో మంట, నడుంనొప్పి, పార్శ్వపు నొప్పి, వివిధ రకాల తలపోట్లు, చర్మవ్యాధులు, బహిష్టు సమస్యలు, కీళ్ల వాపులు, మూత్రపిండాల్లో రాళ్లు తదితర ఆరోగ్య సమస్యలకు, రుగ్మతలకు మూలికా వైద్యం చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులు అ ల్లోపతి వైద్యంతో పూర్తిగా నిరాశ చెందిన తర్వాతే మూలికా వైద్యం వంటి ప్రత్యామ్నాయ వైద్యాన్ని అశ్రయిస్తుంటారు.

మూలికా వైద్యం చాలా నెమ్మదిగా పనిచేస్తుందని, సత్వర రోగ నివారణ అందించలేదని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది కేవలం అపోహే తప్ప వాస్తవం కాదు. మూలికా వైద్యం అత్యధిక సందర్భాల్లో సత్వరంగానూ, సంపూర్ణంగానూ రోగనివారణ చేస్తుంది. పైగా దీని వలన ఎట్లాంటి దుష్ఫలితాలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) వుండవు.

అమెరికా, కెనడా, బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మూలికా వైదాయనికి తిరిగి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మన దేశం నుంచి విదేశాలకు ఏడాదికి దాదాపు 3,000 కోట్ల రూపాయల మేరకు మూలికలు ఎగుమతి అవుతున్నాయి. అద్భుత ఔషధ గుణాలు కలిగిన వనమూలికలను భారీగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న మనం మన ప్రజల ఆరోగ్యాభివృద్దికి మాత్రం వాటిని సరిగా వినియోగించుకోకపోవడం విచారకరం.

మన దేశంలో వేదకాలం నుండి ప్రజల ఆరోగ్యాభివృద్ధికి మూలికా వైద్యం ఎంతగానో తోడ్పడింది.
చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు అసమాన వైద్యులుగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ప్రపంచంలో అద్భుతమైనవిగా గుర్తింపు పొందిన వందకు పైగా మూలికలలో 49 మూలికలను భారతీయ వైద్యులు వేలాది సంవత్సరాలుగా వాడుతున్నారు. అదేవిధంగా ప్రంపంచంలో అతి గొప్పవిగా గుర్తించబడిన 30 చైనీస్‌ మూలికల్లో 19 మూలికలను మన దేశీయ వైద్యులు అతి ప్రాచీనకాలం నుంచే వినియోగిస్తున్నారు.

ఔషధ గుణాలలో భారతీయ మూలికలు మిగతా దేశాల మూలికలకన్నా ఎంతో మిన్న అని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారతీయ మూలికల్లో ఆస్తమా, మధుమేహం, కీళ్ల వాపులు, నొప్పులు, వెన్నునొప్పి, మానసిక వత్తిళ్లు, నిద్రలేమి, స్త్రీ సంబంధ వ్యాధులకు చక్కటి ఔషధాలు వున్నాయి.
మూలికా వైద్యం గురించి ఈ పుస్తకంలో పొందుపరచిన వ్యాసాలు గతంలో వార్త, ఆంధ్ర జ్యోతి వంటి దినపత్రికలలో ప్రచురించబడ్డాయి.
ఈ పుస్తక రచయిత డాక్టర్‌ జి. లక్ష్మణరావు సివిల్‌ ఇంజనీరు. కొంతకాలం బొంబాయి నుంచి వెలువడే ఓ ఇంగ్లీషు వారపత్రికకు విలేఖరిగా పనిచేశారు. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీలో పిహెచ్‌.డి. చేశారు. ఆయన తన సహజ జిజ్ఞాసా మనస్తత్వం వల్ల, అనూహ్యంగా మూలికా వైద్యంలో ప్రవేశించారు.
ఆయనకు ఒకసారి తీవ్రమైన చిగుళ్ల వ్యాధి వచ్చింది. ఒక దంతం పూర్తిగా కదిలిపోయింది. దంత వైద్యుడు దానిని పీకివేసి బ్రిడ్జికట్టక తప్పదని, ఒక వేళ పీకక పోయినా దానంతటదే ఊడి పోవడం తధ్యమని చెప్పారు. కానీ అందుకు ఆయన ఒప్పుకోక సహజ జిజ్ఞాసతో మూలికా వైద్యం వైపు మొగ్గు చూపారు. రోజుకు మూడు సార్లు జామ చిగురాకులు నములుతూ, ఆ రసాన్ని పుక్కిలిస్తూ పదిరోజుల్లోనే పూర్తిగా శాశ్వతంగా నయం చేసుకోగలిగారు. అదే ఆయన మూలికా వైద్యంలో ప్రవేశించడానికి నాంది అయింది.

ఆనాటి నుంచీ ఆయన మూలికా వైద్యంపై సునిశతమైన పరిశోధనలు చేస్తూ, ప్రాచీన గ్రంథాలను కూలంకషంగా అధ్యయనం చేస్తూ వివిధ పత్రికలలో అనేక పరిశోధనాత్మక వ్యాసాలను ప్రచురించారు. పాఠకుల సౌలభ్యం కోసం ఎంతో శ్రమ తీసుకుని వివిధ మూలికల చిత్రాలను కూడా సమకూర్చారు. సాధారణ జబ్బులతో పాటు తీవ్ర ఆరోగ్య సమస్యలను కూడా అతి తక్కువ ఖర్చుతో నయం చేసుకునే మార్గాలను సూచించే ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి.

మూలికా వైద్యంతో ఆరోగ్యం
- డాక్టర్‌ జి. లక్ష్మణ్‌రావు
235 పేజీలు, వెల: రూ.180/-


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500067
ఫోన్‌ నెం. 040- 2352 1849


ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

............................

1 comment:

  1. ఈ పుస్తకం చాల బాగుంది

    లక్ష్మణ్ రావుగారి గారి
    ఇతర గ్రంధాలు ఏమైనా ఉంటె
    తెలియచేయండి ...మొక్కల ఫోటోలు కలర్ లో ఉంటె
    చాల ఉపయోగంగా ఉండేది
    నావద్ద ౨౦౦౦ రకాల అరుదైన వన మూలికల
    ఫోటోలు ఉన్నాయ్
    కావాలంటే పంపిస్తాను .
    dr.laxmanswamy@gmail.com
    9440511239

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌