Wednesday, March 25, 2009

మూడడుగుల స్వంతనేలతో వామన జైత్ర ''జాతర''



నేలని నమ్మిన రైతు గాధ!


నరేంద్రనాధ్‌ బాల్య జీవితం వడ్డించిన విస్తరని చెప్పవచ్చు-సంపన్న కుటుంబం, అందరూ ఊళ్లో ఉన్నంత విద్య తరువాత ఉన్నత విద్యని అభ్యసించిన వారు అయితే అతను జీవిత పరమార్థం తెలుసు కోవాలనుకున్నాడు. ''నరేంద్రనాథ్‌'' నామకరణం వల్ల వివేకానందుడవ్వాలన్న కాంక్ష ఉగ్గు పాలతో వచ్చిందేమో! అందుకే ఈ నిత్య కృషీవలుడు బలి చక్రవర్తిని, ''అయ్యా, మా కుటుంబసంపదలో ఒక మూడడుగులు అట్టి పెట్టుకోనియ్యి'' అనికోరి, ఢిల్లీలో మంచి ఉద్యోగం వదలి, దారా పుత్రికలతో చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం వెంకట్రామపురం చక్కా వచ్చాడు, ఒక పాతిక సంవత్సరాల కిందట. ఈ పద్ధతిలో గాంధీయానం ఎన్నుకొని, పట్నం వదలి గ్రామవాసులు అయిన బహుకొద్ది మంది ఈ తరం విద్యావంతులలో ఈ సాహసి ఒకడు. తన గడ్డ నుండి ప్రారంభించిన శోధన గాధని ఈ చిన్న పుస్తకంలో పొందు పరచి, చదువరిని తనకు ఎంతయో రుణపరుచుకున్నాడు నరేంద్రనాధ్‌.

తన కృషిలో నరేంద్రనాధ్‌ చేపట్టిన పనులు అనేకానేకం. స్వంత భూమిలో సేంద్రీయ వ్యవసాయం; నీటి సమస్యలు; విద్యుత్‌ సంస్కరణలూ, తన ఇలాకాలోని పేద రైతులమీద వాటి ప్రభావం; భూ సంస్కరణలూ, వాటి ఆచరణలో సమస్యలూ; వీటన్నింటికీ అవసరమయిన ప్రజా పోరాటాలూ; ప్రపంచీకరణం దానివల్ల దాపరిస్తోన్నముప్పు -వేయేల ! ఈనాడు సమాజాన్ని భాధిస్తున్న అన్ని రుగ్మతల గురించీ ఆలోచించి పోరాడుతున్న సవ్యసాచి నరేంద్రనాధ్‌ అనడంలో అతిశయోక్తి లేదు.

తనని తాను రైతు అని చెప్పుకున్నా, నరేంద్రనాథ్‌ నిశితమైన విశ్లేషకుడు కూడా. ఆ సంగతి పుస్తకం ద్వారా తెలుస్తూనే ఉన్నది. సంక్షిప్తంగా వదిలేసిన అనేక విషయాల గురించి నరేంద్రనాథ్‌ ఇంకా లోతుగా, విపులంగా చెప్పగలడు, చెప్పవలసి ఉన్నది. ఆప్రయత్నం కూడా నరేంద్రనాధ్‌ తప్పకుండా చేయాలని అనేకథా ఆశిస్తూ, అందరూ చదువవలసినదిగా ఈ చిన్న పుస్తకాన్ని స్వాగతిస్తున్నాను.

ఎం.వి.శాస్త్రి
(వార్త దిన ప్రత్రిక 15-3-2009)

''ఇట్లు ఒక రైతు'',
- గొర్రెపాటి నరేంద్రనాధ్‌,


పేజీలు 138, వెల రూ..50,

ప్రథమ ముద్రణ: ఫిబ్రవరి 2009,

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85,
బాలాజి నగర్‌,
గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500028
ఫోన్‌ నెం. 040-2352 1849
.....................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌