Thursday, March 5, 2009

ఆనాడు 'సాక్షి'లో ప్రచురణకాని ఒక అభిప్రాయం!


మునెమ్మ నవలపై జరిగిన చర్చ -
నన్నెందుకు కాత్యాయని కులం పేరుతో దూషించాలి?
ఆనాడు 'సాక్షి'లో ప్రచురణకాని ఒక అభిప్రాయం!


అక్టోబర్‌ 13వతేది (2008) సాక్షి రెండో పేజీలో అమానుషమైన ఫొటో ఒకటి వచ్చింది. ఫొటోని ఎంపికచేయడంలోని అమానుషత్వమది!
బెర్లిన్‌లో జరిగిన డబ్ల్యూబీసీ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ పోటీల్లో నైజీరియా బాక్సర్‌ శామ్యూల్‌ పీటర్‌ ముఖంపై ఉక్రెయిన్‌ బాక్సర్‌ వితాలికిష్కో ఇచ్చిన 'పంచ్‌' ఫొటో అది. అడ్డంగా, పేజీలో సగభాగం వున్న ఈ కలర్‌పోటోకి ఇచ్చిన రైటప్‌, హెడ్డింగ్‌ అంతకన్నా అమానుషంగా వున్నాయి.
''మొహం పచ్చడి'' అనేది హెడ్డింగ్‌!
''ఈ పోటీలో కిష్కోనే విజేత అని ఈ పంచ్‌ చూసిన తర్వాత కూడా చెప్పాల్సిన అవసరం లేదన్నది'' రైటప్‌!!
రెండు రోజులు అన్నం తినలేకపోయాను!

అదేరోజు నాలుగో పేజీలో ఇంకో 'పంచ్‌'!
మొదటి పంచే నయమనిపించే 'పంచ్‌' అది!!
కాత్యాయని అనే వ్యాసకర్త, డాక్టర్‌ కేశవరెడ్డి అనే రచయితను కండలు తెగిపడేలా కొడుతూ కనిపించారు.
ఆ కొట్టడం ఎలా వుందంటే - కేశవరెడ్డి నవల ''మునెమ్మ''లో జయరాముడు బొల్లిగత్తను కొట్టినట్లుగా వుంది.
మునెమ్మ ను చదివాక ఆ కోపం తట్టుకోలేకపోయిన కాత్యాయని - ''రాసేవాళ్లకు చదివేవాళ్లు లోకువా?'' అని అడుగుతూ కేశవరెడ్డిని వెంటబడి వెంటబడి కొట్టినట్లుగా వుంది.

పాఠకుల సంక్షేమం గురించి ఎంచేతనో ఈ మధ్య కథా విమర్శకులు, నవలా సమీక్షకులు అమితంగా ఆందోళన కనబరుస్తున్నారు!
ఇటీవల 'దర్గామిట్ట' సాహితీవేత్త మహమ్మద్‌ ఖదీర్‌బాబు ఇలాగే కలతచెంది ''పాఠకులు క్షమించలేని కథలు'' అంటూ సాక్షిలోనే ఏదో రాశారు. చాలా తెలివిగా రాశారు. పాఠకుడిగా నేను చేస్తున్న ఈ విమర్శ కథకుడిగా నాక్కూడా వర్తిస్తుంది'' అని రాశారు.

కాత్యాయని మాత్రం - సమీక్షో,. విమర్శో తెలియని తన వ్యాసంలో కనీసం అ లాంటి తెలివితేటల్ని కూడా ప్రదర్శించలేకపోయారు!
'గొప్ప' ని సింగిల్‌ కోట్స్‌లో పెట్టి కేశవరెడ్డిని గొప్ప రచయిత అని ఆవిడ అన్నారు.
కొంచెం వ్యంగ్యం కూడా జోడించి - స్త్రీల సమస్యలపై సానుభూతితో కేశవరెడ్డి 'మునెమ్మ' ను రాశారు అన్నారు.
ఆయన చుట్టూ భజన బృందాలు వున్నాయనీ, సమర్థకులు ఆయన వెనుక నిలబడి ఆయన శిరస్సు చుట్టూ కాంతి వలయాన్ని గిరగిరా తిప్పుతూ అది పడిపోకుండా పట్టుకున్నారని, కేశవరెడ్డి ''నేను మార్క్సిస్టును'' అని చెప్పుకుంటూ పేద ప్రజలు - దళిత సమస్యలు అనే రెండు చురకత్తులను జేబులో పెట్టుకు తిరుగుతన్నారనీ అన్నారు.
తెలుగు సాహిత్య రంగం ముఠాలుగా, భజన సంఘాలుగా స్థిరపడిపోయిందనీ, పాఠకుల అజ్ఞానం (!) మీదా (ఆశ్చర్యార్థకం ఒక పాఠకుడిగా నేను పెట్టుకున్నది). విమర్శకుల జడత్వం మీదా ఈ రచయితలకు గొప్ప విశ్వాసం అనీ, విమర్శకులు మర్యాదస్తులుగా స్థిరపడిపోయాక, పాఠకులు అసంఘటిత జీవులుగా నిస్సహాయులయ్యాక ఇంతకన్నా గొప్ప వాతావరణాన్ని ఆశించలేమని చెప్పడానికి కాత్యాయని ఇంత పెద్ద తిట్ల కవనం రాసినట్లున్నారు.!

వీటన్నిటితో నాకు పనిలేదు. కాత్యాయని కేశవరెడ్డిని కొడితే కొట్టారు.
ఫెమినిస్టు కవయిత్రి జయప్రభ జుట్టు పట్టుకుంటే పట్టుకున్నారు.
పోస్ట్‌ మోడర్నిస్ట్‌ క్రిటిక్‌ అంబటి సురేంద్రరాజు నిద్ర చెడగొడితే చెడగొట్టారు.
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ను చింపి పోగులు పెడితే పెట్టారు.
బతికున్న యండమూరి వీరేంద్రనాథ్‌ నోట్లో తులసి తీర్థం పోస్తే పోశారు.
కానీ నన్ను! నన్ను!! నన్నెందుకు కాత్యాయని కులం పేరుతో దూషించారు?!
నన్ను తిడితే తిట్టారు.
నా కులం వాళ్లందరినీ ఎందుకు ఇందులోకి లాగారు?

తన బుర్రలో పుట్టిన పర్వర్షన్లను ఒక నిస్సహాయ స్త్రీకి ఆరోపించి చవకబారు పాఠకులను ఆకట్టుకోవాలని కేశవరెడ్డి తపించిపోయారట!
చ-వ-క-బా-రు పాఠకులు!!
ఎస్‌. నేను కూడా ఒక చవకబారు పాఠకుడినే.
చిన్ననాడే అశ్లీల భావాల పట్ల, అశ్లీల సాహిత్యం పట్ల ఆకర్షితుడైనవాడిని.

2003లో మీరు ... మీరంటే మీలోని గొప్పగొప్ప పురుషపుంగవులైన కవులు, రచయితలు అచ్చువేసి సర్క్యులేట్‌ చేసిన అశ్లీల కరపత్ర సాహిత్యాన్ని కూడా ఇష్టంగా చదివి సమానంగా ఆదరించినవాడిని. అదే నా చవకబారు తనమైందా?
మీరేం రాసినా నమ్ముతున్నాం.
మీరేం రాసినా చదువుతున్నాం.
సృజనశీలురు మీరు.
మీ మాటలో వేదాలు వెదుక్కుంటున్నవాళ్లం మేము.

మీకై మీరు రాయడం మానేసి, ఒకళ్ల మీద ఒకళ్లు రాసుకుంటున్నవీ సీరియస్‌గా ఫాలో అవుతున్నాం.
కాసేపు మమ్మల్ని 'తెలివైనవాళ్లు' అంటారు.
కాసేపు 'అజ్ఞానులు' అంటారు.
చవకబారు పాఠకులని కాత్యాయని అంటారు.
పాఠకులు క్షమించరని ఖదీర్‌ బాబు అంటారు.
మా గురించి అన్నీ మీరే అంటారు.
అన్నీ మీరే అనుకుంటారు.
ఏమిటిదంతా?

రాసేవాళ్లకు చదివేవాళ్లు లోకువైనట్లే, రాసేవాళ్లమీద రాసే వాళ్లకి మేము లోకువయ్యామా?
కథకులు, విమర్శకులు చవకబారుగా రాస్తే, చవకబారుగా మాట్లాడితే ... మావంటి చవకబారు మనుషుల్లో కలిసిపోతారు.

- మాధవ్‌ శింగరాజు
(ఒకానొక చవకబారు పాఠకుడు)
16 అక్టోబర్‌ 2008


(మాధవ్‌ శింగరాజు గారి కోరిక మేరకు ఈ అముద్రిత విమర్శని ఇక్కడ యథాతధంగా పొందుపరచడం జరిగింది. ఇది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాలి. - హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌)

3 comments:

  1. "అక్టోబర్‌ 13వతేది (1998) సాక్షి రెండో పేజీ"---???!!!!

    ReplyDelete
  2. ముద్రా రాక్షసం. సరిచేసాం.
    ధన్యవాదాలు!

    ReplyDelete
  3. కాత్యాయని అసంబద్ధమైన వ్యాసం పుస్తకానికి మేలే చేసింది. ఆ చర్చ తరువాత పుస్తకం కొని చదివినవాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విషయం మీకు తెలిసిందేగా! Even negative publicity is a good publicity.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌